Amazon Prime Lite: ₹999కే అమెజాన్‌ ప్రైమ్‌ లైట్‌.. ప్రయోజనాలు ఇవే!

Amazon Prime Lite details: అమెజాన్‌ ఎట్టకేలకు ప్రైమ్‌ లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకొచ్చింది. దీని ధరను రూ.999గా నిర్ణయించింది. సింగిల్‌ ప్లాన్‌ మాత్రమే అందుబాటులోకి తెచ్చింది.

Published : 15 Jun 2023 13:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime) సబ్‌స్క్రిప్షన్‌ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు రూ.999కే లభించే ఈ సబ్‌స్క్రిప్షన్... ఇప్పుడు రూ.1499కు అందుబాటులో ఉంది. పెరిగిన ధర కారణంగా వినియోగదారులు తీసుకోవడానికి /రెన్యువల్‌ చేసుకోవడానికి వెనకంజ వేస్తున్నారు. దీంతో యూజర్‌ బేస్‌ను పెంచుకునేందుకు అమెజాన్‌ కొత్తగా లైట్‌ ప్లాన్‌ను (Amazon Prime lite) తీసుకొచ్చింది. దీని ధరను రూ.999గా నిర్ణయించింది. అమెజాన్‌ ప్రైమ్‌ రెగ్యులర్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌లో ఉన్న ప్రయోజనాలనే దాదాపుగా ఇందులోనూ అందిస్తున్నారు.

అమెజాన్‌ ప్రైమ్‌ లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌ 12 నెలల కాలవ్యవధితో వస్తోంది. దీనికి ఒకేసారి రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో నెలవారీ, త్రైమాసిక ప్లాన్లు లాంటివి లేవు. లైట్‌ ప్లాన్‌ను తొలుత కొందరు యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చిన అమెజాన్‌.. ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తెచ్చింది.

లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న వారు.. అమెజాన్‌లో రెండ్రోజుల డెలివరీ, స్టాండర్డ్‌ డెలివరీలను ఉచితంగా పొందొచ్చు. అమెజాన్‌ - ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌, బిల్‌ పేమెంట్స్‌ ఇతరత్రాలపై రెండు శాతం క్యాష్‌బ్యాక్‌ వంటివి లభిస్తాయి. ఒకేసారి రెండు డివైజుల్లో హెచ్‌డీ క్వాలిటీలో ప్రైమ్‌ వీడియోను యాక్సెస్‌ చేయొచ్చు. అమెజాన్‌లో లైటనింగ్‌ డీల్స్‌కు ఎర్లీ యాక్సెస్‌తో పాటు ‘డీల్స్‌ ఆఫ్‌ ద డే’లో లైట్‌ యూజర్లు పాల్గొనొచ్చు.

ప్రైమ్‌ vs ప్రైమ్‌ లైట్‌ (Prime vs Prime Lite)

అమెజాన్‌ ప్రైమ్‌ లైట్‌ ఇంచుమించు ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌లో అందించే ప్రయోజనాలనే ఇస్తున్నప్పటికీ.. కొన్నింటిని యూజర్లు మిస్‌ అవుతారు. రెగ్యులర్‌ ప్లాన్‌లో ఉన్న వన్‌ డే డెలివరీ, సేమ్‌ డే డెలివరీ సదుపాయం లైట్‌లో ఉండదు. అలాగే, ప్రైమ్‌ రీడింగ్‌, ప్రైమ్‌ మ్యూజిక్‌ యాక్సెస్‌ చేయడం కుదరదు. రెగ్యులర్‌ ప్రైమ్‌ మెంబర్లు... ప్రైమ్‌ వీడియోను 4K క్వాలిటీలో ఒకేసారి ఆరు డివైజుల్లో వీక్షించగలరు. లైట్‌లో హెచ్‌డీ క్వాలిటీలో రెండు డివైజుల్లో మాత్రమే వీక్షించొచ్చు. అంతేకాదు ప్రైమ్‌ లైట్‌లో యాడ్స్‌ కూడా ఉంటాయి. నో-కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా ఉండదు. ఇవేవీ పెద్ద విషయం కాదనుకుంటే ప్రైమ్‌ లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఎంచుకుని తక్కువ ధరకే ప్రైమ్‌ ‘సేవలు’ పొందొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని