Debt Trap: ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? మీరు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నట్లే!

Debt Trap: అనివార్య పరిస్థితుల్లో అప్పు చేయక తప్పకపోవచ్చు. కానీ, అదే పనిగా వివిధ రూపాల్లో ఇతరుల నుంచి డబ్బు తీసుకోవాల్సి వస్తే మాత్రం ఆలోచించాల్సిందే. పరిస్థితి అలాగే కొనసాగితే అప్పుల ఊబిలో చిక్కుకోవాల్సి వస్తుంది.

Updated : 22 Dec 2023 13:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలా మంది తమ జీవితంలో ఏదో ఒక దశలో అప్పు చేస్తారు. బ్యాంకు రుణం, చేబదులు, తెలిసినవారి దగ్గరి నుంచి వడ్డీకి తీసుకోవడం.. ఇలా ఏదో ఒక రూపంలో అప్పు చేయాల్సి వస్తుంటుంది. కానీ, అదే పనిగా చేస్తే మాత్రం ముప్పు తప్పదు. కొంతమంది దీన్ని గమనించకుండా అప్పుల ఊబిలో (Debt Trap) చిక్కుకుపోతుంటారు. ఫలితంగా ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడంలో తడబడుతుంటారు. అందుకే రుణ ఉచ్చులో పడడానికి ముందే ముప్పును గుర్తించాలి. దాన్ని తెలియజేసే కొన్ని సంకేతాలేంటో చూద్దాం..

ఆదాయంలో 50% ఈఎంఐలకే..

చాలా మంది నో-కాస్ట్‌ ఈఎంఐ, రాయితీ, తగ్గింపు వంటి ఆఫర్లకు ఆకర్షితులై తరచూ కొనుగోళ్లు చేస్తుంటారు. చేతిలో డబ్బు లేనప్పుడు ఈఎంఐ సదుపాయాన్ని ఉపయోగించుకుంటారు. ఇలా ఆఫర్ల ధ్యాసలో పడి కొంటూ పోతే మన ఆదాయంలో నెలవారీ ఈఎంఐల (EMI) వాటా పెరిగిపోతుంది. చివరకు నిత్యావసరాల కోసం కూడా అప్పు చేయాల్సిన దుస్థితి తలెత్తొచ్చు. అందుకే ఆదాయంలో ఈఎంఐల వాటా 50% దాటుతోందంటే ప్రమాదంలోకి జారుకుంటున్నారని అర్థం.

స్థిర ఖర్చుల వాటా 70% దాటితే..

ఈఎంఐలే కాకుండా ప్రతి కుటుంబంలో స్థిరంగా కొన్ని ఖర్చులు ఉంటాయి. అద్దె, నిత్యావసర సరకులు, పిల్లల స్కూల్‌ ఫీజుల వంటివి ఇందులోకి వస్తాయి. ఇలాంటి స్థిర ఖర్చుల వాటా మన ఆదాయంలో 50 శాతానికి మించకుండా ఉండాలి. కానీ, కుటుంబంలోని పరిస్థితులను బట్టి ఇది 70 శాతం వరకు కూడా చేరొచ్చు. అంతకు మించితే మాత్రం ముప్పు ముంచుకొస్తున్నట్లే. ఏదైనా ఒక దశలో అకస్మాత్తుగా ఆసుపత్రి వ్యయాల వంటి పెద్ద ఖర్చులు వచ్చి పడ్డాయంటే పరిస్థితి దారుణంగా మారుతుంది. పెద్ద మొత్తంలో అప్పు చేయాల్సి వస్తుంది. స్థిర వ్యయాల వాటా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అప్పులు తీర్చడానికి తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

పొరపాటున ఖాతాలో డబ్బు జమైతే...

రోజువారీ ఖర్చుల కోసమూ అప్పు..

రోజువారీ ఖర్చుల కోసం కూడా ఇతరుల నుంచి డబ్బు తీసుకోవాల్సి వస్తుందంటే కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. పిల్లల స్కూల్‌ ఫీజులు, ఈఎంఐల కోసం తరచూ అప్పు చేస్తున్నారంటే మీరు అప్పుల ఊబిలోకి (Debt Trap) జారుకుంటున్నారని అర్థం. తర్వాత తీర్చేయొచ్చనే ధైర్యంతో అప్పు చేస్తూ ఉంటాం. కానీ, తరచూ చేసే అప్పులు గుట్టలా పేరుకుపోతే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.

అప్పు తీర్చడానికి అప్పు..

దీర్ఘకాలంగా కొనసాగుతున్న అప్పు తీర్చడానికి కొంతమంది తిరిగి మరొక చోట అప్పు చేస్తుంటారు. ముఖ్యంగా వడ్డీ భారాన్ని తగ్గించుకోవడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. అలాగే మరికొందరు ఈఎంఐల ఎగవేత ముప్పు తప్పించుకోవడానికి, పిల్లల స్కూల్‌ ఫీజులు గడువులోగా చెల్లించడం వంటి అవసరాల కోసం ఇతరుల నుంచి డబ్బు తీసుకుంటారు. ఇలాంటి పరిస్థితి తలెత్తిందంటే రుణ ఉచ్చులోకి (Debt Trap) దిగుతున్నారని సంకేతం.

క్రెడిట్‌ కార్డు నుంచి నగదు..

క్రెడిట్‌ కార్డు (Credit Card) నుంచి నగదు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ, అది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించుకోవాలి. కానీ, రోజువారీ ఖర్చులు, రుణ చెల్లింపులు, వడ్డీ కోసం క్రెడిట్‌ కార్డు నుంచి నగదు ఉపసంహరించడం అంత శ్రేయస్కరం కాదు. క్రెడిట్‌ కార్డు నుంచి తీసుకునే నగదుపై వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. సకాలంలో తీర్చలేదంటే తిరిగి అదో పెద్ద అప్పుగా మారుతుంది. పైగా ఎగవేత ముప్పు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే క్రెడిట్‌ స్కోర్‌పైనా ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ కార్డు నుంచి తరచూ నగదు తీసుకోవాల్సి వస్తే కచ్చితంగా ఒకసారి మీ ఆర్థిక పరిస్థితిని క్షుణ్నంగా సమీక్షించుకోవాలి.

ఇంటి కోసం సిద్ధం ఇలా

బ్యాంకుల్లో రుణ దరఖాస్తు తిరస్కరణ..

రుణం కోసం చేసుకున్న దరఖాస్తును బ్యాంకులు తిరస్కరిస్తున్నాయంటే మీరు అప్పుల ఊబికి (Debt Trap) అంచున ఉన్నారని అర్థం. సాధారణంగా బ్యాంకులు దరఖాస్తుదారుడి ఆర్థిక స్తోమత ఆధారంగానే రుణం మంజూరు చేస్తాయి. అందుకోసం పాన్‌, ఆధార్‌ వివరాలను ఉపయోగించుకొని దరఖాస్తుదారుడి ఇతర రుణాలు, క్రెడిట్‌ స్కోర్‌, క్రెడిట్‌ చరిత్రను క్షుణ్నంగా సమీక్షిస్తాయి. తిరిగి చెల్లించలేని స్థితికి చేరాడనుకుంటేనే దరఖాస్తుని తిరస్కరిస్తాయి. ఇది కూడా అప్పులు పెరిగిపోతున్నాయనడానికి ఒక సంకేతం.

భవిష్యత్‌ ఆదాయం ఆధారంగా రుణాలు..

రాబోయే రోజుల్లో ఆదాయం పెరుగుతుందని అంచనా వేసి రుణం (Loan) తీసుకోవడం కూడా అప్పులపై ఎక్కువగా ఆధారపడుతున్నారని అర్థం. బోనస్‌లు, రివార్డులు, రాయితీలు వస్తాయని అంచనా వేయడం ఈ పరిధిలోకి వస్తుంది. ఒకవేళ అంచనాలు తప్పితే మాత్రం ఇబ్బందులు తప్పవు. అందుకే ప్రస్తుత ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకునే రుణం తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు