close
సినిమా రివ్యూ
రివ్యూ: నోటా

సినిమా పేరు: నోటా
న‌టీన‌టులు: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మెహరీన్‌, స‌త్య‌రాజ్, నాజ‌ర్, సంచ‌న న‌ట‌రాజ‌న్‌, య‌షికా ఆనంద్‌, అన‌స్తాసియా, ప్రియ‌ద‌ర్శి త‌దిత‌రులు
క‌థ‌: షాన్ క‌రుప్పుసామి
సంగీతం: శ్యామ్ సిఎస్‌
ఛాయాగ్ర‌హ‌ణం: శంతన్‌ కృష్ణ‌ణ్ ర‌విచంద్ర‌న్
కూర్పు: రేమాండ్ డెరిక్ క్రాస్టా
నిర్మాణం: కేఈ జ్ఞాన‌వేల్ రాజా
ద‌ర్శ‌కత్వం: ఆనంద్ శంక‌ర్
సంస్థ‌: స‌్టూడియో గ్రీన్
విడుద‌ల‌: 05-10-2018

విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్ప‌టిదాకా చేసింది తెలుగు సినిమాలే. కానీ, వాటి గురించి పొరుగు రాష్ట్రాల ప్రేక్ష‌కులు కూడా ఆస‌క్తిక‌రంగా మాట్లాడుకున్నారు. ఆ చిత్రాలు సాధించిన విజ‌యాలే అందుకు కార‌ణం. ఇప్పుడు పొరుగు భాష‌ల్లోనూ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి మంచి క్రేజ్ ఏర్ప‌డింది. దాంతో ఆయ‌న త‌న మార్కెట్‌ని విస్త‌రించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. అందులో భాగంగానే తెలుగు, త‌మిళ భాష‌ల్లో ‘నోటా’ చేశారు. ఆ చిత్రం క‌ర్ణాట‌క‌, కేర‌ళ రాష్ట్రాల్లో కూడా విడుద‌లైంది. రాజ‌కీయ నేప‌థ్యంతో కూడిన చిత్రాలు చేయ‌డానికి అగ్ర క‌థానాయ‌కులు సైతం ఆలోచిస్తుంటారు. కానీ, విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థ‌ల ఎంపిక‌లో తాను ప్ర‌త్యేకం అని చాటుతూ రాజ‌కీయ ప్ర‌ధాన‌మైన ‘నోటా’ చేశారు. మ‌రి యువ ముఖ్యమంత్రిగా ఆయ‌న చేసిన సందడి ఎలా ఉంది? వ‌రుస విజ‌యాల ప‌రంప‌ర ఈ చిత్రంతోనూ కొన‌సాగిస్తాడా?

క‌థేంటంటే: ముఖ్య‌మంత్రి వాసుదేవ్ (నాజ‌ర్‌) కొడుకు వ‌రుణ్ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌). ఆడుతూ పాడుతూ స‌ర‌దాగా గ‌డిపే ఓ యువ‌కుడు. గ్ర‌హాలు అనుకూలంగా లేవ‌ని ఒక స్వామీజీ చెప్ప‌డంతో పాటు.. త‌న‌పై ఉన్న ఓ కేసు కోర్టులో ఉండ‌టంతో రాత్రికి రాత్రే ప‌ద‌వి నుంచి దిగిపోయి, త‌న కొడుకు వ‌రుణ్‌ని ముఖ్య‌మంత్రిని చేస్తాడు వాసుదేవ్‌. అస‌లు రాజ‌కీయం అంటే ఏంటో తెలియ‌ని వ‌రుణ్‌కి అప్ప‌ట్నుంచి వ‌రుస‌గా స‌వాళ్లు ఎదుర‌వుతాయి. కొన్ని రోజులే ప‌ద‌విలో కొన‌సాగుతాడ‌నుకున్న వ‌రుణ్ పూర్తిస్థాయిలో బాధ్య‌త‌లు చేప‌ట్టాల్సి వ‌స్తుంది. మ‌రి త‌న‌కు ఎదురైన స‌వాళ్లని ఎలా గట్టెక్కాడు? అస‌లు స్వామీజీకి, వాసుదేవ్‌కి మ‌ధ్య సంబంధమేమిటి? వాసుదేవ్ ఆడిన రాజ‌కీయ క్రీడ‌లో ఒక పావు మాత్ర‌మే అనుకున్న వ‌రుణ్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టాక ఏం చేశాడు? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: రాజ‌కీయ నేప‌థ్యంతో కూడిన క‌థ అన‌గానే ఎత్తులు, పై ఎత్తులు వాటి చుట్టూ చోటు చేసుకునే నాట‌కీయ ప‌రిణామాలతో అత్యంత ఆస‌క్తిక‌రంగా సాగుతుంటుంది. తెర‌పై ఏం చూపించినా స‌రే అది ప్రేక్ష‌కులకు క‌నెక్ట్ అయ్యే ల‌క్ష‌ణం ఈ జోనర్‌ సినిమాలకు ఉంటుంది. స‌హ‌జంగానే ప్ర‌జ‌లు రాజ‌కీయాల గురించి మాట్లాడుకుంటుంటారు కాబ‌ట్టి... చుట్టూ జ‌రిగే ప‌రిణామాలే తెర‌పై ప్ర‌తిబింబిస్తుంటాయి. ఈ క‌థ కూడా అలాంటిదే. అయితే ఇందులో నాట‌కీయ‌త లోపించింది. వ‌ర్త‌మాన రాజ‌కీయాల్ని ప్ర‌తిబింబించేలా క‌థ‌, క‌థ‌నాలు సాగిన‌ప్ప‌టికీ... క‌థ‌లోనూ మంచి అంశాల్నే స్పృశించిన‌ప్ప‌టికీ అవి సినిమా మాధ్య‌మానికి... విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోయిజం స్థాయికి త‌గ్గ‌ట్టుగా లేక‌పోవ‌డంతో స‌న్నివేశాలు ఆశించిన స్థాయిలో పండ‌లేదు. తొలి స‌గ‌భాగం వర‌కు ఫ‌ర్వాలేద‌నిపించినా.. ద్వితీయార్ధంలో స‌న్నివేశాలు మ‌రీ చ‌ప్ప‌గా సాగుతాయి. ప్ర‌థ‌మార్ధంలో విజయ్‌ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టాక స‌వాళ్లు ఎదుర‌వడం ఎప్పుడైతే ఆరంభ‌మ‌వుతాయో అప్ప‌ట్నుంచి క‌థ ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపు తీసుకుంటుంది.

విజ‌య్ దేవ‌ర‌కొండ శైలి, స‌న్నివేశాలు పండ‌టం మొద‌ల‌వుతుంది. అయితే ఆ జోరు చివ‌రివ‌ర‌కు కొన‌సాగుంటే ఈ సినిమా ఫ‌లితం మ‌రోలా ఉండేది. అల్ల‌ర్ల‌ని అదుపు చేయ‌డం కోసం ముఖ్య‌మంత్రి తీసుకునే నిర్ణ‌యాలు... మూడు రోజులు ఎవ్వ‌రూ బ‌య‌టికి రావొద్దంటూ అల్టిమేటం జారీ చేసిన విధానం అస‌లు సిస‌లు రాజకీయ డ్రామాని త‌ల‌పిస్తుంది. కానీ, ఆ త‌ర్వాత నుంచే క‌థ గాడి తప్పినట్లు అనిపిస్తుంది. రౌడీ సీఎం వ‌స్తున్నాడ‌ని చెప్పండి అంటూ విరామం స‌మ‌యంలో విజ‌య్‌ దేవ‌ర‌కొండ చెప్పిన డైలాగ్ ద్వితీయార్ధం వైపు ఆస‌క్తిగా చూసేలా చేసింది. అయితే, వ‌ర‌ద ముప్పు నుంచి త‌ప్పించ‌డం వంటి స‌న్నివేశాల వ‌ర‌కు మాత్ర‌మే ఎఫెక్టివ్‌గా అనిపించినా... ఆ త‌ర్వాత స‌న్నివేశాల‌న్నీ సాదాసీదాగా అనిపించాయి. స‌రైన విలనిజం లేక‌పోవ‌డం ఇందుకు కార‌ణం. స్వామీజీ పాత్ర‌ని ఉప‌యోగించుకోవ‌ల్సిన అవ‌స‌రం ఉన్నా... దాన్ని వాడుకోలేదు. దాంతో ప‌తాక స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కి త‌గ్గ‌ట్టుగానే ముగుస్తాయి. రాజ‌కీయ ప్ర‌ధాన‌మైన క‌థ కాబ‌ట్టి క‌మ‌ర్షియ‌ల్ అంశాల జోలికి వెళ్ల‌లేదు. తెలుగు రాజ‌కీయ నేప‌థ్యం కంటే కూడా త‌మిళ‌నాట ప‌రిస్థితులే ఎక్కువ‌గా తెర‌పై క‌నిపిస్తాయి.

ఎవ‌రెలా చేశారంటే: విజ‌య్ దేవ‌ర‌కొండ తొలి అడుగుల్లోనే రాజకీయ ప్రధాన‌మైన క‌థ‌ని చేయ‌డం సాహ‌స‌మే. అయితే, ఈ క‌థ‌ని ఎంతగా న‌మ్మాడో ఆయ‌న పాత్ర‌లో ఒదిగిపోయిన విధాన‌మే చెబుతుంది. తండ్రి చాటు బిడ్డ ముఖ్య‌మంత్రి అయితే ఎలా ఉంటుందో అంతే వాస్త‌విక‌త‌తో తెర‌పై క‌నిపించాడు. ప్ర‌థ‌మార్ధం వ‌ర‌కు ఆయ‌న మార్క్, న‌డ‌వ‌డిక సినిమాకి బాగా క‌లిసొచ్చాయి. మెహరీన్‌ పాత్ర గురించి, ఆమె న‌ట‌న గురించి చెప్పుకోవ‌ల్సిందేమీ లేదు. అతిథి పాత్రని త‌ల‌పిస్తుందంతే. స‌త్య‌రాజ్ పాత్ర సినిమాకి కీల‌కం. ఆయ‌న యువ ముఖ్య‌మంత్రితో పాటు ఉంటూ క‌థ‌ని న‌డిపిస్తుంటాడు. ఒక మామూలు జ‌ర్న‌లిస్టు ముఖ్య‌మంత్రికి అంత కీల‌కం కావ‌డం ఎందుకో అప్పుడ‌ప్పుడు సందేహాలు రేకెత్తినా.. ద్వితీయార్ధంలో వ‌చ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ స‌న్నివేశాలతో వాటికి స‌మాధానం దొరుకుతుంది.

నాజ‌ర్ అభిన‌యం ఆక‌ట్టుకుంటుంది. అయితే ద్వితీయార్ధంలో ఆయ‌న మేక‌ప్ మ‌రీ చూడ‌లేని విధంగా ఉంటుంది. ప్ర‌ధానంగా ఈ మూడు పాత్ర‌ల చుట్టూనే ఈ క‌థ సాగుతుంది. ప్రతిప‌క్ష పార్టీ నాయ‌కురాలు క‌ళావ‌తిగా సంచ‌న న‌ట‌రాజ‌న్ చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. నాజ‌ర్ అనుచ‌రుడిగా ఎమ్‌.ఎస్‌.భాస్క‌ర్ పాత్ర‌కి కూడా ప్రాధాన్యం ఉంది.

సాంకేతికంగా... సినిమా ఉన్న‌తంగా ఉంది. శంత‌న్‌ కృష్ణ‌న్ కెమెరా ప‌నిత‌నం, శ్యామ్ సి.ఎస్ సంగీతం బాగుంది. ర‌చ‌న విష‌యంలోనే కాస్త తడబడినట్లు క‌నిపిస్తుంది. ద‌ర్శ‌కుడిగా ఆనంద్ శంక‌ర్ ప‌నితీరు తొలి స‌గ‌భాగం వ‌ర‌కే ఆకట్టు‌కుంటుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టు ఉన్నాయి.

బ‌లాలు
+ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న 
+ ప్ర‌థ‌మార్ధం

బ‌ల‌హీన‌త‌లు
- క‌థ‌నం 
- డ్రామా పండ‌క‌పోవ‌డం 
చివ‌రిగా: రౌడీ సీఎం క‌థ... ‘నోటా’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.