Threads: ట్విటర్‌కు పోటీగా ‘థ్రెడ్స్‌’.. మెటా కొత్త యాప్

Threads: ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌కు పోటీగా మెటా సరికొత్త యాప్‌ను తీసుకురానుంది. ‘థ్రెడ్స్‌’ పేరుతో తీసుకొస్తున్న ఈ యాప్‌లో అచ్చం ట్విటర్‌ తరహా ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

Published : 04 Jul 2023 11:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ట్విటర్‌ (Twitter)కు పోటీగా మెటా (Meta) కొత్తగా టెక్స్ట్‌ ఆధారిత సంభాషణల యాప్‌ను తీసుకువస్తోంది. ‘థ్రెడ్స్‌’ (Threads) పేరుతో తీసుకువస్తోన్న ఈ మైక్రో బ్లాగింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ను ఈ వారంలోనే వినియోగదారులకు పరిచయం చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ట్విటర్‌ తరహా ఫీచర్లతోనే దీన్ని తీసుకురావటం విశేషం. కానీ, ఈ అంశంపై మెటా యాజమాన్యం ఇంత వరకు స్పందించలేదు.

ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) బ్రాండ్‌పై తీసుకురాబోతున్న ఈ అప్లికేషన్‌లో ట్విటర్‌ తరహా ఫీచర్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. టెక్ట్స్‌ రూపంలో ఉన్న పోస్టులను లైక్ చేయచ్చు. కామెంట్‌, షేర్‌ చేసే వెసులుబాటు లభిస్తుందని యాప్ స్టోర్ లిస్టింగ్‌లోని స్క్రీన్‌షాట్‌ ఆధారంగా తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అనుసరించే వారినే ఇందులోనూ ఫాలో అవ్వచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లోని అదే యూజర్‌నేమ్‌తో యాప్‌ను వినియోగించుకోవచ్చు. అయితే, కొత్త యాప్‌ విషయంపై ఇన్‌స్టాగ్రామ్‌ యాజమాన్యం వ్యాఖ్యానించటానికి నిరాకరించింది.

ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) సొంతం చేసుకున్నప్పటి నుంచి ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ (Twitter)లో పలు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. కొత్తగా ట్వీట్స్‌ను చూడటంలో యూజర్లకు పరిమితులు విధించిన సంగతి తెలిసిందే. ట్విటర్‌ పాలసీ పరమైన మార్పులు కొందరికి రుచించటం లేదు. దీనిపట్ల చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రత్యామ్నాయ వేదికల వైపు చూస్తున్నారు. ఇదే సరైన సమయంగా భావించిన ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా.. ట్విటర్‌కు పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. అంతర్జాతీయంగా ట్విటర్‌కు ఉన్న ప్రజాదరణతోపాటు.. ఇప్పుడు ఆ సంస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని సరికొత్త యాప్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

థ్రెడ్స్‌ యాప్‌ను వివిధ సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్‌లతో పెద్ద ఎత్తున ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. గురువారం ఈ యాప్‌ యూజర్లకు అందుబాటులోకి రానున్నట్లు పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. ఇప్పటివరకు ట్విటర్‌కు పోటీగా నిలిచేందుకు మాస్టోడాన్ (Mastodon), ట్విటర్‌ మాజీ సీఈఓ జాక్‌ డోర్సే (Jack Dorsey) బ్లూస్కై (BlueSky)ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ  యాప్‌లు అంతగా యూజర్లను ఆకట్టుకోలేపోయాయి. రోజుకు దాదాపు 3 బిలియన్ యూజర్లు మెటాకు సంబంధించిన ఏదో ఒక యాప్‌ను వినియోగిస్తున్నారు. ఈ విషయాన్ని కంపెనీ ఏప్రిల్‌లో ఓ నివేదికలో వెల్లడించింది. ఫేస్‌బుక్‌ (Facebook), ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా భారీగా యూజర్ల బేస్‌ను సంపాదించుకున్న మెటా.. మరి కొత్త యాప్‌తో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని