Stock Market: కొనసాగుతున్న బుల్‌ జోరు.. సరికొత్త గరిష్ఠాలకు మార్కెట్‌ సూచీలు..!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వారాంతంలో కూడా లాభాల జోరును కొనసాగిస్తున్నాయి.

Published : 15 Dec 2023 09:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ మార్కెట్‌ సూచీలు వారాంతపు ట్రేడింగ్‌ను లాభాలతో ప్రారంభించాయి. ఉదయం 9.20 సమయంలో సెన్సెక్స్‌ 296 పాయింట్లు పెరిగి 70810 వద్ద, నిఫ్టీ 91 పాయింట్లు పెరిగి 21,274 వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో రెండు సూచీలు సరికొత్త గరిష్ఠాలకు చేరినట్లైంది. రూపాయి మారకం విలువ 83.03 వద్ద ట్రేడవుతోంది. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. అత్యధికంగా హాంకాంగ్‌ సూచీ 3.22, జపాన్‌ సూచీ 1.20శాతం విలువ పెరిగాయి. 

* అమెరికా తరహాలో బ్రిటన్‌లోనూ వడ్డీరేట్లలో మార్పు చేయడం లేదని ఆ దేశ కేంద్ర బ్యాంక్‌ ప్రకటించింది. బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు పెరిగినా, కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించనున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్ల్లండ్‌ వెల్లడించింది. ప్రస్తుతం వడ్డీ రేట్లు 15 ఏళ్ల గరిష్ఠమైన 5.25 శాతంగా ఉన్నాయి.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం ముగిసేసరికి, అదానీ గ్రూప్‌ కంపెనీల వద్ద ఉన్న నగదు నిల్వలు గతేడాది తొలి ఆరు నెలలతో పోలిస్తే 13.7% వృద్ధి చెంది రూ.45,895 కోట్లకు చేరుకున్నాయి. అన్ని వ్యాపారాల్లో ఆదాయాలు పెరగడం ఇందుకు దోహదం చేసింది. గతేడాది తొలి ఆరు నెలలతో పోలిస్తే ఈ సారి పన్నుకు ముందు లాభం రూ.57,219 కోట్ల నుంచి రూ.71,253 కోట్లకు చేరింది. స్థూల ఆస్తులు 6% పెరిగి రూ.4.5 లక్షల కోట్లకు చేరాయి.

* కూరగాయలు, ఉల్లిగడ్డలు ప్రియం కావడంతో నవంబరులో టోకు ధరలు ఎనిమిది నెలల గరిష్ఠ స్థాయికి చేరాయి. గత నెల టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ (డబ్ల్యూపీఐ) 0.26 శాతానికి పెరిగింది. ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు ఏడు నెలలుగా డబ్ల్యూపీఐ మైనస్‌లోనే (ప్రతిద్రవ్యోల్బణ స్థితి) నమోదవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబరులో డబ్ల్యూపీఐ సూచీ -0.52 శాతంగా ఉంది. నవంబరులో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 8.18 శాతానికి పెరిగింది.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో (ఏప్రిల్‌- నవంబరు) ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.10.64 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ అంచనాల్లో ఈ విలువ 58.34 శాతం కావడం గమనార్హం. 2022-23 ఏప్రిల్‌- నవంబరు వసూళ్లతో పోలిస్తే ఇవి 23.4 శాతం అధికమని ఆర్థిక శాఖ వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని