ఆధార్‌తో పాన్‌ జత చేయండి

ఆధార్‌తో శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)ను అనుసంధానం చేశారా? లేకపోతే ఆ పని వెంటనే పూర్తి చేయండి. ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం పాన్‌ పొందిన ప్రతి వ్యక్తీ దాన్ని తన విశిష్ఠ గుర్తింపు సంఖ్య (ఆధార్‌)తో అనుసంధానాన్ని ఈ నెల 31లోగా పూర్తి చేయాలి.

Updated : 10 Mar 2023 03:19 IST

చివరి తేదీ ఈ నెల 31

ధార్‌తో శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)ను అనుసంధానం చేశారా? లేకపోతే ఆ పని వెంటనే పూర్తి చేయండి. ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం పాన్‌ పొందిన ప్రతి వ్యక్తీ దాన్ని తన విశిష్ఠ గుర్తింపు సంఖ్య (ఆధార్‌)తో అనుసంధానాన్ని ఈ నెల 31లోగా పూర్తి చేయాలి. ఇందుకోసం అపరాధ రుసుముగా రూ.1,000 చెల్లించాలి. ఆధార్‌తో జత చేయని పాన్‌ ఏప్రిల్‌ 1, 2023 నుంచి పనిచేయదని ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) హెచ్చరికలు జారీ చేసింది. చెల్లుబాటులో లేని పాన్‌తో నిబంధనల మేరకు లావాదేవీలు చేయడం సాధ్యం కాదు. బ్యాంకు ఖాతా, డీమ్యాట్‌ ఖాతాల్లాంటివి తెరవలేరు. మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేందుకూ నిబంధనలు అడ్డువస్తాయి. దీంతోపాటు ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారు. ఇప్పటికే డీమ్యాట్‌ ఖాతా ఉన్నా షేర్లలో మదుపు చేయడం సాధ్యం కాదు. మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌) విధించాల్సిన చోట అధిక మొత్తంలో పన్ను చెల్లించాల్సి వస్తుంది.

సెక్యూరిటీస్‌ మార్కెట్లోని అన్ని లావాదేవీలకు పాన్‌ కీలక గుర్తింపు. కాబట్టి, తప్పనిసరిగా ఇది చెల్లుబాటులో ఉండాల్సిందే. ఈ విషయంలో ఇప్పటికే మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ మదుపరులకు తగిన సూచనలు చేసింది. పాన్‌-ఆధార్‌ అనుసంధానం లేకపోతే కేవైసీ నిబంధనలు పాటించనట్లుగా భావిస్తారని, దీనివల్ల పెట్టుబడి లావాదేవీలపై పరిమితులు ఉండొచ్చని తెలిపింది. ఈ రెండూ జత చేస్తేనే సాఫీగా పెట్టుబడి లావాదేవీలు సాగుతాయని స్పష్టం చేసింది.


రూ.1,000 చెల్లిస్తేనే..

ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌ www.incometax.gov.in కి వెళ్లి, అక్కడ ‘లింక్‌ ఆధార్‌’ను క్లిక్‌ చేస్తే పాన్‌, ఆధార్‌ సంఖ్య, ఆధార్‌ ప్రకారం పేరు, మొబైల్‌ నంబరును పేర్కొనడం ద్వారా ఆధార్‌-పాన్‌ అనుసంధానం పూర్తి చేయొచ్చు. ముందే చెప్పినట్లు దీనికోసం రూ.1,000 అపరాధ రుసుము చెల్లించాల్సిందే. అప్పుడే ఈ రెండింటి అనుసంధానం కుదురుతుంది.

రెండు పాన్‌లు ఉంటే..: కొంతమంది ఏదైనా కారణంతో రెండు పాన్‌కార్డులు తీసుకుంటే.. అందులో ఒకటి మాత్రమే ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి. కాబట్టి, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇప్పటికే బ్యాంకు ఖాతా, డీమ్యాట్‌ ఖాతా, ఇతర లావాదేవీలకు ఉపయోగించిన పాన్‌నే ఆధార్‌కు జత చేయాలి.

కుదరకపోతే..: ఆధార్‌, పాన్‌లలో వివరాలు ఒకే విధంగా లేకపోతే.. ఈ రెండింటినీ జత చేయడం కుదరదు. ఇలాంటప్పుడు ఆధార్‌లో తప్పు దొర్లిందా, పాన్‌లో పొరపాటు ఉందా చూసుకోండి. ఎక్కువగా పేరు, పుట్టిన తేదీ వివరాల్లో ఈ పొరపాట్లు ఉంటాయి. కాబట్టి, వీటిని సవరించుకున్నాకే అనుసంధానం పూర్తవుతుంది. మీ పాన్‌-ఆధార్‌ జత అయ్యాయా లేదా అనేది ఆదాయపు పన్ను పోర్టల్‌లో ‘లింక్‌ ఆధార్‌ స్టేటస్‌’ ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఇది పూర్తి చేసినా సరే.. ఒకసారి తనిఖీ చేసుకోవడం ఉత్తమం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని