Stock Market: మార్కెట్‌ సూచీలపై అమెరికా ఎఫెక్ట్‌..!

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో దేశీయ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. 

Updated : 03 Aug 2023 09:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల ప్రభావం దేశీయ సూచీలపై పడింది. దీంతో నేడు నిఫ్టీ, సెన్సెక్స్‌ భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.17 వద్ద నిఫ్టీ 68 పాయింట్లు కోల్పోయి 19,458 వద్ద, సెన్సెక్స్‌ 222 పాయింట్లు నష్టపోయి 65,559 వద్ద కొనసాగుతున్నాయి. కేఎస్‌బీ, పీటీసీ ఇండస్ట్రీస్‌, స్టార్‌ సిమెంట్‌, పైసాలో డిజిటల్‌, దిలిప్‌ బిల్డ్‌కాన్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. ప్రదీప్‌ పాస్ఫేట్‌, వీఐపీ ఇండస్ట్రీస్‌, గుజరాత్‌ గ్యాస్‌, డెల్టా కార్ప్‌, వేదాంత షేర్ల విలువ కుంగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత పతనమై 82.72 వద్ద ట్రేడింగ్‌ మొదలుపెట్టింది. 

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో ప్రభుత్వ రుణ రేటింగ్‌ను ఫిచ్‌ రేటింగ్స్‌ ఏఏఏ నుంచి ఏఏ+కు తగ్గించడం అంతర్జాతీయ మార్కెట్లపై నేడు కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. గత రెండు దశాబ్దాల్లో అమెరికా ఫెడరల్‌, రాష్ట్రాల, స్థానిక ప్రభుత్వాల రుణాలు భారీగా పెరిగాయని, పరిపాలనా ప్రమాణాలు క్షీణించాయని ఫిచ్‌ పేర్కొనడం మదుపర్లను కలవరపెట్టింది. ఇంతకు ముందు 2011లోనూ రుణరేటింగ్‌లో కోత పడింది.

అమెరికా మార్కెట్‌ ప్రధాన సూచీలు బుధవారం ట్రేడింగ్‌ను భారీ నష్టాల్లో ముగించాయి. డోజోన్స్‌ 0.98, నాస్‌డాక్‌ 2.17, ఎస్‌అండ్‌పీ 500 సూచీ 1.38శాతం పతనమయ్యాయి. ఈ ప్రభావం నేడు ఆసియా సూచీలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన ఏఎస్‌ఎక్స్‌ 0.55, షాంఘై కాంపోజిట్‌ 0.20, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్‌ 0.47, జపాన్‌కు చెందిన నిక్కీ 1.42శాతం కుంగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని