Credit pass: ఏడాదిలో ఎన్నిసార్లయినా సిబిల్‌ స్కోరు తనిఖీ

క్రెడిట్‌ పాస్‌తో వినియోగదారులు ఎన్నిసార్లైనా సిబిల్‌ స్కోరు చెక్‌ చేసుకోవచ్చు.

Published : 28 Feb 2023 01:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ భాగస్వామ్యంతో భారత్‌లో మొట్టమొదటి సారిగా క్రెడిట్‌ పాస్‌ సేవలను (Credit pass) ను ఇటీవలే ప్రారంభించింది. ఈ కార్డు తీసుకున్న సభ్యులు క్రెడిట్‌ స్కోరుపై ఏమాత్రం ప్రభావం పడకుండా ఎన్నిసార్లయినా క్రెడిట్‌ స్కోరును తనిఖీ చేయవచ్చు. అలాగే ముందుగా ఆమోదించిన రుణాలు, కార్డులను పొందొచ్చు.

క్రెడిట్‌ స్కోరు ఎందుకు తెలుసుకోవాలి?

రుణ దరఖాస్తు ఆమోదం పొందడం వెనుక ఉన్న ముఖ్యమైన అంశాల్లో క్రెడిట్‌ స్కోరు ఒకటి. మూడు అంకెల ఈ క్రెడిట్‌ స్కోరు దరఖాస్తుదారుని విశ్వసనీయతను, క్రెడిట్‌ యోగ్యతను తెలియజేస్తుంది. క్రెడిట్‌ స్కోరు 700 కంటే ఎక్కువగా ఉంటే రుణ ఆమోదం త్వరగా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రెడిట్‌ స్కోరును పర్యవేక్షించి, ఎప్పటికప్పుడు పెంచుకునే ప్రయత్నం చేస్తుండాలి.

క్రెడిట్‌ పాస్‌తో ఉపయోగం ఏంటి?

బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. క్రెడిట్‌ పాస్‌ వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ చెల్లింపుతో అందుబాటులో ఉంటుంది. దీంతో వినియోగదారులు ఎన్నిసార్లయినా సిబిల్‌ స్కోరు చెక్‌ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆర్థిక నిర్ణయాలు (రుణ దరఖాస్తు, సమయానుగుణ చెల్లింపులు, క్రెడిట్‌ కార్డులపై బ్యాలెన్స్‌ బదిలీలు వంటివి) క్రెడిట్‌ స్కోరును ఏవిధంగా ప్రభావితం చేస్తాయో కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి క్రెడిట్‌ స్కోరు తగ్గుతూ ఉంటే.. ఎందుకు తగ్గుతుందో కారణం తెలుసుకుని మెరుగుపర్చుకోవడంలో సహాయపడుతుంది. క్రెడిట్‌ పాస్‌.. కస్టమర్లకు ప్రీ-అప్రూవ్డ్‌ లోన్‌ ఆఫర్లను కూడా అందిస్తుంది. ఏ విధమైన అప్లికేషన్‌ ప్రాసెస్‌ లేకుండా తక్షణమే లోన్‌ పొందే వీలు కల్పిస్తుంది. కస్టమర్లకు అందించే ప్రీ-అప్రూవ్డ్‌ లోన్‌ ఆఫర్లు వారి వారి క్రెడిట్‌ స్కోరు, ఇతర అంశాల ఆధారంగా మారుతుంటాయి.

ఫీచర్లు..

  • అపరిమిత క్రెడిట్‌ స్కోరు తనిఖీలు
  • వ్యక్తిగత క్రెడిట్‌ హెల్త్‌ రిపోర్ట్‌
  • క్రెడిట్‌ పాస్‌ ధర రూ.99 (12 నెలల కాలపరిమితితో)
  • ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడే టూల్స్‌ యాక్సెస్ చేయవచ్చు
  • ప్రీ-అప్రూవ్డ్‌ లోన్స్‌ వంటి ఇతర ఆఫర్లు

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

  • బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ వెబ్‌సైట్‌ ద్వారా దీన్ని పొందొచ్చు. ముందుగా వెబ్‌సైట్‌కు వెళ్లి, క్రెడిట్‌ పాస్‌ను ఎంచుకోవాలి.
  • సైన్‌-అప్‌పై క్లిక్‌ చేసి మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి, 'గెట్‌ ఓటీపీ'పై క్లిక్‌ చేయాలి. మీ మొబైల్‌ నంబర్‌కు వచ్చిన ఓటీపీని సబ్మిట్‌ చేయాలి.
  • ఇక్కడ ఒక ఫారం ఓపెన్‌ అవుతుంది. ఇందులో మీ పాన్‌, పుట్టిన తేదీ, కోరిన ఇతర సమాచారాన్ని ఇచ్చి వెరిఫై డీటెయిల్స్‌పై క్లిక్‌ చేయాలి.
  • అక్కడ వచ్చిన ఏదైనా పేమెంట్‌ ఆప్షన్‌ ఎంచుకుని చెల్లింపులు చేసి రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసిన తర్వాత (యూనిక్‌) క్రెడిట్‌ పాస్‌ నంబరు వస్తుంది. 
  • మీరు ఎప్పుడైనా మీ నంబరుతో ఖాతాకు లాగిన్‌ అయ్యి క్రెడిట్‌ స్కోరు చెక్‌ చేసుకోవచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని