మూన్‌ లైటింగ్‌, క్వైట్‌ క్విటింగ్‌.. కార్పొరేట్‌ పరిభాషలో ఈ పదాలకు అర్థాలు తెలుసా?

మూన్‌ లైటింగ్‌.. ఈ మధ్య ఐటీ వర్గాల్లో ఈ పదం తెగ వినపడుతోంది. కొన్ని కంపెనీలు మూన్‌ లైటింగ్‌ను ప్రోత్సహిస్తుంటే.. మరికొన్ని కంపెనీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Updated : 13 Sep 2022 19:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మూన్‌ లైటింగ్‌.. ఈ మధ్య ఐటీ వర్గాల్లో ఈ పదం తెగ వినపడుతోంది. కొన్ని కంపెనీలు మూన్‌ లైటింగ్‌ను ప్రోత్సహిస్తుంటే.. మరికొన్ని కంపెనీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇంతకీ మూన్‌లైటింగ్‌ అంటే మరేమీ లేదు. ప్రస్తుత యజమానికి తెలీకుండా మరో ఉద్యోగం చేయడం. కొవిడ్‌ నేపథ్యంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు కంపెనీలు అవకాశం కల్పించాయి. దీంతో ఆఫీసు అయ్యాక మిగిలిన సమయాన్ని వృథా చేయకుండా వేరే ఉద్యోగం చేస్తూ అదనపు ఆదాయం సంపాదిస్తున్నారు కొందరు. ఇలా చేయడాన్ని కొన్ని కంపెనీలు తప్పుబడుతున్నాయి. ఆ మధ్య ‘క్వైట్‌ క్విట్టింగ్‌’ అనే మరో పదం కూడా ఇలానే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇలా కార్పొరేట్‌ రంగంలో సాధారణంగా వాడే కొన్ని పదాలకు ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం..

  • మూన్‌లైటింగ్ (moonlighting)‌: వాస్తవంగా దీనర్థం చందమామ కాంతి. కానీ, కార్పొరేట్‌ పరిభాషలో దీనర్థం రెండో ఉద్యోగం చేయడం. రాత్రి వేళ కంపెనీకి తెలీకుండా రెండో ఉద్యోగం చేయడం అనే అర్థంలో దీన్ని ప్రస్తుతం వాడుతున్నారు.
  • క్వైట్‌ క్విటింగ్‌ (Quiet Quitting): క్వైట్‌ క్విటింగ్‌ అంటే నెమ్మదిగా జారుకోవడం అని అర్థం. కానీ కార్పొరేట్‌ పరిభాషలో దీనికి వేరే అర్థం ఉంది. అదే పని భారాన్ని తగ్గించుకోవడం. కేవలం తమ పాత్ర ఎంత వరకో అక్కడికి మాత్రమే పరిమితం కావడం. ముఖ్యంగా కొవిడ్‌ తర్వాత వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడంలో భాగంగా ఉద్యోగులు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.
  • ది గ్రేట్‌ రిజిగ్నేషన్‌ (The Great Resignation): ఆకర్షణీయ జీతాలు, ప్యాకేజీలు ఇస్తామని ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలు ప్రకటిస్తున్నా.. ఉద్యోగులు కొలువులు ధైర్యంగా వదిలేసి కొత్త మార్గాలను అన్వేషించడాన్ని ‘ది గ్రేట్‌ రిజిగ్నేషన్‌’గా పిలుస్తారు.  ఆ మధ్య రాజీనామాల పర్వం కొనసాగినప్పుడు ఈ పదం ప్రాచుర్యంలోకి వచ్చింది.
  • లో హ్యాంగింగ్‌ ఫ్రూట్‌ (Low-hanging fruit): ఏదైనా లక్ష్యాన్ని, పనిని సులువుగా చేయొచ్చన్న ఉద్దేశంలో ఈ పదాన్ని వాడుతారు. ఎవరైనా సులువుగా అయిపోయే పనులను ఎంచుకున్నప్పుడు.. బాస్‌లు సాధారణంగా ఈ పదాన్ని వాడుతుంటారు.
  • గివ్‌ 110% (Give 110%): ఎవరైనా నూటికి నూరు శాతం చెయ్‌ అని చెబుతారు. కానీ కార్పొరేట్‌ పరిభాషలో ఒక పనిమీద అదనంగా దృష్టి కేంద్రీకరించాలని చెప్పాలనుకున్న సందర్భంలో ఈ పదాన్ని వాడుతుంటారు. 
  • కోర్ కాంపిటెన్సీ (Core competency): వ్యక్తి లేదా కంపెనీ ప్రధాన సామర్థ్యం ఇదీ అని చెప్పే ఉద్దేశంలో కోర్‌ కాంపిటెన్సీ అనే పదాన్ని వాడుతారు. ‘వాహనం ప్రత్యేకతలను వినియోగదారులకు వివరించడం కోర్‌ కాంపిటెన్సీ’ అని ఎవరైనా చెబితే.. అది అతడి ప్రధాన సామర్థ్యం అవుతుంది.
  • డ్రిల్‌ డౌన్‌ (Drill down): ఏదైనా విషయంలో మరింత లోతుల్లోకి వెళ్లాలనుకున్న సందర్భంలో ఈ పదాన్ని వాడుతారు. కంపెనీని విజయపథంలోకి తీసుకెళ్లడానికి లోతైన విశ్లేషణ అవసరం అన్న సందర్భంలో ఈ పదాన్ని వినియోగిస్తారు.
  • నీ డీప్‌ (Knee deep): మోకాలి లోతు నీటిలో ఉన్నామని దీనర్థం. కానీ కార్పొరేట్‌ పరిభాషలో ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకున్నామనే అర్థంలో దీన్ని వాడుతారు.
  • బైట్‌ ద బుల్లెట్‌ (bite the bullet): కష్టమైన టాస్క్‌ను తీసుకోవాలని ఉద్యోగులకు సూచించేటప్పుడు ఈ పదాన్ని వాడుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు