Ola MoveOS 4: జియో ఫెన్సింగ్‌, థెఫ్ట్‌ అలర్ట్‌తో ఓలా మూవ్‌ ఓఎస్‌4

MoveOS 4 released: ఓలా ఎలక్ట్రిక్‌ కొత్త ఓఎస్‌ అప్‌డేట్‌ను విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లతో మూవ్‌ ఓస్‌4ను స్కూటర్లకు విడుదల చేసింది.

Published : 18 Jan 2024 20:30 IST

MoveOS 4 | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ విద్యుత్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric).. తమ విద్యుత్‌ స్కూటర్ల కోసం మూవ్‌ ఓఎస్‌4ను (MoveOS 4) విడుదల చేసింది. ఇందులో కొన్ని కొత్త ఫీచర్లను తీసుకురాగా.. మరికొన్నింటిని మెరుగుపరిచారు. ఓవర్‌ ది ఎయిర్‌ అప్‌డేట్‌ డేటా ద్వారా కస్టమర్లకు అందునుంది. కొత్త సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ ద్వారా పనితీరుతో పాటు భద్రతాపరంగా మెరుగైన రైడింగ్‌ అనుభవాన్ని అందుకుంటారని ఓలా తెలిపింది.

మూవ్‌ ఓఎస్‌4 బీటా వెర్షన్‌కు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభించిందని ఓలా ఎలక్ట్రిక్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ అనుషుల్‌ ఖండేల్వాల్‌ పేర్కొన్నారు. కస్టమర్లందరికీ మెరుగైన ఫీచర్లను అందివ్వాలన్న ఉద్దేశంతో మూవ్‌ ఓఎస్‌ 4ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఓలా ఎస్‌1 జనరేషన్‌-1 పోర్ట్‌ఫోలియో, ఎస్‌1 ప్రో సెకండ్‌ జనరేషన్‌, ఎస్‌1 ఎయిర్‌ స్కూటర్లకు తొలుత మూవ్‌ ఓఎస్‌ అందుతుందని ప్రకటించారు. ఎస్‌1 ఎక్స్‌+ మోడళ్లకు రానున్న కొన్ని నెలల్లో అప్‌డేట్‌ ఇవ్వనున్నారు. 

ఫీచర్లు ఇవే..

  • మూవ్‌ ఓఎస్‌4లో ఓలా మ్యాప్స్‌ను తీసుకొచ్చారు. ఇది సరికొత్త నావిగేషన్‌ అనుభూతిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఫోన్‌ నుంచి నేరుగా లొకేషన్‌ను బ్లూటూత్‌ ద్వారా పంపించుకోవచ్చు. ఓలా ఎలక్ట్రిక్‌ యాప్‌ ద్వారా స్కూటర్‌ లొకేషన్‌ను గుర్తించొచ్చు.
  • హిల్‌ డిసెంట్‌ కంట్రోల్‌ను మరింత మెరుగుపరిచారు. ఎకోమోడ్‌లో క్రూజ్‌ కంట్రోల్‌ను తీసుకొచ్చారు. మాన్యువల్‌ కమాండ్స్‌ అవసరం లేకుండా ఏఐ ఆధారిత ఇండికేటర్లు వాటంతట అవే ఆఫ్‌ అవుతాయి. స్కూటర్‌పై వెళ్తున్నప్పుడు ఫేవరెట్‌ లిస్ట్‌లో ఉన్న వ్యక్తులు మాత్రమే కాల్‌ చేసే ఆప్షన్‌ను కొత్త ఓఎస్‌ అప్‌డేట్‌లో తీసుకొచ్చారు. 
  • కొత్తగా ‘కేర్‌’ అనే ఆప్షన్‌ను తీసుకొచ్చారు. దీని ద్వారా ఎంత మేర కార్బన్‌డయాక్సైడ్‌ వినియోగాన్ని తగ్గించగలిగారు? ఎంత సొమ్ము ఆదా చేయగలిగారు? అనే వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఒకేసారి వేర్వేరు ఓలా స్కూటర్లు మ్యూజిక్‌కు అనుగుణంగా లైట్‌ షో చేసే విధంగా ‘కన్సర్ట్‌’ మోడ్‌ తీసుకొచ్చారు.
  • మూవ్‌ ఓఎస్‌లో కొత్తగా జియో ఫెన్సింగ్‌, టైమ్‌ ఫెన్సింగ్‌ అనే ఆప్షన్లను తీసుకొచ్చారు. దీని ద్వారా నిర్దిష్ట ప్రదేశం, సమయంలో మాత్రమే పనిచేసేలా స్కూటర్‌కు కమాండ్స్‌ ఇవ్వొచ్చు. ట్యాంపర్‌ డిటెక్షన్‌ సదుపాయాన్ని తీసుకొచ్చారు. ఎవరైనా దొంగతనానికి ప్రయత్నిస్తే ఈ ఫీచర్‌ యూజర్‌ను అలర్ట్‌ చేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని