Insurance: మానసిక సమస్యలకు ఆరోగ్య బీమా వర్తిస్తుందా?

మీ బీమా పాలసీలో మానసిక సమస్యలు కవర్‌ అయ్యాయా? అసలు ఇలాంటి సమస్యలకు బీమా వర్తిస్తుందా? వంటి వివరాలు తెలుసుకుందాం...

Updated : 29 Sep 2022 14:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల డెలాయిట్‌ నిర్వహించిన ఓ సర్వే ఆసక్తికర విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. భారత్‌లోని కంపెనీలు ఉద్యోగుల మానసిక సమస్యల వల్ల దాదాపు రూ.1.1 లక్షల కోట్లు కోల్పోతున్నాయని తెలిపింది. వివిధ మానసిక రుగ్మతల కారణంగా ఉద్యోగులు పెట్టే సెలవులు, తక్కువ ఉత్పాదకత, తరచూ కంపెనీలు మారడం వంటి సమస్యల వల్ల ఈ మేరకు నష్టం జరుగుతోందని వివరించింది. పని ఒత్తిడి వల్ల ఉద్యోగులు ఎలాగూ ఎంతోకొంత మానసిక కుంగుబాటును ఎదుర్కొంటుంటారు. కరోనా మహమ్మారి ఆ ఈ సమస్యను మరింత తీవ్రం చేసింది. సామాజికంగా నలుగురితో కలిసే అవకాశం లేకుండా పోవడంతో ఒంటరితనం పెరిగి కొందరు పూర్తిగా కుంగుబాటులోకి జారుకొంటున్న సందర్భాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆరోగ్య సమస్యలనూ కవర్‌ చేసే బీమా పాలసీ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఐఆర్‌డీఏ ఆదేశాలివీ..

ప్రభుత్వం 2017లో ‘మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టా’న్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఐఆర్‌డీఏ బీమా సంస్థలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. బీమా కవరేజీ విషయంలో శారీరక సమస్యలతో సమానంగా మానసిక సమస్యలను కూడా పరిగణించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రతి సమగ్ర ఆరోగ్య బీమా పాలసీలో మానసిక సమస్యలు కూడా కవర్‌ అవుతాయి. అయితే, బాధితులు కనీసం 24 గంటల పాటు ఆసుపత్రిలో ఉంటేనే ఈ పాలసీ క్లెయిం వర్తిస్తుంది.

ఓపీడీ ఉండేలా చూసుకోవాలి

కుంగుబాటు, బెంగ, ఆందోళన.. వంటి చాలా వరకు మానసిక రుగ్మతలకు ‘ఔట్‌పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌ (OPD)’ కిందే చికిత్స అందజేస్తారు. అంటే ప్రత్యేకంగా ఆసుపత్రిలో ఉండి వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్‌ తీసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కానీ, చాలా వరకు ఆరోగ్య బీమా పాలసీలు మాత్రం ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకునే రుగ్మతలను మాత్రమే కవర్‌ చేస్తుంటాయి. కొన్ని ఓపీడీకి కూడా బీమా వర్తింపజేస్తున్నప్పటికీ ప్రీమియం అధికంగా ఉంటుంది. అలాగే అధీకృత వైద్యుడి వద్ద చికిత్స తీసుకుంటేనే ఓపీడీ కవర్‌ లభిస్తుంది. కానీ, చాలా వరకు మానసిక సమస్యలకు చికిత్స నిపుణుల పర్యవేక్షణలో ఉంటుంది. వీరు ఒక్కో సెషన్‌ను పెద్ద మొత్తంలో వసూలు చేస్తుంటారు. ఓపీడీలో వచ్చే కవర్‌తో పోలిస్తే ఇది అధికంగా ఉండే అవకాశం ఉంది.

అందరికీ బీమా ఇస్తారా?

ఐఆర్‌డీఏ తప్పనిసరి చేసినంత మాత్రాన అన్ని ఆరోగ్య బీమా పాలసీలు అన్ని రుగ్మతలకు వర్తిస్తాయనుకుంటే పొరపాటే. ఇది పాలసీలో సంస్థలు ఇచ్చే పూచీకత్తుపై ఆధారపడి ఉంటుంది. పాలసీ కొనుగోలు సమయానికే ఏదైనా తీవ్ర ఇబ్బందితో ఉన్నా.. లేక కోలుకునే దశలో ఉన్నా.. ఆ రుగ్మతలకు బీమా వర్తించకపోవచ్చు. అందుకే బీమా తీసుకునేటప్పుడే అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలన్నింటినీ సంస్థలకు తెలియజేయాలి. దాన్ని బట్టి వారు దేనికి బీమా వర్తిస్తుంది.. దేనికి వర్తించదో.. ముందే తెలియజేస్తారు. కొన్ని కంపెనీలు వేచి ఉండే వ్యవధితో పాలసీని అందజేస్తాయి. మరికొన్ని ఆ సమస్యల్ని పరిహరించి బీమా కవర్‌ను ఇస్తుంటాయి.

ప్రధాన మినహాయింపులివే..

చాలా పాలసీల్లో పుట్టుకతో వచ్చే ఆరోగ్య సమస్యల్ని మినహాయిస్తారు. మానసిక అపరిపక్వత, మెదడు సంబంధిత సమస్యలకు కూడా బీమా వర్తించదు.

ఏయే సమస్యలకు..

కొన్ని సంస్థలు ప్రత్యేకంగా వారు కవర్‌ చేసే మానసిక సమస్యల్ని పాలసీ పత్రాల్లోనే పేర్కొంటాయి. కొన్ని మాత్రం కేవలం ‘మానసిక సమస్యలను కూడా కవర్‌ అవుతాయి’ అని మాత్రమే చెబుతాయి. ఐఆర్‌డీఏ నిబంధనల వల్లే చాలా వరకు సంస్థలు ఇలా చేస్తుంటాయి. అందుకే ప్రత్యేకంగా సమస్యల్ని పేర్కొనే పాలసీలను తీసుకోవడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు.

ఓపీడీ కవర్‌ చాలా కీలకం..

పైన తెలిపిన వివరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఓపీడీ కవర్‌ ఉన్న పాలసీని కొనుగోలు చేయడం ఉత్తమం. అదీ హామీ మొత్తం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. మానసిక సమస్యల చికిత్స సుదీర్ఘకాలం పాటు కొనసాగుతుంటుంది. ఒక్కో సెషన్‌కి నిపుణులు రూ.వేలల్లో ఫీజు వసూలు చేస్తుంటారు. ఓపీడీ పాలసీలో కన్సల్టేషన్‌, ఫార్మసీ, డయాగ్నోస్టిక్స్ వంటి అంశాలు ఉంటాయి. ఈ ఒక్కో సబ్‌ కేటగిరీలో ఎలాంటి పరిమితి లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఉన్నా అది మీకు సరిపోతుందేమో పరిశీలించాలి. చాలా వరకు పాలసీలు అధీకృత వైద్యుల దగ్గర తీసుకునే చికిత్సలకు పెద్ద మొత్తంలో బీమా కవరేజీ ఇస్తుంటాయి. అదే నిపుణుల వద్ద చికిత్సలకు మాత్రం కొంత పరిమితి విధిస్తాయి. దీన్ని కూడా ముందే చెక్‌ చేసుకోవాలి. అలాగే ఒక్కో కన్సల్టేషన్‌కు ఎంత వరకు చెల్లిస్తారో కూడా చూసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని