Tata Tiago EV: టాటా టియాగో ఈవీకి 20వేల బుకింగ్స్‌.. 25 శాతం మంది వాళ్లే!

టాటా మోటార్స్‌ టియాగో ఈవీ పట్ల మొదటిసారి కొనుగోలు చేసే వారు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. 20 వేలమంది ఇప్పటి వరకు బుక్‌ చేసుకుంటే అందులో 25 శాతం వాళ్లే ఉంటున్నారు.

Updated : 27 Dec 2022 22:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టాటా మోటార్స్‌ ఇటీవల తీసుకొచ్చిన టియోగో విద్యుత్‌ కారుకు భారీగా బుకింగ్స్‌ వచ్చాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదలైన ఈ కారుకు ఇప్పటి వరకు 20 వేల బుకింగ్స్‌ వచ్చినట్లు టాటా మోటార్స్‌ తెలిపింది. ఇందులో 25 శాతం మంది అంటే దాదాపు 5 వేల మంది వరకు తొలిసారి కారు కొనుగోలు చేస్తున్న వారే ఉండడం గమనార్హం.

టాటా ఈ ఏడాది పలు విద్యుత్‌ వాహనాలను లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టియాగోను రూ.8.49-రూ.11.49 లక్షల ధరల శ్రేణిలో వివిధ వేరియంట్లను తీసుకొచ్చింది. దీనికి ఇప్పటివరకు 20వేలకు పైగా బుకింగ్స్‌ వచ్చాయని టాటా మోటార్స్‌ తెలిపింది. అందులో 25 శాతం మంది మెదటిసారి కారు కొనుగోలు చేస్తున్నవారే ఉండడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొంది. వచ్చే నెలలోనే ఈ కార్లను డెలివరీ చేయనున్నట్లు వెల్లడించింది. 

ఇక ఈ కారు ఫీచర్ల విషయానికొస్తే.. 19.2KWh, 24 KWh బ్యాటరీ సామర్థ్యం కలిగిన రెండు వేర్వేరు వేరియంట్లలో ఈ కారు లభిస్తుంది. మొదటి వేరియంట్‌ ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 250 కిలోమీటర్ల రేంజ్‌ ప్రయాణిస్తుంది. రెండో వేరియంట్‌తో ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 310 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. బ్యాటరీని ఫుల్‌ చేయడానికి సాధారణ ఛార్జింగ్‌ ద్వారా అయితే 8గంటలకు పైగా సమయం పడుతుంది. అదే ఫాస్ట్‌ ఛార్జర్‌తో అయితే గంటలోనే పూర్తి చేయొచ్చు. కేవలం 5.7 సెకన్లలోనే ఈ కారు 0-60 కిలోమీటర్ల వేగాన్నిఅందుకుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని