Home Treatment: డొమిసిలియరీ హాస్పిటలైజేషన్‌ ప్రయోజనాలు తెలుసా?

డొమిసిలియరీ హాస్పిటలైజేషన్‌ సౌకర్యంతో ఇంటి నుంచే వైద్య చికిత్సలను పొందవచ్చు. దీని ప్రయోజనాలు, మినహాయింపులు గురించి తెలుసుకోండి.

Published : 05 Mar 2024 15:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆరోగ్య బీమా పాలసీ గురించి అందరికీ తెలిసిందే. ఆసుపత్రిలో వైద్య ఖర్చులను చూసుకోవడమే కాకుండా, డే-కేర్‌ ట్రీట్‌మెంట్స్, ఆయుష్‌ ప్రయోజనాలు, మానసిక ఆరోగ్య సంరక్షణను కూడా ఆరోగ్య బీమా కవర్‌ చేస్తుంది. ఆరోగ్య బీమా పాలసీ అందించే మరో ముఖ్యమైన ప్రయోజనం ‘డొమిసిలియరీ హాస్పిటలైజేషన్‌’. వైద్య పరిస్థితి కారణంగా రోగి ఆసుపత్రిలో చేరలేనప్పుడు లేదా పాలసీదారుడు ఇంట్లో చికిత్స పొందాలని వైద్యుడు సూచించినప్పుడు దీన్ని ‘డొమిసిలియరీ హాస్పిటలైజేషన్‌’ అంటారు. ఇది ఆరోగ్య బీమా అందించే ముఖ్యమైన ప్రయోజనంతో కూడిన కవరేజ్‌. ఈ కవరేజ్‌లో రోగికి వారి ఇంటిలోనే వైద్య చికిత్సను సూచిస్తుంది. ఆసుపత్రి పడకలు లేదా నిర్దిష్ట వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడం వల్ల బీమా చేయించుకున్న వ్యక్తి ఆసుపత్రిలో చేరలేని పరిస్థితుల్లో ఈ రకమైన కవరేజ్‌ ఉపయోగపడుతుంది.

ఎవరికి ప్రయోజనం?

దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా మంచాన పడిన రోగికి నిరంతరం వైద్య సంరక్షణ అవసరం. కానీ, ఆ రోగి ఆసుపత్రిలో అడ్మిట్‌ కావాలంటే ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుంది. దీనివల్ల ఆసుపత్రి గది, బెడ్‌ అద్దె ఖర్చులు బాగా పెరిగిపోతాయి. బీమా ఉన్నా సరే అది కూడా సరిపోకపోవచ్చు. లేదా రోగి ఆర్థిక పరిస్థితి ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండడానికి సహకరించకపోవచ్చు. ఇలాంటి పరిస్థితిలో డొమిసిలియరీ హాస్పిటలైజేషన్‌ కవర్‌తో రోగి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే అవసరమైన వైద్య చికిత్సను పొందవచ్చు. దీర్ఘకాలిక వైద్య సంరక్షణ అవసరంతో పాటు ఆసుపత్రిలో చేరడం సౌకర్యంగా లేని రోగులకు ఈ రకమైన కవర్‌ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. డొమిసిలియరీ హాస్పిటలైజేషన్‌ కవర్‌లో నర్సింగ్‌ కేర్‌, మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌, ఇంటిలో రోగికి చికిత్స కోసం అవసరమైన మందులు వంటి వైద్య ఖర్చులు కవర్‌ అవుతాయి. ఇంటెన్సివ్‌ కేర్‌ లేకుండా వైద్య సహాయం అవసరమైన రోగులకు ఇది మెరుగైన ఆప్షన్‌ అని చెప్పవచ్చు.

ఇది ఎలా పనిచేస్తుంది?

వైద్యుడిని సంప్రదించిన తర్వాత రోగి వైద్య చికిత్సకు అవసరమయ్యే విధానాలను/పద్ధతులను డాక్టర్‌ అంచనా వేస్తారు. అతడి పరిస్థితికి సంబంధించిన స్వభావం, తీవ్రత ఆధారంగా రోగి డొమిసిలియరీ హాస్పిటలైజేషన్‌కు అర్హుడో, కాదో డాక్టర్‌ నిర్ణయిస్తారు. ఇంటి వద్దే చికిత్స అవసరమని భావిస్తే.. రోగికి చికిత్సలో భాగంగా ఆక్సిజన్‌ సిలిండర్లు, నెబ్యులైజర్లు మొదలైన అవసరమైన వైద్య పరికరాలు ఇంటి వద్ద అమర్చుతారు. అవసరమైతే ఒక నర్సు లేదా సంరక్షకుడిని ఆసుపత్రి నియమిస్తుంది. వారు రోగి ఇంటి వద్ద ఉండి అవసరమైన వైద్య సంరక్షణను అందిస్తూ, పేషెంట్‌కు సంబంధించిన పురోగతిని పర్యవేక్షిస్తూ, దాన్ని వైద్యుడికి నివేదిస్తారు. చికిత్స పూర్తయితే తదుపరి కార్యచరణకు ఫాలో-అప్‌ కోసం వైద్యుడిని సంప్రదిస్తారు.

ప్రయోజనాలు

డొమిసిలియరీ హాస్పిటలైజేషన్‌తో అనేక ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. ముఖ్యంగా ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఆసుపత్రి గది అద్దెలు ఇందులో ఉండవు. రోగి వారి సొంతింటిలో సౌకర్యంగా వైద్య సంరక్షణను పొందొచ్చు. తరచూ కదులుతూ ఉంటే ఇబ్బంది పడేవారికి లేదా దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారికి ప్రత్యేకంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటిలో ఉండే సొంత కుటుంబ సభ్యుల తోడ్పాటుతో వైద్య సేవలు పొందడం వల్ల రోగి వేగంగా కొలుకునే అవకాశముంది. ఆసుపత్రిలో సహజంగా ఉండే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఇంటి వాతావరణం రోగిని కాపాడుతుంది. క్యాష్‌లెస్‌ హాస్పిటలైజేషన్‌, రీయింబర్స్‌మెంట్‌ రెండింటికీ సంబంధించిన క్లెయిం ప్రక్రియ ఈ బీమాలో ఉంటుంది.

మినహాయింపులు

డొమిసిలియరీ హాస్పిటలైజేషన్‌.. బీమా పాలసీని పొందే ముందు ఉన్న అనారోగ్యాలను కవర్‌ చేయకపోవచ్చు. వెయిటింగ్‌ పీరియడ్‌ వర్తిస్తుంది. ప్రయోగాత్మక లేదా నిరూపితం కాని వైద్య చికిత్సలు డొమిసిలియరీ హాస్పిటలైజేషన్‌ కవరేజ్‌ కింద మినహాయింపులకు లోబడి ఉండవచ్చు. కాస్మెటిక్‌ సర్జరీ, వంధ్యత్వ చికిత్సలు, బరువు తగ్గించే శస్త్ర చికిత్స వంటి అనేక వైద్య విధానాలు, చికిత్సలు సాధారణంగా కవర్‌ అవ్వవు. దేశం వెలుపల పొందిన ఏదైనా వైద్య చికిత్సకు రీయింబర్స్‌మెంట్‌ ఉండదు. ఆమోదం లేని ప్రిస్క్రిప్షన్‌ ఔషధాలు ఈ కవరేజ్‌ నుంచి మినహాయింపు ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా చేసుకున్న గాయాలను కవర్‌ చేయదు. మాదకద్రవ్య దుర్వినియోగం లేదా వ్యసనానికి సంబంధించిన చికిత్స కోసం కవరేజీని అందించకపోవచ్చు. మానసిక అనారోగ్యానికి సంబంధించిన చికిత్సకు కూడా కవరేజ్‌ ఉండదు. బ్రాంకైటిస్‌, మూర్చ రోగం, అస్తమా, దగ్గు, జలుబు లేదా ఇన్‌ఫ్లూయెంజా, డయాబెటీస్‌, దీర్ఘకాలిక నెఫ్రిటిస్‌, విరేచనాలు, గ్యాస్ట్రో-ఎంటెరిటీస్‌, కీళ్లనొప్పులు, రుమాటిజం, రక్తపోటు, టాన్సిలిటిస్‌ మొదలైన రోగాలకు డొమిసిలియరీ హాస్పిటలైజేషన్‌ కవరేజ్‌ ఉండదు. ఆయుర్వేదం, హోమియోపతి చికిత్సలకు కూడా కవరేజ్‌ ఉండదు.

గమనించాల్సినవి

చికిత్సకు సిద్ధమయిన ప్రతి రోగికీ డొమిసిలియరీ హాస్పిటలైజేషన్‌ సాధ్యం కాదు. రోగి ఆసుపత్రిలో బెడ్‌ను పొందలేకపోయాడని లేదా అలాంటి పరిస్థితులు లేవని రోగి నిరూపించాలి. అర్హత ఉన్న రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌ ద్వారా రాతపూర్వకంగా సిఫార్సు తప్పనిసరి. కరోనా కవచ్‌ మెడికల్‌ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన చికిత్సను ఇది కవర్‌ చేస్తుంది. డొమిసిలియరీ చికిత్సను పొందేందుకు, బీమా చేసిన వ్యక్తి కనీసం మూడు రోజుల పాటు ఇంటిని ఆధారంగా చేసుకుని చికిత్స పొందవలసి ఉంటుంది. ఈ బీమా సౌకర్యం అన్ని బీమా సంస్థలు సమగ్ర కవరేజీలో భాగంగా ఇవ్వకపోవచ్చు. అలాంటప్పుడు అదనపు ప్రీమియంతో రైడర్‌గా తీసుకోవాలి. ఖర్చులను క్లెయిం చేస్తున్నప్పుడు, అవసరమైన అన్ని చికిత్స బిల్లులు, డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్లను భద్రపరచుకోవాలి. మీ బీమా సంస్థ.. రోగికి సంబంధించిన డాక్యుమెంట్స్‌ అడిగినప్పుడు వెంటనే అందించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని