Mahindra EV Plans: ఐదేళ్లలో ఐదు ఎలక్ట్రిక్‌ వాహనాలు.. మహీంద్రా ఈవీ ప్రణాళికలు

ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా తమ విద్యుత్త వాహన ప్రణాళికలకు సంబంధించి కీలక ప్రకటనలు చేసింది....

Published : 08 Jul 2022 19:53 IST

దిల్లీ: ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా (M&M) తమ విద్యుత్త వాహన (Electric Vehicles) ప్రణాళికలకు సంబంధించి కీలక ప్రకటనలు చేసింది. ఈవీ (EV)ల తయారీ కోసం కొత్త కంపెనీని ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ అందులో రూ.1,925 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది. 

2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి రెండు లక్షల విద్యుత్తు వాహనాలు (Electric Vehicles) విక్రయించనున్నట్లు ఎంఅండ్‌ఎం (M&M) ప్రకటించింది. ఈవీ (EV) వ్యాపారంపై బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. రానున్న ఐదేళ్లలో ఐదు కార్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. 2026-27 నాటికి కంపెనీ విక్రయాల్లో ఈవీ (EV)లదే 20-30% వాటా ఉంటుందని ఎంఅండ్‌ఎం (M&M) ఈడీ రాజేశ్‌ జెజురికర్‌ పేర్కొన్నారు. బ్రిటిష్‌ ఇంటర్నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (BII) రూ.70,070 కోట్ల విలువ వద్ద 250 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. దీంతో తమ ప్రణాళికకు మద్దతు ఉన్నట్లు స్పష్టమైందన్నారు. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులను సమీకరిస్తామని తెలిపారు. 

తమ పూర్తిస్థాయి ఈవీ ప్రణాళికలను ఆగస్టు 15న యూకేలోని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో ఆవిష్కరించేందుకు మహీంద్రా అండ్‌ మహీంద్రా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. సెప్టెంబరులో ఎక్స్‌యూవీ 400 ఆవిష్కరణ ద్వారా ఈవీ బాటలో తమ ప్రయాణానికి శ్రీకారం చుట్టనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మహీంద్రా షేర్లు ఉదయం సెషన్‌లో 5 శాతానికి పైగా ఎగబాకి రూ.1,194 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. తర్వాత అమ్మకాల ఒత్తిడితో కిందకు దిగొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని