Automobile: ఆ మోడళ్ల విషయంలో కార్ల కంపెనీల పునరాలోచన!

కొత్త ఉద్గార నిబంధనలు అందుకోవడంలో భాగంగా కొన్ని మోడళ్లను మున్ముందూ కొనసాగించే విషయంలో కార్ల తయారీ కంపెనీలు పునరాలోచనలో పడ్డాయి.

Published : 19 Dec 2022 22:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త ఫీచర్లు, ఆధునిక హంగులతో మార్కెట్లోకి ఎన్ని కార్లు వచ్చినా మారుతీ సుజుకీ ఆల్టోకు ఉన్న ఆదరణే వేరు. ఇప్పటికీ ఎంట్రీ లెవెల్‌లో ఓ కారు కొనాలనుకునే వారు ఎక్కువ మంది చూసేది దీనిపైనే. అంతగా ప్రజల మనసుల్ని గెలుచుకుంది. అయితే, ఆల్టో సహా మొత్తం 17 మోడళ్లను కొనసాగించే విషయంలో ఆయా కంపెనీలు తర్జనభర్జన పడుతున్నాయట. వీటిని మున్ముందూ కొనసాగించాలా? వద్దా? మీమాంసలో ఉన్నాయని పలు ఆంగ్ల వెబ్‌సైట్లు పేర్కొన్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఉద్గార నిబంధనలే దీనికి కారణమని చెబుతున్నాయి. 

ఏమిటీ ఉద్గార నిబంధనలు?

2023 ఏప్రిల్‌ నుంచి రియల్‌ డ్రైవింగ్‌ ఎమిషన్‌ (RDE) పేరిట కొత్త ఉద్గార నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వీటినే బీఎస్‌-6 రెండో దశ ఉద్గార ప్రమాణాలు అని కూడా అంటారు. ప్రస్తుతం కార్ల కంపెనీలు ఆయా కార్ల ఉద్గార ప్రమాణాలను ల్యాబ్‌ల్లో పరీక్షిస్తున్నాయి. వాస్తవానికి ఆయా వాహనాలు రోడ్లపైకి వచ్చాక వీటి నుంచి వెలువడే కాలుష్యం అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దీని ప్రకారం.. పాసింజర్‌ వాహనాలు, వాణిజ్య వాహనాల్లో ఎప్పటికప్పుడు వాహన ఉద్గార స్థాయులను కొలిచే విధానం ఉండాలని సూచించింది. ఇందుకోసం ఆయా తయారీ సంస్థలు వాహనాల్లో సంబంధిత పరికరాలను అమర్చాల్సి ఉంటుంది.

కంపెనీలపై భారం

కొత్త ఉద్గార ప్రమాణాలను అందుకోవడానికి కంపెనీలకు ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ముఖ్యంగా డీజిల్‌ కార్ల విషయంలో ఈ ఖర్చు మరింత ఎక్కువ అవుతుంది. ఇందులో భాగంగానే దాదాపు అన్ని కార్ల కంపెనీలు జనవరి నుంచి వాహనాల ధరలు పెంచుతున్నట్లు ఇదివరకే ప్రకటించాయి. దీంతో పాటు కొన్ని వాహనాలను కొనసాగించే విషయంలో పునరాలోచనలో పడ్డాయని సదరు కథనాలు పేర్కొంటున్నాయి. టాటా, మహీంద్రా, మారుతీ సుజుకీ, హుందాయ్‌, టయోటా కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. టాటా ఆల్ట్రోజ్‌ డీజిల్‌, మహీంద్రా మరాజో, రెనో క్విడ్‌ 800, మారుతీ సుజుకీ ఆల్టో 800, హుందాయ్‌ ఐ20 డీజిల్‌, హోండా సిటీ 4th జనరేషన్‌, హోండా సిటీ 5th జనరేషన్‌ డీజిల్‌ తదితర మోడళ్లు ఇందులో ఉన్నాయి. కంపెనీలు అధికారంగా వీటిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని