QR కోడ్‌ స్కాన్‌తో ఇక నాణేలు.. 12 నగరాల్లో వెండింగ్‌ మెషిన్లు: RBI

QR-based coin vending machine: క్యూఆర్‌ కోడ్‌ ద్వారా నాణేలను తీసుకునేందుకు వీలుగా దేశవ్యాప్తంగా 12 నగరాల్లో వెండింగ్‌ మెషిన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.

Updated : 08 Feb 2023 15:05 IST

దిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నాణేలు కావాలనుకునేవారి కోసం కాయిన్‌ వెండింగ్‌ మెషిన్లను (Coin vending machine) తీసుకొస్తోంది. క్యూఆర్‌ కోడ్‌ను (QR code) స్కాన్‌ చేయడం ద్వారా మెషిన్ల నుంచి నాణేలను పొందొచ్చు. దేశంలోని 12 నగరాల్లో తొలుత ఈ వెండింగ్‌ మెషిన్లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ (Shaktikanta Das) బుధవారం వెల్లడించారు. ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాల్లో భాగంగా ఈ విషయం వెల్లడించారు.

ప్రస్తుతం నగదును తీసుకునేందుకు ఏ విధంగానైతే ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయో.. నోట్లకు బదులు నాణేలు కావాలనుకునేవారికి ఈ కాయిన్‌ వెండింగ్‌ మెషిన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మెషిన్లలో స్క్రీన్‌పై ఉండే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా కావాల్సిన నాణేలను పొందొచ్చు. యూపీఐ ద్వారా బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును చెల్లించి నాణేలు పొందొచ్చు.

తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా ఈ క్యూసీవీఎంలను (క్యూఆర్‌ కోడ్‌బేస్డ్‌ కాయిన్‌ వెండింగ్‌ మెషిన్‌) 12 నగరాల్లోని 19 చోట్ల ఏర్పాటు చేస్తారు. రైల్వేస్టేషన్లు, షాపింగ్‌ మాల్స్‌ వంటి ముఖ్యమైన కూడళ్లలో అందుబాటులో ఉంచుతారు. ఫలితాల ఆధారంగా క్యూసీవీఎంల ద్వారా నాణేలను అందుబాటులో ఉంచేలా బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేస్తామని ఆర్‌బీఐ పేర్కొంది.

ఆ దేశాల వారికీ యూపీఐ సేవలు

యూపీఐ సేవలను మరింత విస్తృతం చేస్తూ ఆర్‌బీఐ మరో నిర్ణయం తీసుకుంది. జీ20 దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు ఎంపిక చేసిన విమానాశ్రయాల్లో చెల్లింపులు చేసేందుకు యూపీఐ సేవలను అందించనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. 2022 డిసెంబర్‌ 1 నుంచి జీ20కి భారత్ అధ్యక్షత వహిస్తున్న సంగతి తెలిసిందే. 2023 నవంబర్‌ 30 వరకు అధ్యక్ష స్థానంలో కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ సదుపాయం కల్పించింది.

బ్యాంకింగ్‌ వ్యవస్థపై ఒక్క కేసుతో ప్రభావం ఉండదు: ఆర్‌బీఐ

అదానీ గ్రూప్‌ కంపెనీలకు భారతీయ బ్యాంకులు ఇచ్చిన రుణాలు స్వల్పమేనని ఆర్‌బీఐ తెలిపింది. అయినా ఒక్క కేసు వల్ల మన బ్యాంకింగ్‌ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉండబోదని పేర్కొంది. అదానీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న వేళ ఆర్‌బీఐ దీనిపై స్పందించింది. అదానీ గ్రూప్‌నకు రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులకు ఏవైనా ఆదేశాలు ఇచ్చారా అన్న ప్రశ్నకు డిప్యూటీ గవర్నర్‌ ఎంకే జైన్‌ సమాధానమిస్తూ.. కంపెనీల ఆస్తులు, నిధుల లభ్యత, కంపెనీ ప్రాజెక్టులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని బ్యాంకులు నిధులు ఇస్తాయే గానీ, మార్కెట్‌ విలువను బట్టి కాదని పేర్కొన్నారు. అయినా బ్యాంకింగ్‌ వ్యవస్థ చాలా బలంగా ఉందని, ఒక్క సంఘటన వల్ల వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉండబోదని గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు