IIFL: కొత్త ఖాతాదారులను తీసుకోవద్దు.. ఐఐఎఫ్‌ఎల్‌కు సెబీ ఆదేశాలు!

ఖాతాల నిర్వహణలో అవకతవకలకు పాల్పడిందని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌పై సెబీ ఆంక్షలు విధించింది. ఐఐఎఫ్‌ఎల్‌ చర్యలు నమ్మకైన, సురక్షితమైన మార్కెట్‌ను సృష్టించేందుకు భారత ప్రభుత్వం, సెబీ గత కొన్నేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలపై ప్రభావం చూపించే విధంగా ఉన్నాయని తెలిపింది.

Published : 19 Jun 2023 22:17 IST

ముంబయి: ఖాతాల నిర్వహణలో జరిగిన అవకతవకల కారణంగా ఐఐఎఫ్‌ఎల్‌ (IIFL) సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌పై సెబీ ఆంక్షలు విధించింది. రాబోయే రెండేళ్ల వరకు కొత్త ఖాతాదారులను తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఖాతాల నిర్వహణలో ఐఐఎఫ్‌ఎల్‌ నిబంధనలు పాటించడంలేదనే కారణంతో ఈ నిర్ణయం తీకున్నట్లు సెబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఖాతాదారుల నిధులను సంస్థ నిధులతో కలిపేయడం, డెబిట్‌ ఖాతాలను సెటిల్‌ చేసేందుకు క్రెడిట్ బ్యాలెన్స్ ఖాతాలను ఉపయోగించడం, సంస్థ వ్యాపారపరమైన నిధుల సమస్యను పరిష్కరించడానికి క్రెడిట్‌ ఖాతాలను ఉపయోగించడం వంటి చర్యల కారణంగా ఐఐఎఫ్‌ఎల్‌పై ఆంక్షలు విధించినట్లు తెలిపింది. ఇది సెబీ 1993 సర్క్యులర్‌కు పూర్తి విరుద్ధం. ఏప్రిల్‌ 10, 2011 నుంచి జనవరి 31, 2017 మధ్య కాలంలో ఐఐఎఫ్‌ఎల్‌ ఈ అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించామని సెబీ వెల్లడించింది.

‘‘ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీ లిమిటెడ్‌ను అతిపెద్ద బ్రోకరేజ్‌ సంస్థగా ప్రచారం చేసుకుంటూ.. వేలాదిమంది రిటైల్‌ ఖాతాదారులతోపాటు కొన్ని సంస్థలకు సైతం సేవలందిస్తామని చెబుతోంది. కానీ, సంస్థ నిబంధనలు పాటించకుండా.. ఖాతాల నిర్వహణలో అవకతవకలకు పాల్పడుతూ నిధులను దుర్వినియోగం చేసింది. ఇలాంటి చర్యలు నమ్మకైన, సురక్షితమైన మార్కెట్‌ను సృష్టించేందుకు భారత ప్రభుత్వం, సెబీ గత కొన్నేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలపై ప్రభావం చూపిస్తాయి. అంతేకాకుండా భారత ఆర్థిక వ్యవస్థకు కూడా నష్టాన్ని కలిగించవచ్చు’’ అని సెబీ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ అవకతవకల కారణంగా ఐఐఎఫ్‌ఎల్‌ దివాళా తీయనప్పటికీ.. మార్కెట్‌ నియంత్రణ సంస్థగా వీటిని అడ్డుకోవాల్సిన బాధ్యత సెబీపై ఉందని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని