logo

ఉద్యానవనాలపై ఉదాసీనత..

మంచిర్యాల పట్టణవాసులకు ఆహ్లాదం కోసం వివిధ వార్డుల్లో ఉద్యానవనాల నిర్మాణం చేపట్టారు. ఒక్కో ఉద్యానవనానికి రూ.40 లక్షల నుంచి రూ.90 లక్షలు కేటాయించారు.

Published : 29 Mar 2024 05:42 IST

రూ.కోట్లు వెచ్చించి నిర్లక్ష్యంగా వదిలేశారు

మంచిర్యాల హైటెక్‌సిటీలో ఉద్యానవన నిర్మాణం పూర్తయినా ఇంకా అమర్చని ఊయల

మంచిర్యాల పట్టణం, న్యూస్‌టుడే: మంచిర్యాల పట్టణవాసులకు ఆహ్లాదం కోసం వివిధ వార్డుల్లో ఉద్యానవనాల నిర్మాణం చేపట్టారు. ఒక్కో ఉద్యానవనానికి రూ.40 లక్షల నుంచి రూ.90 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో వాకింగ్‌ ట్రాక్‌, దాని పక్కన పిట్ట గోడలు నిర్మించి రంగులు దిద్దారు. వాచ్‌మెన్‌ గది, ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు చేశారు. అంత ఖర్చు చేసి అక్కడ పర్యవేక్షణ సిబ్బందిని నియమించకపోవడంతో ఓపెన్‌ జిమ్‌ పరికరాలు దొంగల పాలవుతున్నాయి. ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగి నిరుపయోగంగా మారాయి. ఎక్కడ కూడా అలంకరణ, పూల మొక్కలు నాటలేదు. అక్కడక్కడ పిల్లల ఆట వస్తువులు ఏర్పాటు చేసినా పర్యవేక్షణ లేక కొన్ని విరిగిపోయాయి. రూ.కోట్ల నిధులు ఖర్చు చేసి ఉద్యానవనాలు నిర్మిస్తే పర్యవేక్షణ లేక అవి వృథాగా మారుతున్నాయి. ఒక్కో ఉద్యానవనం వద్ద ఒక వాచ్‌మెన్‌ కుటుంబ సభ్యులతో నివాసముండేలా నియమించి, వారితోనే పరిశుభ్రత పనులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

  • రాంనగర్‌ పార్కులో రూ.80 లక్షలతో వాకింగ్‌ ట్రాక్‌, పిల్లల ఆట వస్తువులు, రీడింగ్‌ గది, ఓపెన్‌ జిమ్‌ నిర్మించారు. అక్కడ ఇంకా చిన్నచిన్న పనులు సాగుతున్నాయి.
  • హైటెక్‌సిటీ పార్కులో రూ.50 లక్షలతో వాకింగ్‌ ట్రాక్‌, పిల్లల ఆట వస్తువులు, వాచ్‌మెన్‌ గది నిర్మించారు. ఆ పార్కు పర్యవేక్షణకు మున్సిపల్‌ సిబ్బంది ఒకరిని వాచ్‌మెన్‌గా పెడితే విధులకు సరిగా రావడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.

పాతమంచిర్యాలలోని మున్సిపల్‌ లేఔట్‌ స్థలంలో రూ.90 లక్షలతో ఉద్యానవన నిర్మాణ పనులు చేపట్టారు. అక్కడ వాచ్‌మెన్‌ ఉండటానికి రెండు గదులు, వాకింగ్‌ ట్రాక్‌, ఓపెన్‌ జిమ్‌ నిర్మించారు. అందులో నాలుగేళ్ల కిందట పెట్టిన వివిధ రకాల మొక్కలు ఇప్పుడు వృక్షాలుగా పెరిగాయి. పర్యవేక్షణ లేక పిచ్చి మొక్కలు పెరిగి, ఎండిన ఆకులు అన్ని వాకింగ్‌ ట్రాక్‌పై రాలి అపరిశుభ్రంగా మారింది.


మంచిర్యాలలోని రెడ్డికాలనీలో రూ.40 లక్షలతో పార్కు, వాకింగ్‌ ట్రాక్‌, రీడింగ్‌ రూం నిర్మించారు. అందులో ఏర్పాటు చేసిన విద్యుత్తు దీపాలు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పిచ్చి మొక్కలతో అపరిశుభ్రంగా ఉంది. ఓపెన్‌ జిమ్‌ పరికరాలు ఊడిపోయినా పట్టించుకోవడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని