logo

Hyderabad: ప్లాస్టిక్‌ సీసాలతో.. పైసలు

పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమిస్తున్న వ్యర్థ ప్లాస్టిక్‌ సీసాలను కట్టడి చేసేందుకు జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది.

Updated : 14 Aug 2023 08:08 IST

త్వరలో నగరవ్యాప్తంగా రివర్స్‌ వెండింగ్‌ మిషన్లు
ఈనాడు, హైదరాబాద్‌

పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమిస్తున్న వ్యర్థ ప్లాస్టిక్‌ సీసాలను కట్టడి చేసేందుకు జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీ ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ సీసాలను స్వీకరించి.. డబ్బులిచ్చే యంత్రాలను ఏర్పాటు చేయబోతోంది. నగదు రూపంలో కాకుండా మొబైల్‌ వాలెట్లలో పైసలు జమ కానున్నాయి. అధునాతన సాంకేతికతతో పనిచేసే యంత్రాలు త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతోంది.

నిత్య0 8 వేల టన్నులు..

నగరంలో నిత్యం 8 వేల టన్నుల చెత్త ఉత్పత్తి అయితే.. అందులో సుమారు పది శాతం ప్లాస్టిక్‌ వ్యర్థాలే. మామూలు చెత్త నుంచి వీటిని వేరు చేస్తున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో రీసైక్లింగ్‌కు ఉపయోగపడట్లేదని అధికారులు తెలిపారు. ఓపెన్‌ నాలాలు, భూగర్భ వరద కాల్వలు, మురుగు నాలాలు, కల్వర్టు ప్లాస్టిక్‌ వ్యర్థాలతో పూడిపోవడం, సమీపంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా కాలంగా ఆచరణకు నోచుకోని ప్లాస్టిక్‌ వ్యర్థాల కట్టడి చర్యలకు.. బల్దియా పదును పెడుతోంది. ఒకసారి ఉపయోగించి పడేసే ప్లాస్టిక్‌ సీసాలను కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మొదట మూడు చోట్ల..

విదేశాల్లోని షాపింగ్‌ మాల్స్‌లో రివర్స్‌ వెండింగ్‌ మిషన్లుంటాయి(reverse vending machine). తాగునీరు, శీతల పానీయాలు, ఇతరత్రా ప్లాస్టిక్‌ సీసాలను వాటిలో వేస్తే.. వాటి బరువు ఆధారంగా డబ్బు వస్తుంది. ఫలితంగా ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెరుగుతూనే.. మరోవైపు ఔత్సాహికులకు ఆర్థిక ప్రయోజనం కలుగుతోంది. అదే తరహాలో.. నగరంలోని మూడు ప్రాంతాల్లో రివర్స్‌ వెండింగ్‌ మిషన్లను ఏర్పాటు చేసి.. క్రమంగా వాటిని అన్ని రద్దీ ప్రాంతాలకు విస్తరించాలని జీహెచ్‌ఎంసీ ప్రణాళిక సిద్ధం చేసింది. మొదట షేక్‌పేట దగ్గరున్న మల్కం చెరువు వద్ద, తర్వాత హైటెక్‌ సిటీలోని మరో రెండు చోట్ల ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారులు చెప్పారు. సమాంతరంగా ప్లాస్టిక్‌ కవర్ల తయారీ పరిశ్రమలపై చర్యలు, అవగాహన కార్యక్రమాలకు ప్రణాళిక జరుగుతోందని వారు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని