India: చైనాకు చెక్‌పెట్టేందుకు భారత్‌ ‘పవర్‌’..!

ఆగ్నేయాసియా దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఆక్సిజన్‌ వంటి విద్యుత్తును సరఫరా చేసి.. అక్కడ చైనా పలుకుబడికి చెక్‌పెట్టాలని భారత్‌ భావిస్తోంది.  

Published : 21 Jul 2023 15:44 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఆగ్నేయాసియా దేశాల్లో చైనా పలుకుబడికి చెక్‌ పెట్టేందుకు భారత్‌ సరికొత్త ‘పవర్‌ వ్యూహాన్ని’ సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో పారిశ్రామిక రంగానికి ఆయువుపట్టైన విద్యుత్తును ప్రత్యేక గ్రిడ్‌ అనుసంధానం ద్వారా ఆయా దేశాలకు సరఫరా చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా భారత్‌ పెంచుకొంటున్న పునరుత్పాదక విద్యుత్‌ వనరులను ఇందుకోసం వాడుకోవాలని చూస్తోందని ఈ వ్యహారంతో సంబంధం ఉన్న కీలక వ్యక్తులు ఓ ఆంగ్ల వార్తసంస్థకు వెల్లడించారు. ఈ విద్యుత్‌ను మయన్మార్‌, థాయ్‌లాండ్‌ మీదుగా ఆయా దేశాలకు సరఫరా చేయాలని భావిస్తున్నారు.

జీ20 వేదికగా ప్రయత్నాలు..

ఈ గ్రిడ్‌ అనుసంధానతను పూర్తి చేసేందుకు ఎంతలేదన్నా కనీసం నాలుగేళ్లు పడుతుందని అంచనా. భారత్‌ పొరుగు దేశాలతో సన్నిహిత సంబంధాలను మరింత పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు తాజాగా గోవాలో జరుగుతున్న జీ-20 మంత్రివర్గ స్థాయి సదస్సులను వేదికగా వాడుకొంటోంది. పవర్‌ గ్రిడ్‌ అనుసంధానంపై తాజాగా వివిధ దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లు విద్యుత్‌ శాఖ అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా దీనిలో బ్యాంకుల మద్దతు, డెవలపర్ల పెట్టుబడిని సాధించడానికి జీ20 సభ్యుల నిర్ణయాలు కీలమని వారు పేర్కొన్నారు.

ఇప్పటికే భారత్‌ దీనికి సంబంధించిన ధరల నిర్ణయం వంటి కీలక విషయాలపై నిబంధనలను సిద్ధం చేసేందుకు ఫ్రాన్స్‌కు చెందిన ఈడీఎఫ్‌తో కలిసి పనిచేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈడీఎఫ్‌ ఓ నివేదికను సిద్ధం చేయవచ్చు. తొలుత భారత్‌ నుంచి బర్మాలోని గ్రిడ్‌కు అనుసంధానించగలిగితే.. ఆ తర్వాత అక్కడి నుంచి థాయ్‌లాండ్‌, తూర్పు ఆసియా దేశాలకు విద్యుత్తు సరఫరా చేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.  

ఇది సాధ్యమేనా..?

సీమాంతర గ్రిడ్‌ అనుసంధానత అంశానికి భారీ పెట్టుబడులు అవసరం కావడంతోపాటు.. ఐరోపా నుంచి ఆగ్నేయాసియా వరకు దేశ ప్రయోజనాలను కూడా దృష్టిపెట్టుకోవాల్సి ఉంటుంది. సముద్ర గర్భంలో నిర్మించే కేబుల్స్‌, నిర్మాణ సామగ్రి, ఆ తర్వాత వాటి అప్‌గ్రేడ్‌కు అవసరమైన మెటీరియల్‌ వ్యయం పెరగడం, భౌగోళిక రాజకీయాల ఒత్తిళ్లు వంటి అంశాలు ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంపై పలు ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. దీనికి తోడు ప్రాంతీయ గ్రిడ్‌లో విద్యుత్ పంపిణీ ఛార్జీలు కూడా కీలక సవాలుగా మారనున్నాయి.

జియో ఫైనాన్షియల్‌ @ రూ.1,66,000 కోట్లు

ఆగ్నేయాసియా దేశాల సంఘమైన ఆసియాన్‌ ప్రాంతీయ గ్రిడ్‌ ఏర్పాటు చేసి.. బహుళపక్ష విద్యుత్‌ వ్యాపారం చేయాలని ఎప్పటి నుంచో యత్నిస్తోంది. కానీ, దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల వరకు మాత్రమే ఈ ప్రయత్నం ముందుకు సాగింది.

భారీ లక్ష్యాలు..

భారత్‌ 2030 నాటికి ప్రస్తుతం ఉన్న పునరుత్పాదక, హైడ్రోపవర్‌ ఉత్పత్తిని 177 గిగావాట్ల నుంచి 500 గిగావాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకొంది. వీటిల్లో అత్యధిక మొత్తం సోలార్‌ పార్కుల నుంచే లభించనుందని అంచనా వేస్తోంది. సోలార్‌ పవర్‌ అందుబాటులోకి వచ్చే కొద్దీ భారత్‌ శిలాజ ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుందని ఇంధనశాఖ చెబుతోంది. భారత్‌ ఇప్పటికే బంగ్లాదేశ్‌, భూటాన్‌, నేపాల్‌కు విద్యుత్‌ పంపిణీ చేస్తోంది. మయన్మార్‌కు కూడా స్వల్పంగా సరఫరా చేస్తోంది. కొత్త ప్రణాళిక అమల్లోకి వస్తే భారీగా విద్యుత్‌ సరఫరాకు మార్గం సుగమం అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని