WhatsApp: వాట్సాప్‌లో ‘ఎడిట్’ బటన్‌ వచ్చేసింది.. జుకర్‌బర్గ్‌ ప్రకటన

వాట్సాప్‌ (WhatsApp) మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మెటా (Meta) సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) ప్రకటించారు.

Published : 22 May 2023 21:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌ (WhatsApp)లో పంపే మెసేజ్‌లలో ఏవైనా తప్పులు ఉంటే.. మెసేజ్‌ అర్థం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఒకవేళ అక్షర దోషం ఉన్నా, పొరపాటుగా మెసేజ్‌ పంపినా వాటిని డిలీట్‌ చేయడం మినహా మరో దారిలేదు. ఈ సమస్యకు పరిష్కారంగానే వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. మెసేజ్‌ ‘ఎడిట్‌’ (Edit) ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు మెటా (Meta) సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో ప్రకటించారు. దీంతో మెసేజ్‌ పంపిన తర్వాత కూడా ఆ సందేశాన్ని మార్చుకునే సదుపాయాన్ని ఈ ఎడిట్‌ ఆప్షన్‌ కల్పిస్తుంది. ప్రస్తుతం కొద్దిమంది యూజర్లు మాత్రమే ఎడిట్‌ ఫీచర్‌ అందుబాటులో ఉంది. ఈ వారంలో ప్రపంచవ్యాప్తంగా యూజర్లందరికీ ఎడిట్‌ ఫీచర్‌ అందుబాటులోకి వస్తుందని వాట్సాప్‌ తెలిపింది. 

ఎడిట్‌ ఎలా పనిచేస్తుంది?

వాట్సాప్‌లో ఏదైనా మెసేజ్‌ పంపిన తర్వాత దాన్ని సెలెక్ట్‌ చేస్తే copy, forward వంటి ఆప్షన్లు కన్పిస్తాయి కదా. ఇకపై వాటితోపాటు edit ఆప్షన్‌ కూడా ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేసి పంపిన మెసేజ్‌లో తప్పులు, స్పెల్లింగ్‌లు వంటివి సరిచేసుకోవచ్చు. మెసేజ్‌ పంపిన 15 నిమిషాలలోపు ఎడిట్‌ ఎన్నిసార్లయినా ఎడిట్‌ చేసుకోవచ్చని జుకర్‌బర్గ్‌ ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని