India Debt: ‘చైనా తరహాలో ఇండియా అప్పులూ ఎక్కువే.. కానీ..’

India Debt: భారత్‌కూ అప్పులు భారీ ఎత్తున ఉన్నాయని ఐఎంఎఫ్‌ తెలిపింది. అయితే, వాటి వల్ల అంత ముప్పేమీ లేదని పేర్కొంది. చైనాతో పోలిస్తే భారత్‌కు అప్పుల వల్ల ఉన్న రిస్క్‌ తక్కువని అభిప్రాపడింది.

Published : 11 Oct 2023 18:45 IST

వాషింగ్టన్‌: చైనా తరహాలోనే భారత్‌కు కూడా పెద్ద మొత్తంలో రుణం (India Debt) ఉందని ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)’ సంస్థ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే, దాని వల్ల రిస్క్‌ మాత్రం చైనాతో పోలిస్తే తక్కువని అభిప్రాయపడ్డారు. వివిధ రకాల లోటులను తగ్గించేందుకు భారత్‌కు మధ్యకాలంలో పటిష్ఠ ఆర్థిక ప్రణాళికలు అవసరమని ఐఎంఎఫ్‌ (IMF) ఆర్థిక వ్యవహారాల విభాగం డిప్యూటీ డైరెక్టర్ రూడ్‌ డీ మోయిజ్‌ సూచించారు.

భారత జీడీపీలో అప్పులు (debt to GDP ratio) 81.9 శాతమని మోయిజ్‌ వెల్లడించారు. చైనా అప్పులు ఆ దేశ జీడీపీలో 83 శాతంగా ఉన్నట్లు తెలిపారు. ఇరు దేశాల్లోనూ అప్పులు పెద్ద మొత్తంలో ఉన్నట్లు పేర్కొన్నారు. కరోనాకు ముందు భారత అప్పులు జీడీపీలో 75 శాతంగా ఉండేవని గుర్తుచేశారు. రుణాలపై వడ్డీల కోసం భారత్‌ పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోందన్నారు. జీడీపీలో 5.4 శాతం దానికోసమే కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, రానున్న రోజుల్లో భారత అప్పులు.. చైనా అప్పుల తరహాలో భారీ ఎత్తున పెరిగే అవకాశం లేదన్నారు. పైగా 2028 నాటికి ఇండియా అప్పులు జీడీపీలో 80.4 శాతానికి తగ్గుతాయని అంచనా వేశారు. అత్యంత వేగవంతమైన వృద్ధే అందుకు దోహదం చేస్తుందన్నారు.

భారత్‌కు పెద్ద ఎత్తున అప్పులు ఉన్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల అవి పెద్ద ముప్పుగా పరిణమించబోవని మోయిజ్‌ తెలిపారు. రుణాలను తిరిగి చెల్లించేందుకు ఇంకా సుదీర్ఘ గడువు ఉండడం ఓ కారణమన్నారు. దీని వల్ల తరచూ రుణాలను పునర్‌వ్యవస్థీకరించుకోవాల్సిన అవసరం ఉండదన్నారు. పైగా భారత అప్పుల్లో చాలా వరకు దేశీయంగా సమకూర్చుకున్నవేనని తెలిపారు. వీటి చెల్లింపులు స్థానిక కరెన్సీలోనే ఉంటాయని పేర్కొన్నారు. భారత్‌లో కొన్ని రాష్ట్రాల అప్పులు భారీ మొత్తానికి చేరాయని తెలిపారు. దీనివల్ల వడ్డీభారం కూడా అధికంగానే ఉందన్నారు. అప్పుల పరంగా చూస్తే భారత్‌కు ఇదొక్కటే రిస్క్‌గా కనపడుతోందని తెలిపారు.

భారత్‌ కొన్ని ఆర్థిక స్థిరీకరణ విధానాలను అమలు చేయాల్సిన అసవరం ఉందని మోయిజ్‌ సూచించారు. సాధారణ విక్రయ పన్నుల నిర్మాణాన్ని మెరుగపర్చాలని హితవు పలికారు. అలాగే వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్‌ పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వ్యవస్థల్లో చాలా లోపాలున్నాయని పేర్కొన్నారు. మరోవైపు కొన్ని రాయితీలను కూడా విస్తరించాలని సూచించారు. తద్వారా అట్టడుగు వర్గాలకు ఆర్థిక సాయం అందుతుందని వివరించారు.

మన దేశ వృద్ధి రేటు అంచనాను 2023-24 ఆర్థిక సంవత్సరానికి స్వల్పంగా పెంచి 6.3 శాతంగా ఐఎంఎఫ్‌ తాజాగా పేర్కొన్న విషయం తెలిసిందే. అయినా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల అంచనా వేసిన వృద్ధి రేటు 6.5 శాతం కంటే ఇది తక్కువ కావడం గమనార్హం. అంతర్జాతీయంగా పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో రెండోదైన చైనా కంటే భారత వృద్ధి అధికంగా ఉండొచ్చని ఐఎంఎఫ్‌ తెలిపింది. గత జులైలో మనదేశ వృద్ధి రేటు అంచనాను 6.1 శాతంగా ఐఎంఎఫ్‌ పేర్కొంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని