ఆన్లైన్లో ఆటలు నేర్పిస్తున్నారు!
కరోనా కారణంగా చదువుల నుంచి ఉద్యోగాల వరకూ అన్నీ ఆన్లైన్లోనే జరిగిపోతున్న రోజులివి. ఇప్పుడు వాటి పక్కన క్రీడా శిక్షణ కూడా చేరింది. అది కూడా ఏవో మామూలు శిక్షణా సంస్థలు ట్రైనింగ్ ఇస్తున్నాయనుకుంటే పొరపాటు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రముఖ క్రీడాకారులు ఆన్లైన్ శిక్షణ బాట పట్టడంతో ఆటల్లో మెరికల్లా మారాలనుకునే ఔత్సాహికులు వాటిలో సభ్యత్వం తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. క్రీడాశిక్షణలో వస్తున్న ఈ నయా ట్రెండ్ గురించి తెలుసుకుందామా!
క్రీడల్లో శిక్షణ తీసుకోవాలని మనసులో ఉన్నా మంచి సంస్థలో చేరాలనుకుంటే బోలెడు ఫీజు కట్టాలి. పైగా ఆ సంస్థ ఎక్కడో ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజూ వెళ్లిరావడం అంటే మాటలు కాదు. అలాగని కరోనా పూర్తిగా తగ్గాక శిక్షణ తీసుకోవచ్చులే అనుకుంటే... అది ఎప్పటికో తెలియదు. ఇవన్నీ గుర్తించిన కొందరు క్రీడాకారులు ఆన్లైన్లో శిక్షణ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. వారిలో వీరేంద్ర సెహ్వాగ్, అభినవ్‌బింద్రా వంటివాళ్లూ ఉండటం విశేషం. ఆన్లైన్లో చదువుకోవడం, సంగీతం, డ్యాన్స్ లాంటివి నేర్పించడం, ఆఫీసు మీటింగుల్లాంటి వాటికి హాజరవడం వరకూ ఫరవాలేదు. కానీ క్రీడల్లో శిక్షణ ఇవ్వడం అంటే మాటలా... కోచ్ పక్కనే ఉండి శిక్షకుల కదలికల్ని గమనించాల్సి ఉంటుంది. వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది... ఇవన్నీ ఎలా సాధ్యమనే సందేహాలు కలుగుతాయి. నిజమే కానీ... వాటన్నింటికీ సరైన పరిష్కారాలు సిద్ధం చేసుకునే ఆన్లైన్ శిక్షణ ఇచ్చేస్తున్నారిప్పుడు.
ఉదాహరణకు సెహ్వాగ్ ప్రారంభించిన ‘క్రికురు’ సంస్థనే తీసుకుంటే... అంతర్జాతీయ క్రికెటర్ల అనుభవాలూ, మెలకువలకు సంబంధించిన వీడియోలను అందిస్తూనే ఆట విషయంలో తీసుకునే జాగ్రత్తలనూ తెలియజేస్తుంది. ‘ఎప్పటినుంచో క్రికెట్ శిక్షణా సంస్థను పెట్టాలనుకున్నా కానీ... కరోనా వచ్చాక క్రికెట్కోచ్ సంజయ్బంగర్తో కలిసి కిందటేడాది క్రికురుని అందుబాటులోకి తెచ్చాం. కరోనా కాబట్టి... అన్నిరకాల జాగ్రత్తలూ తీసుకుని ఆన్లైన్లోనే మా సేవల్ని అందిస్తున్నాం. అంతర్జాతీయ స్థాయిలో బ్యాటింగ్, బౌలింగ్‌లో గుర్తింపుపొందిన ముప్పై మందికిపైగా క్రీడాకారులు తమ అనుభవాలతోపాటూ మెలకువల్నీ మేళవించి రూపొందించిన దాదాపు 2400 వీడియోలను అందిస్తాం. అలా తమ అనుభవాలు చెప్పేవారిలో ఏబి డివిలియర్స్, బ్రెట్‌లీ, బ్రయాన్లారా, క్రిస్‌గేల్, బ్రావో... వంటివాళ్లు ఉంటారు. దీంతోపాటు మా దగ్గర శిక్షణ తీసుకునే సభ్యులు తమ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోలను మాకు పంపుతారు. వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో పర్యవేక్షించి వాళ్లు చేసిన పొరపాట్లను గుర్తించి ఎలా ఆడాలో చెబుతాం...’ అని వివరిస్తాడు సెహ్వాగ్. శిక్షకులు బ్యాట్‌ని పట్టుకునే విధానం, స్వింగ్స్, బ్యాక్‌లిఫ్ట్, కవర్‌డ్రైవ్... వంటివాటినీ నేర్పించే క్రికురు వెబ్సైట్, ఆప్ ద్వారా కూడా శిక్షణ ఇస్తుంది.
ఆటలొక్కటే కాదు...
ప్రముఖ పుట్‌బాల్ క్రీడాకారుడు బైచుంగ్ భూటియా ప్రారంభించిన ‘బైచుంగ్ భూటియా ఫుట్‌బాల్ స్కూల్స్’ ‘ఆన్జోగో’ పేరుతో ఆన్లైన్లో ఫుట్‌బాల్ నేర్పిస్తుంటే షూటర్ అభినవ్ బింద్రా తన ఫౌండేషన్ ద్వారా క్రీడాకారులకు రకరకాల ఆటల్లో మెలకువలు నేర్పించడంతోపాటు వాళ్లు తమకు ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించడంలోనూ శిక్షణ ఇస్తున్నాడు. ఇక, క్రీడాకారులు ఆటలు ఒక్కటీ నేర్చుకుంటే సరిపోదు. వాళ్లు శారీరకంగా దృఢంగానూ ఉండాలి కాబట్టి ఆ వర్కవుట్లనూ నేర్పిస్తాయీ సంస్థలు. అదేవిధంగా ఇంటినుంచే పాల్గొనే విధంగా లైవ్పోటీలు కూడా నిర్వహిస్తారు. వాటిల్లో పాల్లొనే విధానాన్ని బట్టి నిపుణులు శిక్షణ తీసుకునేవారి ఆటతీరును అంచనా వేస్తారు కాబట్టి మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు వాళ్లు తిరుగులేకుండా ఆడగలుగుతారని అంటారు నిపుణులు. ఇన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటూ శిక్షణను బట్టి ఫీజును నిర్ణయిస్తున్నాయీ సంస్థలు. ఏ విధంగా చూసినా ఈ ఆన్లైన్ శిక్షణ మేలేచేస్తుంది గనుక హాబీగా నేర్చుకోవాలనుకున్నా... పూర్తిస్థాయిలో క్రీడాకారులుగా రాణించాలనుకున్నా ఈ వెబ్సైట్లలోకి లాగిన్ అయితే సరి.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్