Vaibhav Taneja: టెస్లా సీఎఫ్‌వోగా భారత సంతతి వ్యక్తి వైభవ్‌ తనేజా

టెస్లా (Tesla) నూతన సీఎఫ్‌వోగా భారత సంతతి వ్యక్తి వైభవ్‌ తనేజా (Vaibhav Taneja) నియమితులయ్యారు.

Updated : 07 Aug 2023 23:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) సీఎఫ్‌వోగా భారత సంతతి వ్యక్తి వైభవ్‌ తనేజా (Vaibhav Taneja) నియమితులయ్యారు. ఆ కంపెనీ చీఫ్‌ ఫైనాన్సియల్‌ ఆఫీసర్‌గా నాలుగేళ్ల పాటు కొనసాగిన జాచరీ కిర్కోర్న్‌ ఆ పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో అకౌంటింగ్‌ హెడ్‌గా ఉన్న భారత సంతతి వ్యక్తి వైభవ్‌ తనేజా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మార్పు నిర్ణయం వెలువడటంతో టెస్లా షేర్లు 3 శాతం పతనమయ్యాయి. కంపెనీలో ‘మాస్టర్‌ ఆఫ్‌ కాయిన్‌’గా వ్యవహరించిన జాచరీ ఉన్నఫళంగా నిష్క్రమించడానికి గల కారణాలను టెస్లా వెల్లడించలేదు. ఈ కంపెనీతో ఆయనకు 13 ఏళ్ల అనుబంధం ఉంది. అయితే కార్యకలాపాలు సజావుగా సాగడంలో సహాయపడటానికి జాచరీ ఈ ఏడాది చివరి వరకు కంపెనీలో కొనసాగనున్నారు. కాగా.. ‘ఈ కంపెనీలో భాగం కావడం ఒక ప్రత్యేక అనుభవం. నేను 13 ఏళ్ల క్రితం చేరినప్పటి నుంచి ఇప్పటి దాకా అందరితో కలిసి పనిచేసినందుకు చాలా గర్వపడుతున్నానని’ జాచరీ తన లింక్డ్ ఇన్‌ పోస్టులో వెల్లడించారు. 

మణిపుర్‌ విద్యార్థులారా ఉన్నత విద్య పూర్తి చేయాలనుకుంటే కేరళ వచ్చేయండి!

వైభవ్‌ తనేజా దిల్లీ యూనివర్సిటీలో కామర్స్‌ విభాగంలో పట్టభద్రుడయ్యారు. వైభవ్‌కు అకౌంటింగ్‌లో 20 ఏళ్ల అనుభవం ఉంది. టెక్నాలజీ, ఫైనాన్స్‌, రిటైల్‌, టెలీ కమ్యూనికేషన్స్‌ ఎమ్ఎన్‌సీ కంపెనీల్లో ఆయన పనిచేశారు. 2016లో సోలార్‌ సిటీని టెస్లా కొనుగోలు చేసిన తరువాత అందులో ఆయన భాగమయ్యారు. ప్రధాన అకౌంటింగ్ అధికారిగా తన ప్రాథమిక బాధ్యతతో పాటు, ‘మాస్టర్‌ ఆఫ్‌ కాయిన్‌’ పాత్రను పోషించనున్నట్లు టెస్లా కంపెనీ తెలిపింది. 2021లో తనేజా టెస్లా భారతీయ విభాగానికి డైరెక్టర్‌గానూ నియమితులయ్యారు. 

జాచరీ పదవీ కాలంలో టెస్లా మాస్‌ మార్కెట్ మోడల్‌ 3 కాంపాక్ట్ సెడాన్‌ అమ్మకాలను ప్రారంభించింది. దాంతో మొదటి త్రైమాసికంలో గణనీయమైన లాభాలు వచ్చాయి. మార్కెట్ విలువ 1 ట్రిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.82,78,000 కోట్లు) దాటేసింది. 2019లో జాచరీ సీఎఫ్‌వోగా నియామకం జరిగింది. కాన్ఫరెన్సులో త్రైమాసిక ఫలితాల గురించి మస్క్‌ మాట్లాడుతూ జాచరీ నియామకాన్ని, దీపక్‌ ఆహుజా నిష్క్రమణ గురించి ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని