Mutual Funds: మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేస్తుంటే.. ఇవి తెలుసుకోండి!

Mutual Funds: స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు మ్యూచువల్‌ ఫండ్ల మార్గంలో వెళ్లడమే ఉత్తమం అని నిపుణులు చెబుతుంటారు....

Updated : 25 Jul 2022 10:16 IST

Mutual Funds: స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు మ్యూచువల్‌ ఫండ్ల (Mutual Funds) మార్గంలో వెళ్లడమే ఉత్తమం అని నిపుణులు చెబుతుంటారు. క్రమానుగత పెట్టుబడులతో.. దీర్ఘకాలంలో సంపద సృష్టించాలనుకునే వారికి ఇవి సరిపోతాయి. అంతర్లీనంగా నష్టభయం ఉన్నప్పటికీ.. చరిత్రను పరిశీలించినప్పుడు పదేళ్లకు మించి పెట్టుబడులను కొనసాగిస్తే మంచి రాబడులనే అందించాయని చెప్పొచ్చు. కొన్ని జాగ్రత్తలతో ఫండ్లను ఎంపిక చేసుకోవడం, ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలి.

మ్యూచువల్‌ ఫండ్ల (Mutual Funds)లో మదుపు చేయడం ప్రారంభించే ముందు.. మీరు ఎంత నష్టభయం భరించగలరు అనేది తెలుసుకోవాలి. దీన్నిబట్టే మీరు ఎంత రాబడిని సాధించగలరు అనేది తెలుస్తుంది. నష్టభయం, రాబడి అంచనాలను బట్టి దానికి అనుకూలమైన ఫండ్లను ఎంపిక చేసుకోవాలి. పదేళ్లలో కొంత నిధిని జమ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారనుకుందాం. నష్టభయం అధికంగా భరించగలిగితే.. మీరు అధిక రాబడిని అందించే పథకాలను ఎంచుకోవచ్చు. దీనివల్ల మీరు పెట్టుబడి పెట్టే మొత్తం తగ్గుతుంది. స్వల్ప నష్టభయం ఉండాలని అనుకున్నప్పుడు రాబడీ తగ్గుతుంది. అప్పుడు పెట్టుబడి పెట్టే మొత్తం, వ్యవధీ మారుతుంది.

* పెట్టుబడులు ఎప్పుడూ ఒకే చోట ఉండకూడదనేది నియమం. ఒకే తరహాలో ఉండే రెండు పథకాలను ఎంచుకోవడం ఎప్పుడూ మంచిది కాదు. వేర్వేరు ఫండ్‌ సంస్థలకు చెందిన వివిధ తరగతులకు చెందిన ఫండ్లను ఎంచుకోవడం వల్ల నష్టభయం పరిమితంగా ఉంటుంది.

* పలు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ఎన్నో పథకాలను అందిస్తున్నాయి. అందులో ఏది మంచిది అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ, ఆ ఫండ్‌ సంస్థ చరిత్ర, పెట్టుబడులను నిర్వహించే తీరు, ఇప్పటి వరకూ అందించిన రాబడి తదితరాల ఆధారంగా ఒక సంస్థను ఎంచుకోవచ్చు. ఒక ఫండ్‌ను నిర్వహించే మేనేజర్‌ పాత్రా రాబడి ఆర్జనలో కీలకమే. ఈ విషయాన్నీ ఒకసారి మనం పరిశోధించి చూడాలి.

* ఒకేసారి పెద్ద మొత్తంలో మదుపు చేయడం ఎప్పుడూ సరికాదు. క్రమానుగతంగా నెలనెలా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నించాలి. దీనివల్ల మార్కెట్‌ వివిధ దశల్లో మదుపు చేసేందుకు అవకాశం లభిస్తుంది. రూపాయి సగటు ప్రయోజనం వల్ల దీర్ఘకాలంలో లాభాల్లో వృద్ధి కనిపిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని