Apple vs Samsung: శాంసంగ్‌కు యాపిల్‌ షాక్‌.. స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో అగ్రస్థానానికి

Apple vs Samsung: శాంసంగ్‌కు యాపిల్‌ షాకిచ్చింది. ప్రపంచ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో అగ్రస్థానానికి చేరింది. 2010 నుంచీ శాంసంగ్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Updated : 17 Jan 2024 18:25 IST

Apple vs Samsung | ఇంటర్నెట్ డెస్క్‌: దక్షిణకొరియాకు చెందిన మొబైల్‌ తయారీ సంస్థ శాంసంగ్‌కు (Samsung) యాపిల్ (Apple) షాకిచ్చింది. ప్రపంచ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో రారాజుగా వెలుగొందుతున్న ఆ కంపెనీని తొలిసారి వెనక్కి నెట్టింది. దాదాపు 12 ఏళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న శాంసంగ్‌ను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్మార్ట్‌ఫోన్లు సరఫరా చేసిన  కంపెనీగా తొలిసారి అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు 2023కు ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌ (IDC)కు సంబంధించిన గణాంకాలు వెలువరించింది.

ప్రపంచవ్యాప్తంగా మొబైల్‌ సరఫరా విషయంలో శాంసంగ్‌ 2010 నుంచి అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. అలాంటిది తొలిసారి యాపిల్‌ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2023లో మొత్తం 235 మిలియన్‌ యూనిట్లను యాపిల్ సరఫరా చేసినట్లు ఐడీసీ పేర్కొంది. ప్రపంచ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో ఐదో వంతు ఫోన్లను యాపిల్‌ సరఫరా చేసినట్లు ఐడీసీ తెలిపింది. ఆ సమయంలో శాంసంగ్‌ 226.6 మిలియన్‌ యూనిట్లు మాత్రమే సరఫరా చేసినట్లు పేర్కొంది. 19.4 శాతం వాటాతో రెండో స్థానంలో నిలిచినట్లు తెలిపింది. షావోమీ, ఒప్పో.. వంటి కంపెనీలు తదుపరి స్థానాల్లో ఉన్నాయి.

టాటా పంచ్‌ ఈవీ వచ్చేసింది.. సింగిల్‌ ఛార్జ్‌తో 421km రేంజ్‌

 కొత్త మోడళ్లను విడుదల చేసినప్పుడు పాత ఫోన్లపై ఆఫర్లు ప్రకటించడం, వడ్డీ లేని రుణాలు, ప్రీమియం డివైజులకు గిరాకీ పెరగడం వంటివి యాపిల్‌ సక్సెస్‌కు కారణాలుగా ఐడీసీ విశ్లేషించింది. యాపిల్‌కు అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన చైనాలో ప్రభుత్వ ఆంక్షలు, ఆ దేశ కంపెనీ అయిన హువావే నుంచి గట్టి పోటీని తట్టుకుని మరీ ఈ లక్ష్యం సాధించిందని ఐడీసీ రీసెర్చ్‌ డైరెక్టర్‌ నబిలా పోపాల్‌ తెలిపారు. మరోవైపు ఆండ్రాయిడ్‌ ఫోన్లు తయారుచేసే శాంసంగ్‌ కంపెనీ షావోమీ నుంచి పోటీ ఎదుర్కొంటోంది. 2023లో 1.2 బిలియన్‌ స్మార్ట్‌ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవగా.. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 3 శాతం మేర విక్రయాలు తగ్గినట్లు ఐడీసీ తెలిపింది. ఆండ్రాయిడ్‌ సెగ్మెంట్‌లో పోటీ పెరగడం, ఫోల్డబుల్‌ ఫోన్లు, ఏఐపై కస్టమర్లు ఆసక్తి చూపుతుండడంతో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ ఆసక్తిగా మారిందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు