Toyota Kirloskar: టయోటా కంపెనీ డేటాబేస్‌పై సైబర్‌ దాడి!

టయోటా కిర్లోస్కర్‌ డేటా బేస్‌పై సైబర్‌ దాడి జరిగినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ దాడిలో వినియోగదారుల డేటా హ్యాకర్స్ చేతికి చిక్కనట్లు కంపెనీ భావిస్తోంది. 

Published : 01 Jan 2023 20:42 IST

దిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (Toyota) డేటాబేస్‌పై సైబర్‌ దాడి జరిగింది. కంపెనీ సిస్టమ్స్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు వినియోగదారుల వ్యక్తిగత డేటా వివరాలను తస్కరించారు. అయితే, హ్యాకర్స్‌ ఎంత సమాచారాన్ని సేకరించారనే దానిపై వివరాలను సేకరిస్తున్నామని కంపెనీ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘ టయోటా కిర్లోస్కర్‌కు అనుబంధంగా పనిచేసే ఓ సంస్థ మా కంపెనీ డేటాబేస్‌పై సైబర్‌ దాడి జరిగినట్లు మాకు తెలియజేసింది. ఈ దాడిలో టయోటా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం బహిర్గతం అయినట్లు భావిస్తున్నాం. సైబర్‌ నేరగాళ్లు ఎంత సమాచారాన్ని సేకరించారు? కంపెనీ సర్వర్లో ఎంత వరకు చేరుకోగలిగారనే దానిపై విచారణ జరుపుతున్నాం’’ అని కంపెనీ పేర్కొంది. 

టయోటో కిర్లోస్కర్‌ సర్వర్‌పై దాడి విషయాన్ని భారత ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా (సీఈఆర్‌టీ-ఇన్‌) కూడా ధ్రువీకరించింది. సైబర్‌దాడి నేపథ్యంలో తమ సర్వీస్‌ ప్రొవైడర్లతో కలిసి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పించేందుకు కంపెనీ నిరంతంర కృషి చేస్తుందని, వారికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 

మరోవైపు గతేడాది కార్ల అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి నమోదు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. 2021లో కంపెనీ మొత్తంగా 1,30, 768 కార్లను విక్రయించగా, 2022లో  22.6 శాతం పెరిగి, 1,60, 352 కార్లు అమ్ముడైనట్లు తెలిపింది. గత పదేళ్లలో టయోటా కిర్లోస్కర్‌కు ఇదే అత్యుత్తమ రికార్డు అని కంపెనీ చెప్పింది. 2012లో అధికంగా 1,72,241 కార్లను విక్రయించగా, ఆ తర్వాత ఈ ఏడాది నమోదైన గణాంకాలు అత్యుత్తమైనవిగా కంపెనీ పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని