Jio AirFiber: జియో ఎయిర్‌ఫైబర్‌ కనెక్షన్‌ ఎలా పొందాలి? ఏమేం వస్తాయ్‌?

Jio AirFiber 5G full details: జియో ఎయిర్‌ఫైబర్‌ సర్వీసులను రిలయన్స్‌ లాంచ్‌ చేసింది. ఈ కనెక్షన్‌ ఎలా పొందాలి? ఏమేం వస్తాయ్‌? పూర్తి వివరాలు ఇవీ..

Updated : 20 Sep 2023 20:20 IST

Jio AirFiber 5G | ఇంటర్నెట్ డెస్క్‌: ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియో మంగళవారం జియో ఎయిర్‌ఫైబర్‌ (Jio AirFiber) సర్వీసులను లాంచ్‌ చేసింది. ఫైబర్‌ గ్రిడ్‌ నెట్‌వర్క్‌లేని చోట సులువుగా బ్రాడ్‌బ్యాండ్‌ సదుపాయం అందించేందుకు ఈ ఎయిర్‌ఫైబర్‌ ఉపయోగపడనుంది. హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్‌కతా, ముంబయి, పుణె.. 8 మెట్రో నగరాల్లో ఈ సేవలను ప్రారంభించింది. త్వరలో మరిన్ని నగరాలకు ఈ సేవలు విస్తరించనున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్‌ సంస్థ ఈ తరహా సేవలను ప్రారంభించింది. దీంతో ఈ విభాగంలో ఇరు సంస్థలకు గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఇంతకీ జియో ఎయిర్‌ ఫైబర్‌ ఎలా బుక్‌ చేయాలి? ఏమేం వస్తాయ్‌? ప్లాన్లు ఏంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

జియో ఎయిర్‌ఫైబర్‌ ఎలా బుక్‌ చేయాలి?

జియో ఎయిర్‌ఫైబర్‌ బుక్‌ చేయడానికి 60008-60008 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలి. లేదంటే జియో.కామ్‌లో లేదా దగ్గర్లోని జియో స్టోర్‌కి వెళ్లి జియో ఎయిర్‌ఫైబర్‌ సర్వీసుల కోసం రిక్వెస్ట్‌ పంపించొచ్చు. ఇది వరకే జియో ఫైబర్‌ సేవలను పొందుతున్న వారూ కనెక్షన్‌ తీసుకోవచ్చు. ఒకసారి కనెక్షన్‌ కోసం రిక్వెస్ట్‌ చేశాక.. జియో ప్రతినిధులు మిమ్మల్ని సంప్రదిస్తారు. ఎయిర్‌ ఫైబర్‌ కనెక్షన్‌ బుకింగ్‌ కోసం జియో రూ.100 ఛార్జీ చేస్తోంది. దీన్ని ప్లాన్ మొత్తం నుంచి మినహాయిస్తారు. అక్టోబర్‌ 1 నుంచి ఇన్‌స్టలేషన్లు ప్రారంభం కానున్నాయి.

హోమ్‌ లోన్‌ చెల్లించేశారా? ఈ పత్రాలన్నీ తీసుకోవడం మర్చిపోవద్దు!

ఏమేం వస్తాయ్‌

జియో ఎయిర్‌ఫైబర్‌ అనేది ప్లగ్‌ అండ్‌ ప్లే డివైజ్‌. ఈ కనెక్షన్‌పై ఇంటర్నెట్‌ సేవలతో పాటు డిజిటల్‌ టీవీ ఛానెళ్లు కూడా వీక్షించొచ్చు. ఇందుకోసం జియో వైఫై రౌటర్‌ను, 4కె స్మార్ట్‌ సెటాప్‌ బాక్స్‌ను జియో అందిస్తోంది. వాయిస్‌ యాక్టివ్‌ రిమోట్ కూడా కనెక్షన్‌తో పాటు ఇస్తారు. సిగ్నల్‌ కోసం ఇంటి పైకప్పు మీద లేదా ఇంటి బయట ఔట్‌డోర్ యూనిట్‌ను అమరుస్తారు. ఇందుకోసం రూ.1000 ఇన్‌స్టలేషన్‌ ఛార్జి వసూలు చేస్తారు. అయితే, వార్షిక ప్లాన్‌ తీసుకునే వారికి ఇన్‌స్టలేషన్‌ ఛార్జి నుంచి మినహాయింపు ఉంటుంది. లాంగ్‌టర్మ్‌ ప్లాన్‌ తీసుకునే వారికి క్రెడిట్‌/డెబిట్‌ కార్డు ఆధారిత ఈఎంఐ సదుపాయం ఉంది.

ప్లాన్లు ఏంటి? ఎంత చెల్లించాలి?

జియో ఎయిర్‌ ఫైబర్‌ రెండు రకాల ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌ ఫైబర్‌ ప్లాన్స్‌ రూ.599, రూ.899, రూ.1199గా జియో పేర్కొంది. జియో ఎయిర్‌ఫైబర్‌ మ్యాక్స్‌ ప్లాన్ల ధరలు రూ.1499, 2499, రూ.3999గా నిర్ణయించింది. ప్లాన్‌ మొత్తానికి 18 శాతం జీఎస్టీ అదనం. ఇవి 6 నెలలు, 12 నెలల ప్లాన్లతో అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు రూ.599 ప్లాన్‌ను తీసుకుంటే 6 నెలలకు గానూ జీఎస్టీ, ఇన్‌స్టలేషన్‌తో కలిపి దాదాపు రూ.5499 చెల్లించాల్సి ఉంటుంది. అదే 12 నెలలకు తీసుకుంటే ఇన్‌స్టలేషన్‌ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది కాబట్టి రూ.8600 చెల్లిస్తే సరిపోతుంది. అన్ని ప్లాన్లలో ఇంటర్నెట్‌తో పాటు 550కు పైగా డిజిటల్‌ ఛానెళ్లు పొందొచ్చు. 14 ఓటీటీ యాప్స్‌ ఉచితంగా లభిస్తాయి. ప్లాన్‌ను బట్టి ఇంటర్నెట్‌ వేగం, ఓటీటీ అప్లికేషన్లలో మార్పు ఉంటుంది. 14 ఓటీటీ ఛానల్స్‌లో జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీలివ్‌, జీ5, యూనివర్సల్‌+, లయన్స్‌ గేట్‌, సన్‌నెక్ట్స్‌, హోయ్‌చాయ్‌, డిస్కవరీ+, షెమారూమీ, ఆల్ట్‌ బాలాజీ, ఎరోస్‌ నౌ, ఎపిక్‌ ఆన్‌, డాక్యుబె వంటివి లభిస్తాయి. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, జియో సినిమా ప్రీమియం ప్లాన్లు రూ.1199 నుంచి మొదలవుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని