Home Buy: ఇల్లు కొన్న తర్వాత తప్పనిసరిగా చేయాల్సిన పనులు

ఇల్లు కొనుగోలు తర్వాత, ఆ ఇంట్లోకి సాఫీగా మారడానికి, ఆ ప్రధానమైన పెట్టుబడిని కాపాడుకోవడానికి కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకోండి.

Published : 22 Jan 2024 16:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇల్లు కొనుగోలు అనేది చాలా మందికి ఒక ముఖ్యమైన మైలురాయి. జీవితకాలంలో అతిపెద్ద కొనుగోలులో ఇల్లు అత్యంత ముఖ్యమైనది. ప్రధానంగా మంచి ఆర్థిక నిబద్ధత ఉన్నవారే ఇంటిని సొంతం చేసుకోవడంలో ముందుంటారు. ఇంటి కొనుగోలుతోనే బాధ్యత తీరిపోదు. కలల సౌధాన్ని పొందిన తర్వాత చేయాల్సినవి మరికొన్ని ఉన్నాయి. 

ఆస్తి యాజమాన్యం బదిలీ

ఆస్తి పన్ను రికార్డులు సహా అన్ని సంబంధిత డాక్యుమెంట్స్‌లో మీ పేరు అప్‌డేట్‌ చేసుకోవాలి. కొనుగోలుకు సంబంధించిన అన్ని పత్రాలను కనీసం 2 సెట్ల జిరాక్స్‌ను తీయించి వేర్వేరు ప్రదేశాలలో భద్రపరచాలి. లోన్‌పై ఇంటిని కొనుగోలు చేసినట్లయితే..  అది తీరేవరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ బ్యాంకు దగ్గర ఉంటాయి కాబట్టి, వాటి ఫోటోకాపీ మీ దగ్గర ఉండడం తప్పనిసరి. ఒరిజినల్‌ కాపీ మీ దగ్గర ఉంటే మీ అల్మరా/బ్యాంకు లాకర్‌లో భద్రపరిచినా కూడా ప్రతి రెండు నెలలకు చెక్‌ చేయడం మరిచిపోవద్దు. ఈ కాలంలో చాలా మంది పత్రాలను డిజిటలైజేషన్‌ చేస్తున్నారు. పత్రాలను స్కాన్‌ తీయించి కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లో ఒక ఫైలు, డీవీడీలో ఒక ఫైలు సేవ్‌ చేసుకోవడం వల్ల భవిష్యత్‌లో ఉపయోగముంటుంది.

పత్రాల జాబితా

చాలా మంది ఇంటి కొనుగోలుకు బ్యాంకు రుణాలనే ఆశ్రయిస్తారు. ఆస్తి దస్తావేజులతో పాటు లోన్‌ను ప్రాసెస్‌ చేయడం ప్రారంభించిన రోజు నుంచి బ్యాంకుకు సమర్పించే ఒరిజినల్‌ డాక్యుమెంట్స్‌ను జాబితాను రూపొందించండి. ఒరిజినల్‌ డాక్యుమెంట్స్‌ను పేర్కొంటూ లెటర్‌ ఇవ్వాలని బ్యాంకును అడగండి. ఇది డాక్యుమెంట్స్‌ జాబితాకు సంబంధించి  ఎక్నాలెడ్జ్‌మెంట్‌లాగా పనిచేస్తుంది.

ఆస్తికి బీమా, ఎలక్ట్రికల్‌ తనిఖీ

సంపాదించిన ఆస్తిని రక్షించుకోవడం యాజమాని బాధ్యత. ఆస్తికి తప్పక బీమా చేయించాలి. గృహ బీమా వల్ల ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనం, అగ్నిప్రమాదాల లాంటి వివిధ ప్రమాదాల నుంచి ఇంటికి, ఇంటిలోని వస్తువులకు రక్షణ ఉంటుంది. కాబట్టి, వివిధ బీమా పాలసీలను పరిశోధించి సరైనా బీమాను ఎంచుకోండి. ఇల్లు కొనుగోలు తర్వాత ఆ ఇంటిలో ఉండే మొత్తం ఎలక్ట్రికల్‌ ఫిట్టింగ్స్‌ను క్రాస్‌ చెక్‌ చేసుకోండి. ఎక్కువ అగ్ని ప్రమాదాలు ఎలక్ట్రికల్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల జరుగుతుంటాయి. మీరు కొత్త ఇంటితో పాటు ఫ్యాన్లు, ఎయిర్‌ కండీషనర్‌, లైట్లు/ఎలక్ట్రికల్‌ పరికరాలను పొందినట్లయితే వాటి పనితీరు, హామీ/వారంటీ కోసం వాటన్నింటినీ తనిఖీ చేయించండి. ఎలక్ట్రికల్‌ వర్క్స్‌ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు. వీటిపై ఖర్చు మధ్యతరగతి వారు కూడా తట్టుకునే విధంగానే ఉంటుంది.

యుటిలిటీ సేవల బదిలీ

కొత్త ఇంటికి మారినప్పుడు విద్యుత్‌, నీటి/గ్యాస్‌ కనెక్షన్‌ వంటి యుటిలిటీ సేవలను మీ పేరుకు బదిలీ చేసుకోవాలి. సేల్ డీడ్, గుర్తింపు రుజువులు ఇవ్వడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. వీటిని పొందడానికి మునుపటి యజమాని (విక్రేత) నుంచి మీకు ‘నో-అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (NOC)’ అవసరం కావచ్చు. ఇంటిని కొనుగోలు చేసేటప్పుడే ఇప్పటికే ఉన్న అన్ని బిల్లులను మునుపటి యజమాని సెటిల్‌ చేశారని నిర్ధారించుకోండి. అన్ని కరస్పాండెన్స్‌, బిల్లులు మీ కొత్త చిరునామాకు మార్చుకోవాలి.

ఆస్తి పన్ను/ఈసీ రికార్డు

మీరు కొత్త ఇంటిని కొనుగోలు చేసిన తర్వాత, ఆస్తి యాజమాన్యాన్ని మీ పేరుకు బదిలీ చేయడం చాలా అవసరం. ఆస్తి పన్ను (Property Tax) రికార్డ్స్‌ను మీ పేరు మీద మార్చుకోవాలి. ఆస్తికి సంబంధించిన జిరాక్స్‌ కాపీలతో స్థానిక మున్సిపల్‌ ఆఫీసుకు వెళ్లి చలానా కట్టి ఆస్తి పన్ను రికార్డులో మీ పేరు ఉండే విధంగా చూసుకోవాలి. మీ పేరుతో రిజిస్ట్రేషన్‌ కచ్చితంగా జరిగిందో లేదో నిర్ధారించుకోవడానికి ఈసీ (ఎన్‌కంబరెన్స్‌ సరిఫికెట్‌)కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆస్తి నమోదు తేదీ నుంచి ఒక వారం తర్వాత ఈసీ పొందడం మంచిది.

సొసైటీ షేర్‌ సర్టిఫికెట్‌

అపార్ట్‌మెంట్లల్లో ప్రతి ప్రాపర్టీ ఓనర్‌కు వాటాగా సొసైటీ షేర్లు ఉండొచ్చు. వీటిని మీ పేరు మీద బదిలీ చేయించుకోవాలి. సొసైటీకి సేల్‌ డీడ్‌ కాపీని అందజేసి వాటా బదిలీకి అభ్యర్థించాలి. సేల్‌ డీడ్‌ కాపీని సొసైటీకి లేదా రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు సమర్పించి ఆ రికార్డులలో మీ పేరును అప్‌డేట్‌ చేయించండి.

ఐటీఆర్‌

మీరు ఆస్తిని కొనుగోలు చేసినట్లయితే, దాన్ని ఐటీఆర్‌లో ప్రకటించాల్సిన అవసరం లేదు. అయితే, మీ వార్షిక ఆదాయం రూ.50 లక్షల కంటే ఎక్కువ ఉంటే.. ఆదాయపు పన్ను రిటర్న్‌లో కొత్తగా కొనుగోలు చేసిన ఆస్తిని ప్రకటించవలసి ఉంటుంది. ఒకవేళ ఇంటికి రుణం తీసుకున్నట్లయితే, ఐటీఆర్‌లో పన్ను మినహాయింపును పొందొచ్చు. ఆస్తి నుంచి అద్దె ఆదాయన్ని పొందుతున్నట్లయితే దాన్ని ఐటీఆర్‌లో వెల్లడించి తగిన పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇంటి రుణానికి దరఖాస్తు చేసినట్లయితే సెక్షన్‌ 80సి, సెక్షన్‌ 80ఈఈ, సెక్షన్‌24(బి) కింద పన్ను ప్రయోజనాలను పొందొచ్చు. సెక్షన్‌ 80సి.. రుణానికి సంబంధించిన ప్రధాన మొత్తంపై పన్ను ప్రయోజనం. సెక్షన్‌ (బి).. వడ్డీపై పన్ను ప్రయోజనం. సెక్షన్‌ 80ఈఈ.. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి (చెల్లించే వడ్డీపై) పన్ను ప్రయోజనం. ఈ పన్ను ప్రయోజనాలు అనేక నిబంధనలు, షరతులకు లోబడి ఉంటాయి.

నిర్వహణ ఖర్చులు

ఇంటి విలువ, దీర్ఘాయువును కాపాడుకోవడానికి సరైన నిర్వహణ చాలా కీలకం. మీరు కొనుగోలు చేసిన ఇంటికి రిపేర్లు ఉంటే.. గృహప్రవేశం కంటే ముందుగానే వాటిని చేయించండి. ఏదైనా, తక్షణ మరమ్మతు సహా ప్లంబింగ్‌, ఎలక్ట్రికల్‌, పెయింటింగ్‌ పనులు అవసరం మేరకు చేయించడం మంచిది. కొంతమంది ఇంటిని అమ్మేటప్పుడు కనిపించని మరమ్మతులు చేయించకుండా తెలివిగా అమ్మేస్తుంటారు. ఇటువంటి విషయాలలో అనుభవుజ్ఞుల సలహాలు, సంప్రదింపులు అవసరం. అందుచేత ఇంటిని కొనుగోలు చేసేటప్పుడే కొంత అదనపు బడ్జెట్‌ను చేతిలో ఉంచుకోవాలి.

చివరిగా: ఇల్లు అనేది చాలా పెద్ద పెట్టుబడి. మీ తదనంతరం మీ ఆస్తిని ఎవరూ వారసత్వంగా పొందుతారనే విషయాన్ని పేర్కొనడం కూడా చాలా ముఖ్యం. ఈ విషయమై వీలయితే న్యాయనిపుణుల సలహాలు తీసుకోవడం మేలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని