Cashback Credit Card: క్యాష్‌బ్యాక్‌ క్రెడిట్‌ కార్డు తీసుకుంటున్నారా? ఇవి తెలుసుకోండి!

Cashback Credit Card: పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని క్రెడిట్‌ కార్డు జారీ సంస్థలు అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. వాటిలో క్యాష్‌బ్యాక్‌ కార్డులు ఒకటి. వీటిని తీసుకునే ముందు కొన్ని అంశాలను నిశితంగా పరిశీలించాలి.

Published : 10 Oct 2022 13:15 IST

Cashback Credit Card: చాలా మంది పండగల సీజన్‌లో షాపింగ్‌ చేయడానికి మొగ్గుచూపుతారు. దీన్ని అదనుగా భావించే క్రెడిట్‌ కార్డు జారీ సంస్థలు.. కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఇటీవలే యాక్సిస్ బ్యాంక్, SBI కార్డ్ కొత్త క్యాష్‌బ్యాక్ కార్డ్‌ (Cashback Credit Card)లను తీసుకొచ్చాయి. శాంసంగ్‌తో కలిసి యాక్సిస్ బ్యాంక్ కో-బ్రాండెడ్‌ కార్డును విడుదల చేసింది. మరోవైపు SBI కార్డ్ ఆన్‌లైన్ వ్యయాలపై ఐదు శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ (Cashback)ను అందిస్తోంది.

మరి మీరూ ఇలాంటి క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్‌ (Cashback Credit Card)ని పొందాలని ప్లాన్ చేస్తున్నారా? దరఖాస్తు చేయడానికి ముందు ఈ ఐదు ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకోండి!

రివార్డ్‌లు మీ అవసరాలకు సరిపోతాయా?

రివార్డులు అందించే విషయంలో మాత్రమే క్యాష్‌బ్యాక్ కార్డ్‌లు, సాధారణ క్రెడిట్ కార్డ్‌లకు మధ్య వ్యత్యాసం ఉంటుంది. అందువల్ల, ఆఫర్‌లో వచ్చే రివార్డ్‌లు మీ అవసరాలకు సరిపోతాయో లేదో ముందే చూసుకోవాలి. మీరు తరచూ చేసే ఖర్చులకు రివార్డులు కలిసి రాకపోతే కార్డు తీసుకొని పెద్దగా ప్రయోజనం ఉండదు.

ఒక్కోసారి సాధారణ క్రెడిట్ కార్డ్‌లే మెరుగ్గా ఉండొచ్చు..

కొన్నిసార్లు క్యాష్‌బ్యాక్ కార్డ్ కంటే సాధారణ క్రెడిట్ కార్డే మెరుగైన ప్రయోజనాలు కల్పించే అవకాశం ఉంది. ప్రతి లావాదేవీపై వచ్చే క్యాష్‌బ్యాక్‌ను కాకుండా మీ ఖర్చులు వాటిపై పొందగలిగే రివార్డ్‌లను అంచనా వేయాలి. నిజానికి తక్షణ తృప్తి కోసం చూసే కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని క్యాష్‌బ్యాక్‌ క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తారు. అలా కాకుండా దీర్ఘకాలంలో ఎక్కువ ప్రయోజనాలను అందించే కార్డులను ఎంచుకుంటేనే మనకు లబ్ధి చేకూరుతుంది. చాలా సందర్భాలలో, సాధారణ కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్ 0.2% - 2% మధ్య ఉంటుంది. కో-బ్రాండెడ్ కార్డ్‌లతో చేసే నిర్దిష్ట ఖర్చులపై 5%-10% వరకు ఉండొచ్చు. అయినప్పటికీ, మార్కెట్‌లో అధిక రివార్డులను అందజేసే కార్డులు చాలానే ఉన్నాయి.

అన్ని ప్రత్యామ్నాయాలను విశ్లేషించండి..

ఖర్చు చేసే తీరును బట్టి మీకు ఎలాంటి క్రెడిట్‌ కార్డు సరిపోతుందో చూసుకోవాలి. పైగా మీ ఖర్చు పెరుగుతున్న కొద్దీ మీకు అందే రివార్డులు పెరుగుతూ ఉంటే ఎక్కువ ప్రయోజనం పొందొచ్చు. క్యాష్‌బ్యాక్ కంటే ఇతర కార్డులు అందుకు అనువుగా ఉంటాయనుకుంటే దానికే వెళ్లాలి. అందుకే వివిధ రకాల క్రెడిట్‌ కార్డుల వల్ల మీకు ఎలాంటి ప్రయోజం ఉంటుందో ముందే పరిశీలించాలి. తదనుగుణంగా మీకు ఏది సరిపోతే అది తీసుకోవాలి.

క్యాష్‌బ్యాక్ ఎలా క్రెడిట్‌ చేస్తారు?

క్యాష్‌బ్యాక్‌లు రివార్డు పాయింట్ల రూపంలో కాకుండా మనం చేసే ఖర్చులో కొంత శాతాన్ని మన ఖాతాలో జమ చేస్తారు. అందుకే కార్డు తీసుకునేటప్పుడు మీకు క్యాష్‌బ్యాక్‌ ప్రయోజనాన్ని ఎలా అందించబోతున్నారో తెలుసుకోవాలి. ఒక్కోసారి నేరుగా మన బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. లేదా ఏదైనా ఆన్‌లైన్‌ వ్యాలెట్‌లోకి బదిలీ చేసే అవకాశం ఉంది. ఒక్కోసారి ఆ మొత్తాన్ని వారు నిర్దేశించిన మర్చంట్స్‌ వద్ద ఖర్చు చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది.

భరించలేకపోతే వద్దు..

చివరగా, మీకు సకాలంలో బిల్లు చెల్లించే స్తోమత లేకపోతే క్రెడిట్ కార్డ్ కోసం ఎప్పుడూ దరఖాస్తు చేయకండి. లేదంటే అది మీ క్రెడిట్‌ స్కోర్‌పై.. ఫలితంగా మీ మొత్తం క్రెడిట్‌ చరిత్రపై ప్రభావం చూపుతుంది. ఇది మీ ఆర్థిక భవిష్యత్తుపై ప్రభావం చూపొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని