Loans: వ్యక్తిగత రుణంతో కారు కొనుగోలు చేయొచ్చా?

బ్యాంకుల‌ను సంద‌ర్ళించ‌కుండానే ఈ 2 రుణాల‌ను ఆన్‌లైన్‌లో కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 

Updated : 24 Sep 2022 16:26 IST

ఇంటర్నెట్‌ డెప్క్‌: ఒకప్పుడు ఆచితూచి రుణాలు అంద‌జేసిన బ్యాంకులు.. ఈ మధ్య కాలంలో విరివిగా రుణాల‌ను ఇచ్చేందుకు ఆస‌క్తి చూపుతున్నాయి. కారు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు బ్యాంకుల నుంచి కారు రుణం తీసుకుని కొనుగోలు చేయడం మనందరికీ తెలిసిందే. అయితే, వ్యక్తిగత రుణంతో కూడా కారు కొనుగోలు చేయవచ్చు. ఇంతకీ అలా చేయడం మంచిదేనా? ఈ రెండు రుణాల మధ్య వ్యత్యాసం ఏంటి? వాహనం కొనుగోలుకు ఏది మేలు? వీటి గురించి తెలుసుకుందాం..

క్రెడిట్ స్కోరు

సాధారణంగా క్రెడిట్ స్కోరు 750 దాటిన వారికి బ్యాంకులు వ్యక్తిగత రుణాలను సులభంగా మంజూరు చేస్తాయి. కారు రుణానికి వ్యక్తిగత రుణంలాగా అధిక క్రెడిట్ స్కోరు ఉండాలని బ్యాంకులు పట్టు పట్టకపోవచ్చు. మీ రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తుంటే మెరుగైన క్రెడిట్ స్కోరు పొందొచ్చు.

త‌న‌ఖా

వ్యక్తిగత రుణాల‌కు హామీ ఇవ్వక్కర్లేదు. కారు రుణం విషయంలో తీసుకున్న రుణాన్ని సంస్థకు పూర్తిగా తిరిగి చెల్లించే వ‌ర‌కు మీ వాహ‌నం బ్యాంకు త‌న‌ఖాలో ఉంటుంది. రుణం చెల్లించ‌డంలో విఫ‌లమైతే బకాయిలను వసూలు చేసుకునేందుకు రుణ సంస్థ కారు వేలం వేస్తాయి. ఇందుకు కావాల్సిన చట్టపరమైన హ‌క్కులు రుణదాతకు ఉంటాయి. వ్యక్తిగత రుణంతో కారు కొనుగోలు చేస్తే మీ కారును జప్తు చేసి వేలం వేసే హక్కు బ్యాంకుకు ఉండదు.

వ‌డ్డీ రేట్లు

వ్యక్తిగత రుణం అసురక్షిత రుణం కాబట్టి మిగతా రుణాలతో పోలిస్తే బ్యాంకులు వీటిపై అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. వ్యక్తిగత రుణానికి, కారు రుణానికి మధ్య వ్యత్యాసం 2-3% వ‌ర‌కు ఉంటుంది. మంచి క్రెడిట్ స్కోరు గల వారికి అందించే వ్యక్తిగత రుణాలపై ప్రభుత్వరంగ బ్యాంకులు 9.30% నుంచి 10.90% వ‌ర‌కు వ‌డ్డీ రేటు వ‌సూలు చేస్తాయి. అదే కారు రుణాలు అయితే 7.65% నుంచి కూడా లభిస్తున్నాయి.

5 ఏళ్లకు రూ. 5 లక్షల రుణం మొత్తంపై కారు రుణానికి, వ్యక్తిగ‌త రుణానికి వివిధ బ్యాంకులు వ‌సూలు చేసే వ‌డ్డీ రేట్లు, ఈఎంఐల వ్యత్యాసాన్ని దిగువ పట్టికలో చూడొచ్చు.
 

గ‌మ‌నిక: ఈ డేటా 2022 సెప్టెంబర్‌ 20 నాటిది. ఈ ప‌ట్టిక‌లో పేర్కొన్న వ‌డ్డీ రేట్లు బ్యాంకులు విధించే అత్యల్ప వ‌డ్డీ రేట్లు మాత్రమే. మీ ఆదాయాన్ని బ‌ట్టి ఇంకా అధిక మొత్తంలో కూడా రుణం తీసుకోవ‌చ్చు. తీసుకునే రుణాన్ని, క్రెడిట్ స్కోరును బట్టి వ‌డ్డీ రేట్లలో మార్పులు ఉంటాయి. రుణ ప్రాసెసింగ్ ఫీజులు, ఇత‌ర ఛార్జీలు ఇందులో క‌ల‌ప‌లేదు.

చివరిగా: రుణాల మంజూరు మీ నెలవారీ ఆదాయం, క్రెడిట్ స్కోరు, ఉద్యోగ స్థితి మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది. బ్యాంకులు మీ నెలవారీ జీతం, క్రెడిట్ స్కోరుతో పాటు మీరు కొనుగోలు చేసే కారు విలువను పరిగణనలోకి తీసుకుంటాయి. ప్రతిదీ సక్రమంగా ఉంటేనే బ్యాంకు మీకు రుణాన్ని మంజూరు చేస్తుంది. వ్యక్తిగత రుణాలతో పోలిస్తే కారు రుణం మంజూరు కావడం కాస్త సులభం. అలాగే, వడ్డీ రేట్ల మధ్య వ్యత్యాసాన్ని దృష్టిలో ఉంచుకుని, వ్యక్తిగత రుణాలతో పోలిస్తే.. కారు రుణం ద్వారా కొనుగోలు చేయడం మేలు. రుణం తీసుకునే సమయంలో ప్రాసెసింగ్ ఛార్జీలు, ఇతర ఛార్జీలను కూడా దృష్టిలో ఉంచుకోవడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని