Term insurance: అదే ప్రీమియంతో బీమా పెంచుకోండి.. ఇంక్రిమెంటల్‌ టర్మ్‌ ప్లాన్‌ వివరాలివీ..

Incremental term insurance details in telugu: స్థిరమైన ప్రీమియం చెల్లింపులతో ప్రతి ఏడాదీ పాలసీ హామీ మొత్తాన్ని పెంచుకునేందుకు అనుమతించేదే ఇంక్రిమెంటల్‌ టర్మ్‌ పాలసీ.

Updated : 05 Dec 2022 15:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్యూర్‌ టర్మ్‌ పాలసీ తీసుకుంటే పాలసీదారుడు పాలసీ కాలవ్యవధిలో మరణిస్తే నామినీకి హామీ మొత్తాన్ని అందిస్తారు. ఒకవేళ పాలసీదారుడు పాలసీవ్యవధి వరకు జీవించి ఉంటే ఎలాంటి హామీ అందదు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి.. తనపై ఆధారపడిన కుటుంబ సభ్యుల భవిష్యత్‌కు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ  టర్మ్‌పాలసీ సహాయపడుతుంది. సాధారణంగా ఒక వ్యక్తి ప్రస్తుత ఆదాయానికి కనీసం 12-15 రెట్లు హామీ మొత్తం ఉండేలా టర్మ్‌ ప్లాన్‌ తీసుకోవాలని చెబుతారు. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ఈ హామీ మొత్తం భవిష్యత్‌లో కుటుంబ సభ్యుల అవసరాలకు సరిపోకపోవచ్చు. దీనికి పరిష్కారం అందిస్తోంది ఇంక్రిమెంటల్‌ టర్మ్‌ ఇన్సురెన్స్‌ పాలసీ.

ఏమిటీ ఇంక్రిమెంటల్‌ టర్మ్‌ ఇన్సురెన్స్‌?

ప్రతి ఏడాదీ పాలసీ హామీ మొత్తాన్ని పెంచుకునేందుకు అనుమతించేదే ఇంక్రిమెంటల్‌ టర్మ్‌ పాలసీ. ఉదాహరణకు ఒక వ్యక్తి 40 సంవత్సరాలకు 10% ఇంక్రిమెంట్‌తో రూ.1కోటి హామీ మొత్తంతో టర్మ్‌ ప్లాన్‌ తీసుకున్నారనుకుందాం. ఒకవేళ ఆ వ్యక్తి పాలసీ కాలవ్యవధిలో మరణిస్తే కుటుంబ సభ్యులకు రూ.1 కోటితో పాటు ప్రతి సంవత్సరం పెరిగిన హామీ మొత్తం కూడా అందుతుంది. అయితే దీనికి కొంత పరిమితి ఉండొచ్చు. కొన్ని సంస్థలు హామీ మొత్తం రెట్టింపు అయ్యేంత వరకు మాత్రమే ఇంక్రిమెంట్‌ను కొనసాగిస్తున్నాయి. అంటే రూ.1 కోటితో టర్మ్‌పాలసీ తీసుకుంటే రూ.2 కోట్లకు హామీ మొత్తం పెరిగేంత వరకు మాత్రమే ఇంక్రిమెంటును కొనసాగిస్తాయి. ఒకసారి ఈ మొత్తానికి చేరిన తర్వాత పాలసీ కాలవ్యవధి వరకు ఇదే హామీ మొత్తం స్థిరంగా కొనసాగుతుంది.

ప్రయోజనాలివీ..

స్థిరంగా ప్రీమియం: సాధారణ టర్మ్‌ ప్లాన్‌తో పోలిస్తే ఇంక్రిమెంటల్‌ టర్మ్‌ ప్లాన్‌ ప్రీమియం కాస్త ఎక్కువగానే ఉండొచ్చు. అయితే పాలసీ కాలవ్యవధిలో ప్రీమియం మాత్రం స్థిరంగా ఉంటుంది. పెరుగుతున్న హామీ మొత్తంతో ప్రీమియంలో పెరుగుదల ఉండదు. కాబట్టి ఖర్చు తగ్గించుకోవచ్చు.

ద్రవ్యోల్బణాన్ని అధిగమించవచ్చు: ద్రవ్యోల్బణం వల్ల భవిష్యత్‌లో డబ్బు విలువ తగ్గుతుంది. ఇప్పుడు రూ.1 కోటి హామీ మొత్తం సరిపోతుందని అనిపించినా 20 ఏళ్ల తర్వాత సరిపోకపోవచ్చు. ఇంక్రిమెంట్‌ టర్మ్‌ పాలసీతో హామీ మొత్తాన్ని పెంచుకోవచ్చు. కాబట్టి ద్రవ్యోల్బణాన్ని అధిగమించవచ్చు.

ఆర్థిక అసవరాలు: ఒకవేళ మీరు వివాహానికి కంటే ముందే టర్మ్‌పాలసీ తీసుకున్నవారైతే వివాహం తర్వాత మరిన్ని బాధ్యతలు తోడవుతాయి. వివాహానంతరం భార్య, పిల్లల అవసరాలు, ఇల్లు వంటి ఆస్తులను కొనుగోలు చేసి ఉంటే వాటి రుణాలు తీర్చవలసిన బాధ్యతలు.. ఇలా కాలం గడిచే కొద్దీ  ఆర్థిక అవసరాలు పెరుగుతుంటాయి. వాటికి తగినట్లుగా కాలక్రమేణా టర్మ్‌ బీమా హామీ మొత్తం పెంచుకునే వీలుంటుంది.

పన్ను ఆదా: ఇతర టర్మ్‌ బీమా ప్లాన్‌ల మాదిరిగానే ఇంక్రిమెంటల్‌ టర్మ్‌ ఇన్సురెన్స్‌ ప్లాన్‌పై చేసే ప్రీమియం చెల్లింపులకు సెక్షన్‌ 80సి కింద పన్ను మినహాయింపు క్లెయిం చేసుకోవచ్చు. అలాగే సెక్షన్‌ 10 (10డి) ప్రకారం డెత్‌బెనిఫిట్‌పై మినహాయింపు పొందొచ్చు.

రైడర్లు: ఇంక్రిమెంటల్‌ టర్మ్‌ ప్లాన్‌తో క్రిటికల్‌ ఇల్‌నెస్‌ రైడర్, యాక్సిడెంటల్‌ డెత్‌ బెన్‌ఫిట్‌, డిజెబిలిటీ రైడర్‌, ప్రీమియం రద్దు రైడర్‌ వంటి యాడ్‌-ఆన్‌లను కొంత అదనపు ప్రీమియం చెల్లించి తీసుకోవచ్చు. దీంతో హామీ మొత్తం మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది. 

చివరిగా..

టర్మ్‌ బీమా అనేది ఆర్థిక ప్రణాళికలో ముఖ్యమైన అంశం. సంపాదించే ప్రతి ఒక్కరూ ఆధారిత కుటుంబ సభ్యుల కోసం ఈ పాలసీ తీసుకోవాలి. కనీసం 60 ఏళ్లు వచ్చే వరకు పాలసీని కొనసాగించాలి. చిన్న వయసులో టర్మ్‌పాలసీ తీసుకునేవారు ఇంక్రిమెంట్‌ టర్మ్‌ ప్లాన్‌ను ఎంచుకోవడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని