Windows 10పై మైక్రోసాఫ్ట్ నిర్ణయం.. 24 కోట్ల కంప్యూటర్లపై ప్రభావం

విండోస్‌ 10పై మైక్రోసాఫ్ట్‌ సంస్థ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల కంప్యూటర్లపై ప్రభావం చూపుతుందని కెనాలసిస్‌ రీసెర్చ్‌ అనే సంస్థ తెలిపింది. 

Published : 22 Dec 2023 15:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్‌ 10 ఓఎస్‌కు సర్వీస్‌ సపోర్టును 2025 అక్టోబర్‌ 14 నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సుమారు 240 మిలియన్‌ కంప్యూటర్ల (సుమారు 24 కోట్లు)పై ప్రభావం చూపుతుందని ‘కెనాలసిస్‌ రీసెర్చ్‌’ (Canalys Research) అనే సంస్థ వెల్లడించింది. దీనివల్ల విండోస్‌ 10తో పనిచేస్తున్న కంప్యూటర్లలో మైక్రోసాఫ్ట్‌ నుంచి ఎలాంటి సెక్యూరిటీ అప్‌డేట్స్‌ రావు. దీంతో యూజర్లు తప్పక కొత్త కంప్యూటర్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుందని కెనాలసిస్‌ తెలిపింది. 

పాత కంప్యూటర్ల స్థానంలో కొత్తవి కొనుగోలు చేయడం వల్ల సుమారు 480 మిలియన్‌ కిలోల ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు పోగవుతాయని కెనాలసిస్‌ అంచనా వేస్తోంది. ఇది 3.2 లక్షల కార్ల వ్యర్థాలతో సమానమని తెలిపింది. పాత కంప్యూటర్ల కారణంగా ఉత్పత్తి అయ్యే ఈ-వేస్ట్‌లో హార్డ్‌ డ్రైవ్‌లను డేటా స్టోరేజ్‌ డివైజ్‌లుగా ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే, ర్యామ్‌, మదర్‌బోర్డుతో పాటు ఇతర విడిభాగాలను సరైన రీతిలో రీసైకిల్‌ చేయకుంటే.. అవి పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో విండోస్‌ 10 సర్వీస్‌ సపోర్ట్‌ ఉపసంహరణ కారణంగా ఉత్పన్నమయ్యే ఈ-వేస్ట్‌పై స్పందించేందుకు మైక్రోసాఫ్ట్ నిరాకరించిందని కెనాలసిస్‌ సంస్థ వెల్లడించింది. 

విండోస్‌ 10 వాడుతున్నారా..?అయితే ఈ సెట్టింగ్స్‌ మార్చుకోండి!

మరోవైపు విండోస్‌ 11కు అప్‌గ్రేడ్‌ కాకుండా విండోస్‌ 10లోనే కొనసాగాలనుకునే యూజర్లు ఎక్స్‌టెండెడ్‌ సెక్యూరిటీ అప్‌డేట్స్‌ (ESU) ప్రోగ్రామ్‌ కింద సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉంటుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ ప్రోగ్రామ్‌ కింద నమోదైన డివైజ్‌లకు నెల నెలా సెక్యూరిటీ అప్‌డేట్స్‌ వస్తాయి. అయితే, ఈ సపోర్ట్‌ 2028 అక్టోబర్‌ వరకు, అంటే మూడేళ్లపాటు మాత్రమే ఇవ్వనుంది. తర్వాత యూజర్లు పాత వాటి స్థానంలో కొత్త కంప్యూటర్లు కొనక తప్పదు. ఇలా, ఈ-వేస్ట్‌గా మారే కంప్యూటర్లను ఎలక్ట్రానిక్‌ వాహనాలు, విండ్‌ టర్బైన్‌ తయారీలో ఉపయోగించడం వల్ల కొంతమేర వ్యర్థాలను తగ్గించుకునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని