Tesla: జులై-సెప్టెంబరులో టెస్లా నికర లాభంలో 44 శాతం క్షీణత

Tesla: కస్టమర్లను ఆకర్షించడం కోసం టెస్లా పలు కార్ల ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో విక్రయాలు పుంజుకున్నప్పటికీ.. లాభాలకు మాత్రం గండిపడింది.

Published : 19 Oct 2023 11:17 IST

వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన ప్రముఖ విద్యుత్‌ కార్ల (Electric Cars) తయారీ సంస్థ టెస్లా (Tesla) నికర లాభం జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో గణనీయంగా తగ్గింది. విక్రయాలు పుంజుకుంటున్నప్పటికీ.. ధరల్లో కోత కారణంగా లాభాల్లో క్షీణత నమోదైంది.

విద్యుత్‌ కార్ల (Electric Cars)తో పాటు సోలార్‌ ప్యానెళ్లు, బ్యాటరీలను తయారు చేస్తున్న టెస్లా (Tesla) నికర లాభం సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో 44 శాతం తగ్గి 1.85 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ఒక్కో షేరుపై ఆర్జన 95 సెంట్ల నుంచి 53 సెంట్లకు తగ్గింది. కంపెనీ మొత్తం ఆదాయం తొమ్మిది శాతం పెరిగి 23.35 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. త్రైమాసిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలను అందుకోకపోవడం గమనార్హం.

జులై-సెప్టెంబరు మధ్య 4,35,059 వాహనాలను విక్రయించినట్లు టెస్లా (Tesla) ఇటీవల వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే అమ్మకాల్లో 27 శాతం వృద్ధి నమోదైంది. అయితే, త్రైమాసిక ప్రాతిపదికన మాత్రం విక్రయాలు తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్‌ కార్ల (Electric Cars) తయారీ పుంజుకుంటున్న విషయం తెలిసిందే. ప్రధాన వాహన తయారీ సంస్థలన్నీ ఎలక్ట్రిక్‌ వాహనాలనూ ఉత్పత్తి చేస్తున్నాయి. దీంతో వినియోగదారులకు ఎక్కువ ఎంపికలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించడం కోసం టెస్లా (Tesla) ఇటీవల వివిధ మోడళ్ల ధరలను కుదించింది. దాదాపు 4,400 డాలర్ల నుంచి 20,000 డాలర్ల వరకు డిస్కౌంట్‌ ఇస్తోంది.

ఎప్పటిలాగే జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో టెస్లా మోడల్‌ 3, మోడల్‌ వై కార్లు అత్యధికంగా అమ్ముడయ్యాయి. ధరలను తగ్గించిన తర్వాత వినియోగదారులు వీటి వైపు మరింత మొగ్గుచూపుతున్నారు. అయితే, మోడల్‌ ఎస్‌, ఎక్స్‌పై భారీ ఎత్తున ధరలను తగ్గించినప్పటికీ.. విక్రయాలు మాత్రం వార్షిక ప్రాతిపదికన 14 శాతం తగ్గాయి. టెస్లా షేరు విలువ బుధవారం 4.78 శాతం తగ్గి 242.68 డాలర్ల వద్ద ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని