Valentines Day.. డేటింగ్‌ యాప్‌లలో సైబర్‌ నేరగాళ్లు వెయిటింగ్‌!

వాలంటైన్స్ డే సందర్భంగా డేటింగ్‌ యాప్‌ యూజర్లకు ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ మెకాఫే కీలక సూచనలు చేసింది. 

Updated : 13 Feb 2024 15:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాలంటైన్స్‌ డే (Valentine's Day) నాడు తమకు నచ్చిన వ్యక్తిపై ప్రేమను వ్యక్తపరుస్తూ బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. మరికొందరు తమకు సరైన జోడీని కలుసుకునేందుకు డేటింగ్‌ యాప్‌లపై ఆధారపడుతుంటారు. దీన్ని అదునుగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. కృత్రిమ మేధ సాంకేతికత సాయంతో నకిలీ ప్రొఫైల్స్‌ సృష్టించి అవతలి వ్యక్తిని ఏమారుస్తున్నారు. ఇటీవల కాలంలో ఈతరహా మోసాలు పెరిగినట్లు సైబర్‌ సెక్యూరిటీ సంస్థ మెకాఫే (McAfee) తెలిపింది. భారత్‌ సహా ఏడు దేశాల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. దాని ప్రకారం డేటింగ్‌ యాప్‌ ఉపయోగించే వారిలో 90 శాతం మంది నకిలీ ప్రొఫైల్‌ బాధితులేనని వెల్లడించింది. వాలంటైన్స్‌ డే సందర్భంగా ఈ యాప్‌లు ఉపయోగించే వారికి కీలక సూచనలు చేసింది. 

  • వ్యక్తిగతంగా కలవని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లతో అప్రమత్తంగా ఉండాలి. సర్వే ప్రకారం చాలామంది మెసేజ్‌ కంపోజింగ్‌ కోసం ఏఐ టూల్స్‌ ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. సైబర్‌ నేరగాళ్లు వీటితో మెసేజ్‌లు రూపొందించి అవతలివారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. 
  • ప్రొఫైల్‌ ఫొటోలు అసలువా? నకిలీవా? తెలుసుకునేందుకు రివర్స్ ఇమేజ్‌ సెర్చ్‌ చేయాలి. అంటే, డీపీలో కనిపించే ఫొటోను గూగుల్‌ ఇమేజ్‌ సెర్చ్‌లో వెతికితే.. దాని వివరాలు తెలుస్తాయి.
  • మెకాఫే సర్వే ప్రకారం.. డేటింగ్‌ యాప్‌ యూజర్లలో 65 శాతం మంది ఏఐ టూల్స్‌ సాయంతో క్రియేట్‌ చేసిన ఫొటోలను డీపీలుగా పెడుతున్నట్లు వెల్లడించారు. 
  • డబ్బులు పంపమని వచ్చే సందేశాలను నమ్మొద్దు. మీరు వ్యక్తిగతంగా కలవని వారికి ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేయకపోవడం మంచిది. వాలంటైన్స్‌డే గిఫ్ట్స్‌ పేరుతో వచ్చే ఆన్‌లైన్‌ లింక్‌లపై క్లిక్ చేయొద్దు. 
  • ఏదైనా ప్రొఫైల్‌ మీకు నచ్చి.. వారిపై ప్రేమను వ్యక్తం చేయాలనుకుంటే ముందుగా వారితో మాట్లాడి వివరాలు తెలుసుకోవాలి. ఆన్‌లైన్‌ స్కామ్‌ల నుంచి భద్రత కోసం స్కామ్‌ ప్రొటెక్షన్‌ టూల్స్‌ ఉపయోగించమని సూచించింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని