Reliance Campa: సాఫ్ట్ డ్రింక్స్ విషయంలోనూ ‘జియో’ వ్యూహం..!
Campa Drinks: కాంపాతో సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన రిలయన్స్.. తనదైన మార్కెటింగ్ వ్యూహంతో ముందుకెళుతోంది. ధరలు తగ్గించడంతో పాటు తన రిటైల్ నెట్‌వర్క్‌ను వాడుకోనుంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్లో ఏళ్లుగా విదేశీ కంపెనీలైన కోకాకోలా, పెప్సీదే హవా. సరళీకరణ విధానాలతో దేశంలోకి ప్రవేశించిన ఆ రెండు కంపెనీలు.. తమదైన వ్యూహాలతో మార్కెట్‌పై పట్టు సాధించాయి. మధ్యలో చాలా దేశీయ కంపెనీలు వాటికి గట్టి పోటీనివ్వాలని భావించినా అవేవీ సఫలం కాలేదు. చాలా ఏళ్లు తర్వాత ప్రముఖ వ్యాపార వేత్త, రిలయన్స్ (Reliance) అధినేత ముకేశ్ అంబానీ ఒకప్పటి ఫేమస్ డ్రింక్ ‘కాంపా’ను (Campa drinks) తిరిగి మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇటీవలే కోలాతో పాటు లెమన్, ఆరెంజ్ రుచుల్లో తీసుకొచ్చారు. ఇప్పటికిప్పుడు విదేశీ కంపెనీలకు గట్టి పోటీనివ్వలేకపోయినా.. క్రమంగా తన మార్కెట్ వాటాను పెంచుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం ఒకప్పుడు టెలికాం మార్కెట్‌లో ‘జియో’ విషయంలో అనుసరించిన వ్యూహాన్నే అమలు చేస్తోందని ఆంగ్లవార్తా సంస్థ ‘రాయిటర్స్’ పేర్కొంది.
సరిగ్గా ఏడేళ్ల క్రితం టెలికాం మార్కెట్‌లో రిలయన్స్ జియో సంచలనం సృష్టించింది. చౌక ధరకే డేటా, అపరిమిత కాల్స్‌తో భారీ సంఖ్యలో వినియోగదారులును ఆకట్టుకున్న ఆ సంస్థ.. ఇప్పుడు అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్‌గా అవతరించింది. ఇదే వ్యూహాన్ని సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్లోనూ అనుసరించాలని రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ భావిస్తోంది. ఇందుకోసం ధరలు తక్కువ ధరలకే విక్రయించడంతో పాటు దేశవ్యాప్తంగా విస్తరించిన రిటైల్ నెట్‌వర్క్‌ను వాడుకోబోతోందని తెలిపింది. స్వదేశీ సెంటిమెంట్ సైతం ఆ సంస్థకు అక్కరకు రాబోతోందని రాయిటర్స్ తన కథనంలో తెలిపింది.
గతేడాది కాంపా బ్రాండ్‌ను కొనుగోలు చేసిన రిలయన్స్ ప్రస్తుతం ఔట్‌సోర్సింగ్ ద్వారా ఉత్పత్తి చేపట్టింది. త్వరలో సొంతంగా ఫ్యాక్టరీలు లేదా జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేసి తయారీని విస్తృతం చేయాలని కంపెనీ నిర్ణయించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. అలాగే హోటళ్లకు, రెస్టారెంట్లకు, విమానాల్లో విక్రయానికి ఉంచాలని కంపెనీ చూస్తోంది. ప్రస్తుతం కాంపా కోలా రెండు లీటర్ల బాటిల్‌ను స్టోర్లలో రూ.49లకే విక్రయిస్తున్నారు. లేబుల్ ధరతో పోలిస్తే ఇది సగం మాత్రమే. కోక్, పెప్సీతో పోలిస్తే మూడో వంతు తక్కువ ధరకే రిలయన్స్ ఈ పానీయాన్ని విక్రయిస్తోంది. తక్కువ ధరకే విక్రయించడం మార్కెట్‌ను పెంచుకోవడంలో భాగమని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. త్వరలో ప్రారంభం కాబోయే ఐపీఎల్ క్రికెట్ టోర్నీలో కాంపా గురించి భారీ ఎత్తున ప్రకటనలు ఇచ్చేందుకు రిలయన్స్ సిద్ధమవుతోందని, రీఫ్రెష్‌మెంట్ పార్టనర్‌గా నియమించుకునేందుకు మూడు జట్లతో చర్చలు జరుపుతోందని తెలిపారు. రిలయన్స్‌కు దేశవ్యాప్తంగా రిటైల్ నెట్‌వర్క్ ఉంది. దాదాపు 2,500 స్టోర్లు ఉన్నాయి. ఈ నెట్‌వర్క్ ద్వారా కాంపా సేల్స్‌ను పెంచాలని ఇప్పటికే కంపెనీ అంతర్గతంగా లక్ష్యాలు నిర్దేశించినట్లు తెలిసింది. మరోవైపు జియో మార్ట్ పేరుతో నిర్వహిస్తున్న షాపింగ్ యాప్ ద్వారా విక్రయాలు పెంచుకోవడానికి వాడుకోనే యత్నాలు చేపట్టింది.
స్వదేశీ మంత్రం..
కాంపాను గ్రేట్ ఇండియన్ టేస్ట్, రిచ్ హెరిటేజ్ పేరుతో రిలయన్స్ ప్రమోట్ చేస్తోంది. ఇండియా ఫస్ట్ నినాదంతో వచ్చే కంపెనీల పట్ల సాధారణంగా అమెరికా కంపెనీలు ఆందోళన చెందుతుంటాయని పెప్సీలో గతంలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన ఓ వ్యక్తి పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ సర్కారు సైతం ఆత్మనిర్భరతకు పెద్దపీట వేస్తుండడం ఆయా కంపెనీల్లో గుబులు పెంచుతోందని తెలిపారు. అందుకే ఆ రెండు కంపెనీలు రిలయన్స్ మార్కెటింగ్ స్ట్రాటజీని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే పలు రిలయన్స్ ఔట్‌లెట్స్‌లో కాంపా సాఫ్ట్ డ్రింక్స్‌ను ముఖ ద్వారాల వద్ద ఏర్పాటు చేస్తున్నారని రాయిటర్స్ పేర్కొంది. అయితే, ఏళ్లుగా విదేశీ కంపెనీల సాఫ్ట్ డ్రింక్స్‌కు అలవాటు పడిన జనం ఎంత మేర కాంపాను ఆదరిస్తారో తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందేనని కన్జూమర్ అనలిస్ట్ ఒకరు పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
అడవిలో.. పాపం పసివాళ్లు ఏమయ్యారో!
-
India News
Deemed University Status: డీమ్డ్ యూనివర్సిటీ హోదాకు కొత్త నిబంధనలు
-
Ts-top-news News
Delhi Liquor Policy Case: ఈడీ అధికారులు బెదిరించడం వల్లే కవిత పేరు చెప్పారు
-
General News
Odisha Train Accident : అక్కడి వాతావరణం భీతావహం.. ‘ఈనాడు’తో ఏపీ ప్రయాణికులు
-
India News
అరిహాను స్వదేశానికి పంపండి.. మూడేళ్ల పాప కోసం జర్మనీపై భారత్ ఒత్తిడి
-
India News
Train Accidents: దశాబ్దకాలంలో జరిగిన పెను రైలు ప్రమాదాలివీ..