India Growth Rate: భారత్‌ వృద్ధి రేటు అంచనాల్లో IMF కోత.. ఈసారి 5.9 శాతమే!

భారత వృద్ధి రేటు (Growth Rate)లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) కోత విధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 5.9 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది.

Updated : 11 Apr 2023 22:36 IST

వాషింగ్టన్‌: భారత వృద్ధి రేటులో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) కోత విధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును 6.1 శాతం నుంచి 5.9 శాతానికి తగ్గించింది. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థల్లో భారత్‌ తన వృద్ధిని కొనసాగిస్తోందని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో  వృద్ధి రేటు (Growth Rate) 6.8 శాతంగా అంచనా వేయగా.. 2023-24 సంవత్సరానికి 5.9 శాతంగా అంచనా వేసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) వృద్ధి రేటు అంచనాల కంటే ఇది తక్కువ కావడం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు అంచనాను ఆర్‌బీఐ 6.4 శాతంగా అంచనా వేసింది. అయితే, 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ గణాంకాలను కేంద్రం ఇంకా విడుదల చేయలేదు. 

చైనా వృద్ధి రేటు 2023లో 5.2 శాతంగా, 2024లో 4.5 శాతంగా ఉంటుందని ఐఎమ్‌ఎఫ్‌ అంచనా వేసింది. అలానే, ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు అంచనాలను ఐఎంఎఫ్‌ వెలువరించింది. ఈ ఏడాది 2.8 శాతం, 2024లో 3.0 శాతం నమోదు కావచ్చని అంచనా వేసింది. గతం అంచనాల కంటే అంతర్జాతీయ ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉందని తెలిపింది. 2022లో 8.7 శాతంగా ఉండగా, 2023లో 7.0 శాతం, 2024లో 4.9 శాతానికి ద్రవ్యోల్బణం తగ్గొచ్చని వెల్లడించింది. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం కారణంగా నెలకొన్న మందగమనం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థతోపాటు, చైనా  ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకున్నాయని ఐఎంఎఫ్‌ తన నివేదికలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా  సరఫరా వ్యవస్థలు యథాస్థితికి రావడం, యుద్ధం కారణంగా ఆహార మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి తొలగిపోయాయని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని