IMF: భారత వృద్ధిరేటును 6.3 శాతానికి పెంచిన ఐఎంఎఫ్‌

IMF: అధిక వడ్డీరేట్లు, ఉక్రెయిన్‌లో యుద్ధం సహా భౌగోళిక రాజకీయ అనిశ్చితుల మధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి గమనం నెమ్మదిస్తోందని ఐఎంఎఫ్‌ తెలిపింది.

Published : 10 Oct 2023 17:10 IST

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధిరేటు (India Growth Rate) అంచనాలను ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)’ పెంచింది. జులైలో 6.1 శాతంగా అంచనా వేసిన ఐఎంఎఫ్‌ ఈసారి దాన్ని 6.3 శాతానికి మెరుగుపర్చింది. ఏప్రిల్‌- జూన్‌ మధ్య అంచనాల కంటే బలమైన వినిమయం నమోదైన నేపథ్యంలోనే వృద్ధిరేటు (India Growth Rate) అంచనాలను పెంచినట్లు ఐఎంఎఫ్ (IMF) పేర్కొంది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో మన దేశ వృద్ధిరేటును ఐఎంఎఫ్‌ (IMF) 5.9 శాతంగా అంచనా వేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌- జూన్‌లో 7.8 శాతం వద్ద బలమైన వృద్ధిరేటు (India Growth Rate) నమోదైంది. దీంతో జులై సమీక్షలో అంచనాలను 6.1కి పెంచింది. తాజాగా దాన్ని మరింత పెంచి 6.3కి చేర్చింది. గతవారం ప్రపంచబ్యాంక్‌ సైతం భారత వృద్ధిరేటు (India Growth Rate) అంచనాలను 6.3 శాతంగా పేర్కొంది. మరోవైపు రిజర్వ్‌ బ్యాంక్‌ ఇటీవలి ద్రవ్యపరపతి విధాన సమీక్షలో దేశ వృద్ధిరేటును 6.5 శాతానికి చేర్చిన విషయం తెలిసిందే. ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంక్‌ అంచనాలు ఇప్పటికీ.. ఆర్‌బీఐ అంచనాల కంటే తక్కువగానే ఉండడం గమనార్హం.

ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటును ఐఎంఎఫ్‌ (IMF) కుదించింది. గతంలో 3 శాతంగా పేర్కొన్న అంచనాలను ఈసారి 2.9 శాతానికి తగ్గించింది. అధిక వడ్డీరేట్లు, ఉక్రెయిన్‌లో యుద్ధం సహా భౌగోళిక రాజకీయ అనిశ్చితుల మధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి గమనం నెమ్మదిస్తోందని తెలిపింది. కొవిడ్‌-19 సంక్షోభం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోక ముందే వృద్ధిరేటు వేగం కోల్పోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. కొవిడ్‌, ఉక్రెయిన్‌పై రష్యా దాడి వంటి వరుస పరిణామాల వల్ల గత మూడేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.7 ట్రిలియన్ డాలర్లు నష్టపోయినట్లు తెలిపింది.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం (Inflation) 2023లో 6.9 శాతానికి దిగొస్తుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. 2024లో అది మరింత తగ్గి 5.8 శాతానికి చేరుతుందని తెలిపింది. అయితే, గత అంచనాలతో పోలిస్తే వీటిని వరుసగా 0.1 శాతం, 0.6 శాతం పెంచడం గమనార్హం. అయితే, 2025 వరకు ద్రవ్యోల్బణం (Inflation) లక్ష్యిత పరిధిలోకి రాకపోవచ్చునని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని