Financial Planning: కష్టార్జితం వృథా కాకుండా సంపదగా మార్చుకోవాలంటే?

కష్టపడి సంపాదించిన డబ్బుని నష్టపోకుండా, వృద్ధి చేయాలంటే ఏలాంటి మార్గాలను అనుసరించాలో ఇప్పుడు చూద్దాం

Published : 05 Jan 2023 16:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీవన వ్యయం రోజురోజుకీ పెరగడంతో డబ్బు సంపాదిస్తేనే సరిపోదు. కాపాడుకోవాలి. దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఈ ప్రక్రియలో కొంతమంది తడబడుతుంటారు. తాము కష్టపడి సంపాదించిన డబ్బుని నష్టపోతుంటారు. అలా నష్టపోకుండా.. వృద్ధి చేయాలంటే కొన్ని మార్గాలను అనుసరించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మోసాల బారిన పడకుండా..

ఆన్‌లైన్‌ లావాదేవీలు ఇప్పుడు సర్వసాధారణం అయ్యాయి. కాబట్టి మోసగాళ్లు ఉపయోగించే ట్రిక్కుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియాతో పాటు ఇతర బ్యాంకులు, ప్రభుత్వం.. ఆర్థిక మోసాల గురించి, నేరగాళ్లు అనుసరించే ట్రిక్కుల గురించి అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. వాటి గురించి తెలుసుకుని అప్రమత్తంగా ఉండడం వల్ల, మోసగాళ్లకు మన డబ్బు చిక్కకుండా కాపాడుకోవచ్చు. ఎల్లప్పుడూ సురక్షితమైన బ్యాకింగ్‌ పద్ధతుల ద్వారా లావాదేవీలు చేయాలి. 

పెట్టుబడులు..

సంపద పెరగాలంటే పెట్టుబడులు పెట్టాల్సిందే. చాలా మంది దీని గురించి ఆలోచిస్తారు. కానీ ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనేదే అసలు ప్రశ్న. దీనికి సమాధానం కావాలంటే.. కొంత అధ్యయనం అవసరం. ముందుగా మీరు నష్టభయాన్ని తీసుకోగల సామర్థ్యం, పెట్టుబడుల లక్ష్యం వంటి వాటిని తెలుసుకొని ఆ తర్వాతే ఎక్కడ మదుపు చేయాలో నిర్ణయించుకోవాలి. ప్రభుత్వంతో పాటు సెబీ, పీఎఫ్‌ఆర్‌డీఏ, ఆర్‌బీఐ వంటి నియంత్రణ సంస్థలు అందించే పథకాలల్లో భద్రత ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లతో అనుసంధానమైన పెట్టుబడుల్లో కొంత నష్టభయం ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగా అధ్యయనం చేసి సరైన పెట్టుబడులను ఎంచుకోవాలి. 

బీమా..

జీవితంలో స్థిరపడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దానికి తగినట్టే కష్టపడతారు. డబ్బు కూడబెడతారు. కానీ ఏదైనా అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరాల్సి వస్తే.. అప్పటి వరకు కూడబెట్టిన డబ్బంతా ఆసుపత్రి ఖర్చులకే సరిపోతుంది. ఒక్కోసారి అప్పులు చేయాల్సి రావచ్చు. ఇలా మీ కష్టార్జితం మొత్తం ఆసుపత్రుల పాలు కాకుండా ఉండాలంటే తగిన ఆరోగ్య బీమా తప్పనిసరి. అలాగే సంపాదించే వ్యక్తి లేనప్పుడు కుటుంబానికి రక్షణ కల్పించే టర్మ్‌ బీమా కూడా తీసుకోవడం వల్ల మీరు లేకపోయినా మీ ఆర్థిక లక్ష్యాలను మాత్రం నెరవేర్చుకునే వీలుంటుంది.

ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. భవిష్యత్‌లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందో మనం ఊహించలేం. కానీ అన్నింటికీ ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి. ఇందుకు జీవిత, ఆరోగ్య బీమాలు సహాయపడతాయి. 

అత్యాశ వద్దు..

కొన్ని కొన్ని పథకాలు చాలా లాభాదాయకంగా కనిపిస్తాయి. కానీ అవి నిజంగా లాభదాయకం కాకపోవచ్చు. మనం పెద్ద మొత్తంలో రాబడి ఆశించి పెట్టబడి పెడుతున్నమూ అంటే.. దాని వెనుక రిస్క్‌ కూడా అధికంగా ఉండొచ్చు. ఒక్కోసారి మనం పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా కోల్పోవచ్చు. అలాగని మొత్తం పెట్టుబడులు పెట్టొద్దని కాదు. పెట్టుబడులు పెట్టేటప్పుడు రిస్క్‌ను లెక్కించాలి. పూర్తి పొదుపును కాకుండా కొంత భాగం మాత్రమే రిస్క్‌ ఎక్కువగా ఉన్న పెట్టుబడుల్లో పెట్టవచ్చు. ఒకవేళ అనుకోకుండా నష్టపోయినా ఎక్కువగా చింతించరు.

ఆర్థిక నిపుణులు..

ఆర్థిక సాధనాల గురించి స్వీయ అవగాహన ఉండాలి. ఇది ఏ మార్గాన్ని ఎంచుకోవాలో మనకు తెలుపుతుంది. అయితే ప్రతి ఒక్కరూ వీటిని గురించి అర్థం చేసుకోలేక పోవచ్చు. కాబట్టి అవసరమైతే అనుభవజ్ఞులైన ఆర్థిక నిపుణులు సలహా తీసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని