Automobile retail sales: వాహన రిటైల్‌ విక్రయాల్లో 16% వృద్ధి

Automobile retail sales: కొత్త మోడళ్ల విడుదల, సరఫరాలో వృద్ధి, బుకింగ్‌ల రద్దు తగ్గడం, పెళ్లిల్ల సీజన్‌ ఆరంభం.. వంటి అంశాలు ఫిబ్రవరిలో వాహన విక్రయాలు పెరగడానికి దోహదం చేశాయి.

Published : 06 Mar 2023 14:55 IST

దిల్లీ: ఫిబ్రవరి వాహన రిటైల్‌ విక్రయా (Automobile retail sales)ల్లో రెండంకెల వృద్ధి నమోదైంది. ద్విచక్ర వాహనాలు, ప్రయాణికుల వాహన విభాగాల్లో గణనీయ అమ్మకాలు అందుకు దోహదం చేశాయని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా (FADA) వెల్లడించింది. 

అన్ని విభాగాల్లో కలిపి రిజిస్ట్రేషన్ల సంఖ్య 17,75424 యూనిట్లకు చేరింది. 2022 ఫిబ్రవరిలో ఈ సంఖ్య 15,31,196గా ఉంది. 16 శాతం వృద్ధి నమోదైంది. ప్రయాణికుల వాహన రిటైల్‌ విక్రయాలు 11 శాతం పెరిగి 2,87,182 యూనిట్లకు చేరాయి. కొత్త మోడళ్ల విడుదల, సరఫరాలో వృద్ధి, బుకింగ్‌ల రద్దు తగ్గడం, పెళ్లిల్ల సీజన్‌ ఆరంభం.. వంటి అంశాలు విక్రయాలు పెరగడానికి దోహదం చేసినట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్‌రాజ్‌ సింఘానియా వెల్లడించారు.

ద్విచక్రవాహన రిజిస్ట్రేషన్లు 15 శాతం పెరిగి 12,67,233 యూనిట్లకు చేరాయి. అయితే, కొవిడ్‌ వ్యాప్తి తీవ్రం కావడానికి ముందు 2020 ఫిబ్రవరితో పోలిస్తే మాత్రం విక్రయాల్లో ఇంకా 14 శాతం క్షీణత ఉందని సింఘానియా తెలిపారు. కొత్త ఉద్గార ప్రమాణాలు ఏప్రిల్‌ నుంచి అమల్లోకి రానుండడం, పెళ్లిల్ల సీజన్‌ ప్రారంభం కావడం వల్ల ద్విచక్ర వాహనాలకు డిమాండ్‌ పుంజుకున్నట్లు తెలిపారు.

వాణిజ్య వాహన విక్రయాలు ఫిబ్రవరిలో 17 శాతం పెరిగి 79,027 యూనిట్లకు చేరాయి. కొవిడ్‌ కంటే ముందుతో పోలిస్తే మాత్రం ఇంకా 10 శాతం పుంజుకోవాల్సి ఉంది. త్రిచక్ర వాహన విక్రయాలు 81 శాతం పెరిగి 72,994గా నమోదయ్యాయి. ట్రాక్టర్ల విక్రయాలు సైతం 14 శాతం పుంజుకొని 68,988 యూనిట్లకు పెరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని