భళా.. కేకు పెళ్లికూతురా..!
పెళ్లంటే మూడు కేకులూ ఆరు ఫొటోషూట్లూ అన్నట్లుగా సాగుతోంది ఈతరం పెళ్లి సందడి. నిజం చెప్పాలంటే వధూవరుల అలంకరణని తలదన్నేలా కేకుల్ని సైతం అత్యద్భుతంగా తయారుచేయించి, అతిథుల కళ్లను కట్టిపడేయడమే కాదు, వాటికీ ఫొటోషూట్లు చేయిస్తున్నారు. అంతేనా... వేడుకని బట్టి ఆ కేకు థీమ్‌నీ మార్చేస్తున్నారు. అందులోభాగంగా వస్తున్నవే ఈ పెళ్లికూతుళ్ల కేకులు!
నిశ్చితార్థం మొదలుకుని రిసెప్షన్ వరకూ ఆ వేడుకకి తగ్గట్లుగా కేకుని ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోవడం ఈమధ్య బాగా పెరిగింది. అందులో భాగంగానే వేలు, లక్షల రూపాయలు చెల్లించి వధూవరుల దుస్తులకి మ్యాచయ్యేలానూ కేకుల్ని తయారు చేయిస్తున్నారు. పెళ్లిజంటని పోలిన బొమ్మల్నీ ఫొటోల్నీ కూడా కేకులమీద అలంకరిస్తున్నారు. అవన్నీ ఇప్పుడు బోర్ కొట్టేసినట్లుంది. ‘కేకుని చూస్తే నీలా ఉందీ...’ అంటూ పెళ్లికొడుకు ఈల వేసి మరీ పాటందుకునేలా పెళ్లికూతురి కేకులు అందంగా కనువిందు చేస్తున్నాయిప్పుడు. అవునండీ... పెళ్లి ముస్తాబులో ఉన్న ఫొటో ఇస్తే చాలు... అందులో ఉన్నట్లే పెళ్లికూతురు కేకుల్ని రూపొందిస్తున్నారు కళాకారులు. దాంతో ఎంతటి వాళ్లయినా ఆ కేకు సౌందర్యానికి మంత్రముగ్ధులై తీరాల్సిందే. నిజానికి కుందనపుబొమ్మలా తయారైన పెళ్లికూతురిని వచ్చినవాళ్లంతా కళ్లప్పగించి చూస్తూనే ఉంటారు. అందరూ అదేపనిగా చూస్తే దిష్టి తగులుతుంది అనుకున్నారో ఏమో తెలియదుగానీ వాళ్ల దృష్టి మరల్చేందుకన్నట్లు అమ్మాయిలాంటి కేకుల్ని చేయించడం ఈమధ్య ఓ ట్రెండ్‌గా మారింది. దాంతో తల్లిదండ్రులకే కాదు, బంగారుబొమ్మలా మెరుస్తోన్న ఆ అమ్మాయి కేకుని కోసి తినడానికి ఎవరికీ మనసు రావడం లేదట.
పెళ్లికూతురి పోలికలనే కాదు, ఆమె పెట్టుకున్న నగలూ దుస్తులూ... అన్నీ నిజమైనవే అన్నంత సహజంగా ఉంటున్నాయి మరి. పంచదార, మార్జిపాన్లకి జెలాటిన్నీ రంగుల్నీ జోడించి ముత్యాలూ రత్నాలూ కుందన్లూ... వంటి వాటిని ముందుగా చేసుకుని, నగలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఫ్యాబ్రిక్ సైతం తెలిసేంత అందంగా డ్రెస్సుల్నీ డిజైన్ చేస్తున్నారు. ఈ రకమైన పెళ్లి కేకుల్ని మనదగ్గరే కాదు, రష్యా, బ్రిటన్, అమెరికా, శ్రీలంక... ఇలా దేశవిదేశాలకు చెందిన కేకు కళాకారులూ చేయడం విశేషం. లూథియానాకి చెందిన బేక్టౌన్ క్రష్ అనే సంస్థ ఈమధ్య చేసిన ఓ అందమైన పెళ్లికూతురి కేకు ఇన్‌స్టాలో వైరల్ అయింది. దాంతో అనేకమంది ఈ రకమైన కేకుల మీద ఆసక్తి చూపిస్తున్నారట. వధువే వచ్చి కూర్చుందా లేక బొమ్మను చేసి అక్కడ కూర్చోబెట్టారా... అనేట్లుగా పోటీబడి మరీ చేస్తున్నారట బేకింగ్ ఆర్టిస్టులు. ఏది ఏమైనా ఇప్పుడు కేకు కేవలం ఏదో ఓ ముక్క కోసి ఆ రుచిని ఆస్వాదిస్తూ తినడం కోసం కాదు, ఫొటోల కోసమే అన్నంత రియలిస్టిక్‌గా ముస్తాబవుతోంది. ఈ కేకు పెళ్లికూతుళ్లను చూస్తుంటే మీకూ అలానే అనిపిస్తోంది కదూ.
Advertisement
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్