Cash: నగదు కోసం బంగారాన్ని విక్రయించాలా? రుణం తీసుకోవాలా?

ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు బంగారాన్ని అమ్మడం కంటే, రుణ సంస్థల వద్ద రుణాన్ని తీసుకోవడం ఎందుకు మంచిదో ఇక్కడ చూడండి.

Published : 07 Aug 2023 16:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఒక వ్యక్తికి లేదా కుటుంబానికి ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎప్పుడైనా ఏర్పడొచ్చు. అలాంటప్పుడు బ్యాంకులు అందరికీ అన్ని వేళలా వ్యక్తిగత రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండవు. అలాంటి సందర్భాల్లో చాలా మంది బంగారంపై ఆధారపడతారు. భారత్‌లో ముఖ్యంగా మహిళలు తమ ఆర్థిక స్థోమతను బట్టి బంగారాన్ని కలిగి ఉంటారు. ఇటువంటి వారికి వివిధ రుణ సంస్థల ద్వారా రుణం లభించడానికి అవకాశం ఎక్కువ. అయితే, కొంత మంది తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్మడానికి మొగ్గు చూపుతుంటారు. ఇంతకీ బంగారంపై రుణం మంచిదా? అమ్మడం బెటరా?

బంగారం అమ్మాలనుకుంటే..

బంగారం ధర భవిష్యత్‌లో తగ్గుతుందని మీరు భావిస్తే దాన్ని మార్కెట్లో విక్రయించవచ్చు. మీరు ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో బంగారాన్ని తాకట్టు పెట్టకుండా విక్రయానికి నిర్ణయం తీసుకుంటే.. మీరు బంగారాన్ని కొనుగోలు చేసిన అభరణాల వ్యాపారికి అమ్మొచ్చు. అయితే, భౌతిక బంగారాన్ని కొనడం సులభమే.. కానీ, అమ్మడం అంత లాభసాటి కాదు. నగల వ్యాపారి బంగారం నాణ్యతను కచ్చితమైన పద్ధతిలో చూస్తారు. ప్రస్తుత రోజుల్లో హాల్‌మార్క్‌ అనేది నాణ్యత ప్రమాణాలకు తప్పనిసరి. చాలా మంది వ్యాపారులు బంగారం కొనుగోలు ఇన్‌వాయిస్‌లు లేకుండా తిరిగి కొనుగోలు చేయడానికి ఇష్టపడరు. కొంత మంది వ్యాపారులయితే నగదు ఇవ్వకుండా బంగారానికి బదులు సమాన విలువ కలిగిన బంగారాన్ని మాత్రమే ఇస్తారు.

వ్యత్యాసం

సాధారణంగా నగలు అమ్మేటప్పుడు కొనుగోలు రేటుకు, అమ్మకం రేటుకు వ్యత్యాసం ఉంటుందని మీరు గమనించాలి. ఆ వ్యత్యాసాన్ని స్ప్రెడ్‌ అంటారు. ఉదాహరణకు ఒక బంగారం షాపు యజమాని మీకు 10 గ్రాముల 24K బంగారాన్ని రూ.61,000కు విక్రయించొచ్చు. అదే పరిమాణంలో కొనుగోలు చేసినప్పుడు మీకు రూ.60,200 రేటును నిర్ణయిస్తారు. తద్వారా రూ.800 స్ప్రెడ్‌ను వసూలు చేస్తారు. మీరు బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినప్పుడు మేకింగ్ ఛార్జీలు, పన్నులు చెల్లించాలి. కానీ, నగల వ్యాపారికి ఈ అభరణాలను విక్రయించేటప్పుడు అవన్నీ పరిగణనలోకి తీసుకోరు. అదనంగా, అభరణాల వ్యాపారి వసూలు చేసే స్ప్రెడ్‌ను మీరు భరించాలి. అంతేకాకుండా బంగారు ఆభరణాలలో విలువైన రాళ్లు ఉన్నాసరే వాటికి విలువ కట్టరు. కొన్ని ఫైనాన్స్ కంపెనీలు బంగారాన్ని కోనుగోలు చేసి తక్షణ నగదును చెల్లిస్తున్నాయి.

అమ్మితే పన్నులు...

మీరు బంగారాన్ని విక్రయించినప్పుడు పన్ను కూడా చెల్లించాలని గుర్తుంచుకోండి. బంగారాన్ని కొన్న మూడేళ్ల లోపు వ్యవధిలో విక్రయిస్తే.. దాని లాభాలపై పన్ను స్లాబ్‌ ప్రకారం స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. 3 సంవత్సరాల వ్యవధి తర్వాత విక్రయిస్తే, దీర్ఘకాలిక మూలధన లాభాలు వర్తిస్తాయి. 20.80% పన్ను (ఇండెక్సేషన్‌తో పాటు) విధిస్తారు.

బంగారంపై రుణం మంచిదేనా?

మీరు ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు నగదు లభ్యతకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడితే మీ బంగారాన్ని అమ్మి లిక్విడేట్‌ (నగదు) చేసుకోవచ్చు. కానీ, బంగారాన్ని లిక్విడేట్‌ చేయడం అంత సులభం కాదని ఇప్పటికే తెలుసుకున్నాం. బంగారాన్ని రుణసంస్థల వద్ద తాకట్టు పెట్టి కూడా వేగంగా రుణాన్ని పొందొచ్చు. తద్వారా వచ్చిన నగదుతో మీ ఆర్థిక అవసరాలు తీర్చుకోవచ్చు. అంతేకాకుండా భవిష్యత్‌లో బంగారం ధర పెరుగుతుందని మీరు భావిస్తున్నట్లయితే.. బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడమే మంచి ఎంపిక. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు బంగారాన్ని తాకట్టు పెట్టుకుని రుణాన్ని అందిస్తాయి. రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించిన తర్వాత బంగారాన్ని తిరిగి పొందొచ్చు. కాలక్రమంలో మీ బంగారం విలువ బ్యాంకులో తాకట్టు పెట్టిన దానికంటే ఎక్కువ విలువైనదిగా ఉండే అవకాశం ఉంది.

రుణ లభ్యత

సాధారణంగా 18K-24K స్వచ్ఛతతో కూడిన బంగారు నాణేలు, బిస్కెట్లు, ఆభరణాలు వంటి బంగారు వస్తువులపై రుణం లభిస్తుంది. బంగారం నాణ్యతను బట్టి ఎంత రుణం ఇవ్వాలనేది రుణ సంస్థలు నిర్ణయిస్తాయి. చాలా బ్యాంకులు బంగారం (ప్రస్తుత మార్కెట్‌) విలువలో 75% వరకు రుణాన్ని అనుమతిస్తాయి. ఈ రుణాల కాలవ్యవధి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. కొన్ని రుణ సంస్థలు రుణ మొత్తంలో దాదాపు 0.50% నుంచి 1% వరకు ప్రాసెసింగ్‌ ఫీజు వసూలు చేస్తున్నాయి.

రుణానికి అనుకూలతలు

బంగారు రుణాలలో బంగారాన్ని తాకట్టుగా ఉపయోగిస్తారు. కాబట్టి రుణ సంస్థలకు తక్కువ రిస్క్‌ ఉంటుంది. ఈ సౌలభ్యం కారణంగా రుణ సంస్థలు ఈ రుణాలను త్వరగా ప్రాసెస్‌ చేస్తాయి. రుణాన్ని దరఖాస్తు చేయడానికి కేవైసీ డాక్యుమెంట్లను సమర్పిస్తే సరిపోతుంది. ఇవి సెక్యూర్డ్‌ రుణాలు కాబట్టి తక్కువ వడ్డీ(7-14%) రేటుకే రుణం లభిస్తుంది. చాలా ఎన్‌బీఎఫ్‌సీలు భౌతిక బంగారంపై ప్రాసెసింగ్‌ రుసుములను వసూలు చేయడం లేదు. ముందస్తు చెల్లింపులకు జరిమానాలు విధించడం లేదు. బంగారు రుణాలపై క్రెడిట్‌ హిస్టరీ అవసరం లేదు. అలాగే, తాకట్టు బంగారాన్ని బ్యాంకులు ఖజానాలో నిల్వ చేస్తాయి. కాబట్టి, ఇంటి కన్నా సురక్షితమైన ప్రదేశంలో బంగారం ఉంటుంది, భద్రతకు ఢోకా ఉండదు.

డిజిటల్‌ పెట్టుబడులైతే..

మీరు బంగారాన్ని డిజిటల్‌ రూపంలో పెట్టుబడి పెట్టినట్లయితే.. అంటే, గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్‌లు మొదలైనవి. ఇలాంటి పెట్టుబడులను విక్రయించడం చాలా సులభం. వీటిని కొద్ది రోజుల్లోనే రిడీమ్‌ చేసుకోవచ్చు. అందుకే, డిజిటల్‌ రూపంలో బంగారాన్ని కొనుగోలు చేయమని నిపుణులు సూచిస్తుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని