Bhavish Aggarwal: భారత్‌ మొదటి ఏఐ యూనికార్న్‌గా కృత్రిమ్‌

Bhavish Aggarwal: 50 మిలియన్‌ డాలర్ల నిధుల సమీకరణతో భారత్‌ మొదటి ఏఐ యూనికార్న్‌గా కృత్రిమ్‌ ఏఐ అవతరించింది.

Updated : 26 Jan 2024 20:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓలా గ్రూప్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ కృత్రిమ్‌ ఏఐ (Krutrim AI) పెద్దఎత్తున నిధుల్ని సమీకరించింది. వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ మ్యాట్రిక్స్ పార్టనర్స్‌ ఇండియా నేతృత్వంలోని ఇతర పెట్టుబడిదారుల నుంచి 50 మిలియన్‌ డాలర్లను సమకూర్చుకుంది. దీంతో 2024లో భారత్‌ మొదటి యూనికార్న్‌గా అవతరించింది. బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరిన మొదటి భారతీయ ఏఐ (AI) సంస్థగానూ నిలిచింది. ఈ విషయాన్ని కంపెనీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

‘సొంత ఏఐ తయారుచేయడం భారత్‌కు అవసరం. అత్యంత వేగవంతమైన కృత్రిమ్ ఏఐ మొదటి రౌండ్ నిధుల సమీకరణ విజయవంతంగా ముగిసినందుకు సంతోషంగా ఉన్నాం. మా సామర్థ్యంపై పెట్టుబడిదారులకు ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనం’ అని ఓలా కృత్రిమ్‌ వ్యవస్థాపకుడు భవీశ్‌ అగర్వాల్‌ (Bhavish Aggarwal) తెలిపారు. ‘ఎక్స్‌’ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. సేకరించిన నిధులు ఏఐలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరణ పెంచడంలో కీలకంగా మారనున్నాయన్నారు. ‘ఓలా, ఓలా ఎలక్ట్రిక్‌ భారత్‌లో అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణలను తీసుకొచ్చింది. భవీష్‌ అగర్వాల్‌, కృత్రిమ్‌తో భాగస్వామ్యం పెంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది’ అని మ్యాట్రిక్స్ పార్ట్‌నర్స్ ఇండియా వ్యవస్థాపకుడు, ఎండీ అవ్నీష్ బజాజ్ అన్నారు.

భారత్‌కు అధిక ప్రాధాన్యం.. ఫాక్స్‌కాన్‌ సీఈఓకు పద్మభూషణ్‌ ఇందుకే

గతేడాది డిసెంబరులో కృత్రిమ్‌ తన లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ (LLM)ని ఆవిష్కరించింది. బెంగళూరు, శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న ప్రముఖ కంప్యూటర్‌ శాస్త్రవేత్తల బృందంతో శిక్షణ పొందింది. ఈ మోడల్‌ అనేక దేశీయ భాషలను అనర్గళంగా అర్థం చేసుకోగలదు. దీన్ని రెండు ఫార్మాట్‌లలో తీసుకురానున్నారు. బేసిక్‌ ఫార్మాట్‌ను జనవరిలోనే లాంచ్‌ చేయనున్నట్లు గత నెలలో అగర్వాల్‌ తెలిపారు. విజన్‌, స్పీచ్‌, టాస్క్ ఎగ్జిక్యూషన్‌ సామర్థ్యాలతో మరింత అధునాతనమైన కృత్రిమ్‌ ప్రోను ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.


ఓలా హెరిటేజ్‌ రైడ్‌

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓలా ఎలక్ట్రిక్‌ యూనిటీ హెరిటేజ్‌ రైడ్‌ పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఇందులోభాగంగా లా కమ్యూనిటీ సభ్యులు దగ్గర్లోని వారసత్వ కట్టడాలను సందర్శించారు. దేశవ్యాప్తంగా 26 నగరాల్లో ఈ కార్యక్రమం చేపట్టారు. దేశ సాంస్కృతిక, వారసత్వ సంపదను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఓలా  నిర్వహించింది. మరోవైపు రిపబ్లిక్‌ డేను పురస్కరించుకొని ఈవీకి మారేందుకు ఓలా అవకాశం కల్పిస్తోంది. తమ విద్యుత్‌ స్కూటర్ల కొనుగోలుపై రూ.25వేల వరకు ప్రయోజనాలు అందిస్తోంది. అదనపు వారెంటీపై 50 శాతం రాయితీ, ఎక్స్ఛేంజ్‌ బోనస్‌, క్రెడిట్‌ కార్డ్‌ ఈఎంఐపై డిస్కౌంట్‌ వంటి ప్రయోజనాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. జనవరి 31 వరకు ఈ ఆఫర్‌ కొనసాగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని