Tesla: గుజరాత్‌కు టెస్లా.. త్వరలోనే ప్రకటన వెలువడే ఛాన్స్‌?

Tesla plant in gujarat: టెస్లా గుజరాత్‌లో తన ఈవీ కార్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడవచ్చు.

Published : 29 Dec 2023 14:42 IST

Tesla | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) గుజరాత్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎలక్ట్రికల్‌ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి కేంద్రంతో చర్చలు ఇప్పటికే కొలిక్కి వచ్చినట్లు సమాచారం. త్వరలోనే తుది నిర్ణయం వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. గుజరాత్‌లో ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి వచ్చే ఏడాది జనవరిలో జరిగే ‘వైబ్రంట్‌ గుజరాత్‌’ సమ్మిట్‌లో ప్రకటన వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

గుజరాత్‌ను పెట్టుబడులు, ఎగుమతులు, దిగుమతుల పరంగా అనువైన ప్రదేశంగా టెస్లా కంపెనీ భావిస్తోంది. కొత్త ప్లాంట్‌ ఏర్పాటుకు సనంద్‌, బెచరాజీ, ధొలేరా పేర్లను పరిశీలిస్తోంది. ఇప్పటికే ఆటో తయారీ కంపెనీలైన మారుతీ సుజుకీ, టాటా, మహీంద్రా అండ్‌ మహీంద్రా వంటి బ్రాండ్లకు గుజరాత్‌లో తయారీ యూనిట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి దీనిపై అధికార ప్రకటన ఏదీ వెలువడలేదు. టెస్లా ప్లాంట్‌ ఏర్పాటుపై గుజరాత్‌ మంత్రి రిషికేశ్‌ పటేల్‌ సైతం ఆశాభావం వ్యక్తంచేశారు.

గుజరాత్‌తో పాటు మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలను కూడా ప్లాంట్‌ ఏర్పాటుకు కంపెనీ తొలుత పరిశీలించినట్లు తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్‌ వాహన తయారీ, ఎగుమతులకు తగిన పర్యావరణ వ్యవస్థ ఉంది. అయినప్పటికీ టెస్లా గుజరాత్‌ వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. కాండ్లా-ముంద్రా పోర్టులు ఉండటమే దీనికి కారణం. దీంతో ఎగుమతులు, దిగుమతులకు అనువైన ప్రదేశమని కంపెనీ భావిస్తోంది. తొలుత టెస్లా పూర్తిగా తయారు చేసిన కార్లను దిగుమతి చేయనుంది. ఆ తర్వాత దేశీయంగా తయారీ చేపట్టనుంది. ‘వైబ్రంట్ గుజరాత్‌’ సదస్సుకు టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ సైతం హాజరయ్యే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని