PMVVY: ఈ పాలసీ తీసుకుంటే ప్రతినెలా రూ.9,000 పింఛను

వృద్ధాప్యంలో సామాజిక, ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వయ వందన యోజన అనే పింఛను పథకాన్ని ప్రారంభించింది....

Updated : 12 Sep 2022 14:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వృద్ధాప్యంలో సామాజిక, ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి వయ వందన యోజన (PMVVY) అనే పింఛను పథకాన్ని ప్రారంభించింది. 60 ఏళ్ల తర్వాత ఆదాయం కోల్పోయే వారికి అండగా ఉండటమే లక్ష్యంగా దీన్ని ప్రవేశపెట్టింది. ‘లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ ద్వారా దీన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. మరి ఈ పథకంలో చేరడానికి ఎవరు అర్హులు? ఎలాంటి ప్రయోజనాలుంటాయో చూద్దాం..

కేంద్ర ప్రభుత్వం పీఎంవీవీవై (PMVVY)ను  2017 మే 4న ప్రారంభించింది. నాటి నుంచి ప్రతి ఏటా ఈ పథకంలో చేరడానికి ఉన్న గడువును సంవత్సరం చొప్పున పొడిగిస్తూ వస్తోంది. తాజాగా 2023 మార్చి 31ని తుది గడువుగా నిర్ణయించారు. ఈ పాలసీని ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయొచ్చు. గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు చెల్లించి పాలసీని కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొనుగోలు చేసిన తర్వాతి నెల నుంచే పింఛను అందడం మొదలవుతుంది.

PMVVYలో చేరడానికి అర్హతలు..

  • కనీస వయసు: 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ
  • గరిష్ఠ వయసు: పరిమితి లేదు
  • పాలసీ వ్యవధి: 10 ఏళ్లు
  • కనీస పింఛను: నెలకు రూ.1,000
  • గరిష్ఠ పింఛను: నెలకు రూ.9,250

పింఛను చెల్లింపునకు నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం.. ఇలా నచ్చిన కాలవ్యవధిని ఎంచుకోవచ్చు. అందుకనుగుణంగానే పింఛను మొత్తం లభిస్తుంది. ఒకవేళ పాలసీదారులు మూడు నెలలకు ఒకసారి పింఛను కావాలనుకుంటే.. కనిష్ఠంగా రూ.3,000; గరిష్ఠంగా రూ.27,750 పొందొచ్చు.

పాలసీ ప్రయోజనాలు..

10 ఏళ్ల పాలసీ కాల వ్యవధిలో ఏటా దాదాపు 7.66 శాతం రిటర్న్స్‌ అందుతాయి.

 కాల వ్యవధి ముగిసిన తర్వాత పింఛనుదారుడికి పాలసీ కొనుగోలు ధరను పూర్తిగా తిరిగిచ్చేస్తారు.

ఒకవేళ పాలసీ వ్యవధిలోపు మరణిస్తే పాలసీ కొనుగోలు ధరను పూర్తిగా నామినీకి చెల్లించేస్తారు. అప్పటికే వారు క్రమం తప్పకుండా పింఛను పొంది ఉంటారు.

మూడేళ్లు ముగిసిన తర్వాత పాలసీపై పింఛనుదారుడు రుణం తీసుకునేందుకు అర్హత లభిస్తుంది. పాలసీ కొనుగోలు మొత్తంలో 75 శాతం వరకు రుణం పొందొచ్చు. వడ్డీని పింఛను మొత్తం నుంచి వసూలు చేసుకొంటారు.

ఒకవేళ పాలసీ నియమ నిబంధనలు నచ్చకపోతే కొనుగోలు చేసిన 15 రోజుల్లో రద్దు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకొన్న వారికి రద్దుకు 30 రోజుల వరకు వ్యవధి లభిస్తుంది.

ఒకవేళ పింఛన్‌దారుడు లేదా వారి జీవిత భాగస్వామికి ఏదైనా అత్యవసర వైద్య చికిత్స అవసరమైతే పాలసీ నుంచి బయటకు రావొచ్చు. ఈ ఒక్క సందర్భంలో మాత్రమే పాలసీ కొనుగోలు మొత్తాన్ని ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే, చెల్లించిన మొత్తంలో 98 శాతం మాత్రమే తిరిగిస్తారు.

ఉదాహరణకు శ్రీరాముులు అనే వ్యక్తి ఈ కింది వివరాలతో పాలసీని తీసుకున్నారనుకుందాం.

  • శ్రీరాములు వయసు: 60 ఏళ్లు
  • కొనుగోలు ధర: రూ.7,50,000
  • పాలసీ వ్యవధి: 10 ఏళ్లు
  • పింఛను పొందే కాలావధి: ప్రతినెలా

శ్రీరాములుకు అందే ప్రయోజనాలు ఇలా ఉంటాయి..

శ్రీరాములుకు పదేళ్ల పాటు నెలకు దాదాపు రూ.5,000 పింఛను లభిస్తుంది.

10 ఏళ్ల తర్వాత రూ.7,50,000 తిరిగొస్తాయి. అప్పటి వరకు అందుకున్న పింఛనుతో అతడి అవసరాలు తీరతాయి.

★ ఒకవేళ 65 ఏళ్ల వయసులో పాలసీదారుడు మరణిస్తే.. అప్పటి వరకు అందుకున్న పింఛనుకు అదనంగా పాలసీ కొనుగోలుకు వెచ్చించిన రూ.7,50,000ను నామినీకి చెల్లిస్తారు.

ఏదైనా వైద్య చికిత్స నిమిత్తం పాలసీదారుడు మధ్యలోనే నిష్క్రమించాలనుకుంటే రూ.7,50,000లో 98 శాతానికి సమానమైన రూ.7,35,000 తిరిగిచ్చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని