గెలిచి చూపిస్తున్నారు!

వీరికి వినిపించదు.. సరిగ్గా మాట్లాడలేరు కూడా. ఆర్థిక పరిస్థితీ అంతంత మాత్రమే.. అయినా కుంగిపోలేదు. అమ్మానాన్నల ప్రోత్సాహం, ఆత్మవిశ్వాసం ఊతంగా ఆటల్లో అడుగుపెట్టి తామెవరికీ తక్కువకాదని నిరూపించారు.

Published : 20 May 2022 06:26 IST

వీరికి వినిపించదు.. సరిగ్గా మాట్లాడలేరు కూడా. ఆర్థిక పరిస్థితీ అంతంత మాత్రమే.. అయినా కుంగిపోలేదు. అమ్మానాన్నల ప్రోత్సాహం, ఆత్మవిశ్వాసం ఊతంగా ఆటల్లో అడుగుపెట్టి తామెవరికీ తక్కువకాదని నిరూపించారు. బధిరుల కోసం ప్రత్యేకంగా జరిగే పోటీల్లో విజేతలై కన్నవారి నమ్మకాన్నీ గెలిపించారు. తాజాగా బ్రెజిల్‌లో జరిగిన డెఫ్లింపిక్స్‌లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన తెలుగమ్మాయి షేక్‌ జాఫ్రిన్‌, దీక్షా దాగర్‌, అనికా, శ్రేయా సింగ్లాల స్ఫూర్తిగాథలివి...


హ్యాట్రిక్‌ కాంస్యాలు...

కర్నూలుకు చెందిన షేక్‌ జాఫ్రిన్‌కు పుట్టుకతో వినికిడి లోపం ఉంది. అమ్మానాన్న రెహానా, జాకీర్‌ల తీవ్ర ప్రయత్నంతో మాటలు నేర్చుకోగలిగింది. టెన్నిస్‌పై తన ఆసక్తిని గుర్తించి, శిక్షణ ఇప్పించాలనుకున్నారు. ఆరేళ్లకే టెన్నిస్‌ రాకెట్‌ పట్టిన జాఫ్రిన్‌.. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ కన్నవాళ్ల కలల్ని నిజం చేసింది. ఉదయం నాలుగింటికే నిద్రలేచి నాలుగు గంటలు టెన్నిస్‌ ప్రాక్టీసుకీ, రెండు గంటలు వ్యాయామానికీ కేటాయిస్తుంది. గతంలో వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌, ప్రత్యేక ఒలింపిక్స్‌లో పాల్గొన్న జాఫ్రిన్‌ తాజాగా డెఫ్లింపిక్స్‌లో పృథ్వీ శేఖర్‌తో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కాంస్యం సాధించింది. 2013, 2017 డెఫ్లింపిక్స్‌లోనూ కాంస్యం సాధించింది తను. స్పాన్సర్స్‌ లేకపోయినా సొంత డబ్బుతో శిక్షణ ఇప్పిస్తున్నారు తల్లిదండ్రులు. అందుకోసం ఆస్తి, నగలను అమ్మాల్సి వచ్చినా వెనుకాడలేదు. మలేషియాలో జరగనున్న ఆసియా పసిఫిక్‌ డెఫ్‌ గేమ్స్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు సిద్ధమవుతోన్న జాఫ్రిన్‌.. ‘కాంస్యం అందుకోవడం సంతోషమే కానీ, స్వర్ణం సాధించనందుకు అసంతృప్తిగా ఉంది. ఈసారి డెఫ్లింపిక్స్‌లో స్వర్ణమే నా లక్ష్యం’ అని చెబుతోంది. 2021లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ దివ్యాంగ క్రీడాకారిణి పురస్కారాన్ని అందుకున్న జాఫ్రిన్‌.. ఇటీవలే ఎంసీఏ పూర్తి చేసింది.


ఆ ఒక్కటీ రాలేదని...

మహిళల సింగిల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌, మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగాల్లో స్వర్ణాలు సాధించింది మధురైకి చెందిన జెర్లిన్‌ అనికా. అయినా, డబుల్స్‌లో స్వర్ణం రానందుకు బాధగా ఉందంటోంది. 18 ఏళ్ల అనికా వినలేదు, మాట్లాడలేదు. తండ్రి జయ రట్చగన్‌.. స్నేహితులతో కలిసి క్లబ్‌లో బ్యాడ్మింటన్‌ ఆడేవారు. అక్కడికి కుమార్తెనూ తీసుకెళ్లేవారు. తను ఆసక్తి చూపడంతో కోచ్‌ శరవణన్‌ ఆధ్వర్యంలో ఎనిమిదేళ్లప్పుడు శిక్షణ మొదలుపెట్టారు. తండ్రి చిరు వ్యాపారి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా భవిష్యత్తు కోసం ఆటలో కొనసాగించారు. 2017 డెఫ్లింపిక్స్‌లో అయిదో స్థానంలో నిలిచిన అనికా.. ఆపైన మలేషియాలో జరిగిన ఆసియా పసిఫిక్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌- 2018, చైనాలో జరిగిన ప్రపంచ డెఫ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో అరడజను పతకాలు గెలిచింది. 2019 నుంచి హెచ్‌సీఎల్‌ ఫౌండేషన్‌ తనకు స్కాలర్‌షిప్‌ అందిస్తోంది. వినికిడి లోపం వల్ల చాలాసార్లు స్కోర్లు తెలిసేవి కాదు. అందువల్లా ఓడిపోతుండేది. ఇప్పుడు స్కోర్లు గుర్తు పెట్టుకుంటూ ఆడటం అలవాటు చేసుకుంది. మ్యాచ్‌ మధ్యలో పలక మీద కోర్ట్‌ బొమ్మ గీసి తాను చేస్తున్న పొరపాట్లను గుర్తు చేస్తుంటారు కోచ్‌. అనికా ప్రస్తుతం 12వ తరగతి పరీక్షలు రాస్తోంది.


అప్పుడు రజతం ఇప్పుడు పసిడి

హరియాణాకు చెందిన దీక్షా దాగర్‌ తండ్రి కల్నల్‌ నరీందర్‌ గోల్ఫ్‌ క్రీడాకారుడు. సోదరుడు యోగేష్‌ కూడా గోల్ఫ్‌ ఆడుతుండటంతో ఈమె కూడా దాన్నే ఎంచుకుంది. యోగేష్‌, దీక్ష.. ఇద్దరూ బధిరులే. ఆరేళ్లపుడు వినికిడి పరికరాలు పెట్టుకుని గోల్ఫ్‌ మైదానంలోకి వెళ్లేది దీక్ష. ఆపైన తండ్రి శిక్షణలో మూడేళ్లకే పోటీల్లో పాల్గొనే స్థాయికి ఎదిగింది. 16 ఏళ్లకే అండర్‌-18 విభాగంలో ప్రపంచ టాప్‌-500 గోల్ఫర్‌లలో ఒకరిగా నిలిచింది. 2017లో తొలిసారిగా గోల్ఫ్‌ను డెఫ్లింపిక్స్‌లో ప్రవేశపెట్టారు. ఆ పోటీల్లో రజతం సాధించగా.. ఈసారి స్వర్ణం గెలిచింది. అంతర్జాతీయ గోల్ఫ్‌ సమాఖ్య ప్రత్యేక ఆహ్వానంతో 2020 సమ్మర్‌ ఒలింపిక్స్‌లోనూ పాల్గొంది 22 ఏళ్ల దీక్ష. పోటీల్లో ప్రత్యర్థుల నుంచి కూడా కొత్త విషయాలెన్నో నేర్చుకుంటూ తనను మెరుగు పర్చుకుంటానంటుంది.


తొలి ప్రయత్నంలో స్వర్ణం..

పంజాబ్‌కు చెందిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి శ్రేయా సింగ్లా తొలి ప్రయత్నంలోనే టీమ్‌ విభాగంలో స్వర్ణం సాధించింది. ఈమెకు వినికిడి శక్తి లేదనే విషయాన్ని నాలుగేళ్లు వచ్చేంతవరకూ గుర్తించలేకపోయారు అమ్మానాన్న నీలం, దావీందర్‌. చికిత్స కుదరదనడంతో వినికిడి పరికరాలు అమర్చారు. అప్పటివరకు ‘అమ్మా’ అని కూడా పలకని ఆమె, ఆ తర్వాతే కాస్త మాట్లాడటం నేర్చుకుంది. తండ్రి బ్యాంకు ఉద్యోగి. తల్లి టీచర్‌. కూతురు బ్యాడ్మింటన్‌పై ఆసక్తి చూపిస్తుండటంతో ఆమె ఏడో ఏట నుంచే ప్రత్యేక కోచ్‌ను నియమించి శిక్షణ ఇప్పించారు. 14వ ఏట తైవాన్‌లో జరిగిన వరల్డ్‌ డెఫ్‌ యూత్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ డబుల్స్‌లో వెండి పతకాన్ని సాధించింది శ్రేయ. తొలి డెఫ్లింపిక్స్‌ కావడంతో చాలా కష్టపడ్డానంటుంది 17 ఏళ్ల శ్రేయ. ‘శిక్షణ సమయంలో ఎన్నో సమస్యలెదుర్కొన్నా. అమ్మానాన్నల చేయూతతో అన్నింటినీ అధిగమించగలిగా’ అని చెబుతుందీమె.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్