Financial Stability: కొత్త ఏడాదిలోనైనా ఆర్థిక స్థిరత్వం సాధిద్దాం..!

గత ఏడాది తెలిసో తెలియకో ఆర్థికంగా అనేక పొరపాట్లు చేసి ఉంటాం. ఫలితంగా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలన్న లక్ష్యం మరుగున పడి ఉంటుంది. కానీ, ఈ ఏడాది దాన్ని ఎలాగైనా సాధించేలా చూసుకుందాం.

Published : 02 Jan 2023 12:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం. ఆర్థికంగా గత ఏడాది జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని.. ఈ సంవత్సరమైనా ఆర్థిక స్థిరత్వాన్ని (Financial stability) సాధించే దిశగా అడుగులు వేద్దాం. ఒకవేళ ఇప్పటికే పురోగతి సాధించి ఉంటే.. మరింత వివేకవంతమైన వ్యూహాలతో ఆర్థిక స్వేచ్ఛ దిశగా పయనిద్దాం. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం, తగిన ఆరోగ్య, జీవిత బీమాను తీసుకోవడం, అధిక క్రెడిట్ స్కోర్‌ ఉండేలా చూసుకోవడం.. ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడంలో కనీస విషయాలు.

తగిన బీమా రక్షణ ఉండాలి..

అనారోగ్యం.. ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేస్తుంది. వైద్య ఖర్చులు పెరుగుతున్న ఈ తరుణంలో బీమా చాలా అవసరం. కుటుంబం మొత్తానికి బీమా పాలసీ ఉండాలి. ఆరోగ్య, జీవిత బీమా రెండూ ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్య బీమా కవర్ మీ వార్షిక ఆదాయంలో 40% ఉండాలి. అలాగే కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ప్రమాదవశాత్తూ ఏమైనా జరిగినా.. జీవిత బీమా ఉంటే ఇంట్లో సభ్యులందరికీ ఆర్థిక భరోసా ఉంటుంది. అందుకు టర్మ్‌ ప్లాన్లు సరిగ్గా సరిపోతాయి. బీమా హామీ మొత్తం వార్షిక ఆదాయానికి పదింతలు ఉండాలన్నది నిపుణుల సూచన.

అత్యవసర నిధి ఏర్పాటు..

ఆరు నుంచి 12 నెలల ఖర్చులకు సమానమైన అత్యవసర నిధిని నిర్మించుకోవాలి. ఆసుపత్రిలో చేరడం లేదా ఉద్యోగం కోల్పోవడం వంటి క్లిష్ట పరిస్థితుల్లో మాత్రమే వీటిని ఉపయోగించాలి. వీలైనంత వరకు వీటిని ఎక్కడా మదుపు చేయకపోవడమే ఉత్తమం. ఒకవేళ చేయాలనుకుంటే వెంటనే నగదు చేతికందే మార్గాల్లో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

ముందస్తు రుణ చెల్లింపు..

లోన్లు, అప్పులు.. ఇవి ఓ స్థాయిని మించాయంటే ఆర్థిక స్థిరత్వం అంత త్వరగా సాధ్యం కాదు. అందుకే, వీలైనంత త్వరగా వీటి నుంచి విముక్తి పొందాలి. 2022లో వడ్డీరేట్లు పెరిగి రుణాలు మరింత భారమయ్యాయి. అందుకే ముందస్తుగా రుణం చెల్లించేందుకు ఉన్న అన్ని మార్గాల్ని అన్వేషించాలి. ఏ మాత్రం డబ్బు సమకూరినా.. అప్పులు తీర్చడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. వీలుకాకపోతే లోన్ల కాలపరిమితిని పెంచుకోవాలి. తద్వారా వాయిదాల భారం తగ్గి.. కొత్త అప్పులకు దారితీయకుండా ఉంటుంది. అయితే, ముందస్తు రుణ చెల్లింపుల కోసం పెట్టుబడులను మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. రెండింటినీ బ్యాలెన్స్‌ చేసుకోవాలి.

అధిక క్రెడిట్‌ స్కోర్‌..

క్రెడిట్‌ స్కోర్‌ 750 కంటే ఎక్కువ ఉన్నట్లయితే లోన్లు, క్రెడిట్‌ కార్డుల విషయంలో కొంత అదనపు ప్రయోజనాన్ని పొందొచ్చు. క్రెడిట్‌ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించాలి. ఈఎంఐలు సైతం క్రమం తప్పకుండా చూసుకోవాలి. ఒక్కరోజు ఆలస్యమైనా.. అది మీ క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం చూపుతుంది. వీలైతే త్రైమాసికానికి ఒకసారి క్రెడిట్‌ రిపోర్టు చెక్‌ చేసుకోవాలి. కనీసం ఏడాదికోసారైతే కచ్చితంగా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా తప్పు కనపడితే.. వెంటనే క్రెడిట్‌ బ్యూరోలు, బ్యాంకులకు తెలియజేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని