వాహన బీమా..ఎన్‌సీబీ వదులుకోకుండా..

వాహనానికి ఎలాంటి ప్రమాదమూ జరగకుండా చూసుకున్న యజమానికి బీమా సంస్థలు ఇచ్చే బహుమానమే నో క్లెయిం బోనస్‌ (ఎన్‌సీబీ). చాలామంది కొత్త వాహనం కొన్నప్పుడు ఈ ఎన్‌సీబీని బదిలీ చేసుకోవడం మర్చిపోతుంటారు.

Published : 20 Jan 2023 00:48 IST

వాహనానికి ఎలాంటి ప్రమాదమూ జరగకుండా చూసుకున్న యజమానికి బీమా సంస్థలు ఇచ్చే బహుమానమే నో క్లెయిం బోనస్‌ (ఎన్‌సీబీ). చాలామంది కొత్త వాహనం కొన్నప్పుడు ఈ ఎన్‌సీబీని బదిలీ చేసుకోవడం మర్చిపోతుంటారు. దీనివల్ల కొత్త కారుకు బీమా తీసుకున్నప్పుడు ప్రీమియం అధికంగా చెల్లించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్‌సీబీని ఎలా ఉపయోగించుకోవాలన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వాహనమేదైనా సరే.. రోడ్డు మీద తిరగాలంటే.. దానికి బీమా (కనీసం థర్డ్‌పార్టీ) ఉండాల్సిందే. ఈ పాలసీని ఏటా గడువులోపే పునరుద్ధరించుకోవాలి. ఎలాంటి క్లెయిం లేకపోతే.. ప్రీమియంలో రాయితీని అందిస్తాయి బీమా సంస్థలు. దీన్నే నో క్లెయిం బోనస్‌ పేరుతో పిలుస్తారు. ఇది కొన్ని శ్లాబులను బట్టి ఉంటుంది. మొదటి ఏడాది క్లెయిం లేకపోతే 20 శాతం వరకూ ఇది వర్తిస్తుంది. రెండు, మూడు, నాలుగు, అయిదో సంవత్సరాల్లోనూ ఎలాంటి క్లెయిములూ లేకపోతే.. వరుసగా 25%, 35%, 45%, 50శాతం వరకూ ఎన్‌సీబీ లభిస్తుంది. గరిష్ఠంగా దీన్ని 50శాతానికి పరిమితం చేశారు. మోటార్‌ బీమా పాలసీని పునరుద్ధరించుకునే సమయంలో ప్రీమియం భారం తగ్గించుకునేందుకు నో క్లెయిం బోనస్‌ (ఎన్‌సీబీ) ఉపయోగపడుతుంది. ఎన్‌సీబీ ఓన్‌ డ్యామేజీ (ఓడీ) ప్రీమియానికి మాత్రమే వర్తిస్తుంది.

చిన్న చిన్న నష్టాలకు క్లెయింలు చేసుకోకుండా ఉంటేనే ఎన్‌సీబీ పెరుగుతుంది. ఏదైనా ప్రమాదం జరిగి, వాహనం మరమ్మతు చేయాల్సి వచ్చినప్పుడు వాస్తవంగా అయ్యే ఖర్చు.. నో క్లెయిం బోనస్‌ ప్రయోజనాన్ని బేరీజు వేసుకోవాలి. ఉదాహరణకు పాలసీ పునరుద్ధరణ సమయంలో రూ.5,000 ఎన్‌సీబీకి అర్హులు అనుకుందాం. ఇప్పుడు చిన్న మరమ్మతుకు రూ.2,000 ఖర్చు అవుతుంది. అప్పుడు మీ చేతి నుంచి రూ.3,000 చెల్లించడమే మంచిది. క్లెయిం చేస్తే రూ.3,000 నష్టపోతారు. బీమా క్లెయిం చేయాలా వద్దా అనేది ఈ లెక్కలు వేసుకున్నాకే నిర్ణయించుకోవాలి.

ఎన్‌సీబీ బదిలీ చాలా సుభంగా చేసుకోవచ్చు. బీమా సంస్థ నుంచి ఆఫ్‌లైన్‌ పాలసీ తీసుకుంటే.. నేరుగా సంస్థను సంప్రదించి, ఎన్‌సీబీ బదిలీ కోసం అవసరమైన పత్రాలను సమర్పించాలి. బీమా సంస్థ మీ ఎన్‌సీబీ సర్టిఫికెట్‌ను అందిస్తుంది. కొత్త బీమా సంస్థకు ఆ సర్టిఫికెట్‌ను అందించాలి. అప్పుడు మీకు ఎన్‌సీబీ బదిలీ జరుగుతుంది. ఆన్‌లైన్‌లో కొంటే.. ఎన్‌సీబీ కోసం మునుపటి పాలసీ నెంబరు, బీమా సంస్థ పేరు కొత్త సంస్థకు తెలియజేయాలి. కొత్త బీమా సంస్థ మీకు ఎన్‌సీబీని బదిలీ చేస్తుంది. ఈ ఎన్‌సీబీ సర్టిఫికెట్‌ మూడేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది.

మీరు పాత కారు యజమానిగా ఉన్నంత వరకూ ఈ ఎన్‌సీబీని కొత్త వాహనానికి బదిలీ చేయడం సాధ్యం కాదు. పాత కారును అమ్మినప్పుడు లేదా ఇతర కుటుంబ సభ్యుల పేరుమీదకు మార్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. మోటార్‌ బీమా పాలసీ గడువు ముగిసిన 90 రోజుల్లోగా దాన్ని పునరుద్ధరించుకోకుంటే ఎన్‌సీబీ రద్దవుతుంది. ఇప్పుడు బీమా సంస్థలు ఎన్‌సీబీ ప్రొటెక్షన్‌ను అనుబంధ పాలసీగానూ అందిస్తున్నాయి. వీటిని పరిశీలించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని