IRCTC Ticket Booking: రైలు టికెట్‌ ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి!

IRCTC Ticket Booking: ఐఆర్‌సీటీసీ టికెట్‌ బుకింగ్‌ విషయంలోనూ ‘బై నౌ పే లేటర్‌’ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ మేరకు వివిధ వేదికలతో చేతులు కలిపింది. ఈ సదుపాయంతో ప్రయాణికులు ముందు డబ్బులు చెల్లించకుండానే టికెట్‌ బుక్‌ చేసుకునే వెసులుబాటు ఉంది.

Updated : 17 May 2023 10:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అత్యవసరంగా రైలులో ప్రయాణించాలా? డబ్బులకు ఇబ్బందిగా ఉందా? అలాంటి సమయంలో టికెట్‌ ముందే బుక్‌ (Train Ticket Booking) చేసుకొని డబ్బులు మాత్రం తర్వాత చెల్లించొచ్చు. ఇందుకు అందుబాటులో ఉన్న మార్గాలేంటో చూద్దాం..

ఈ సేవలను ప్రయాణికులకు అందించడం కోసం ఐఆర్‌సీటీసీ (IRCTC) క్యాష్‌ఈ, పేటీఎం, ఈపేలేటర్‌తో చేతులు కలిపింది. క్యాష్‌ఈ ‘ట్రావెల్‌ నౌ పే లేటర్‌ (TNPL)’ పేరిట ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. పేటీఎం.. పోస్ట్‌పెయిడ్‌ కింద ఈ వెసులుబాటును అందుబాటులో ఉంచింది. మరి ఈ ఆప్షన్‌ను ఎలా వినియోగించుకోవాలో చూద్దాం..

పేటీఎం పోస్ట్‌పెయిడ్‌..

పేటీఎం తమ యూజర్ల కోసం పోస్ట్‌పెయిడ్‌ సర్వీసులను అందిస్తోంది. 30 రోజుల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా పేటీఎం తమ యూజర్లకు రూ.60,000 వరకు రుణంగా ఇస్తోంది. బిల్లింగ్‌ సైకిల్‌ ముగిసేలోపు చెల్లిస్తే ఎలాంటి వడ్డీ ఉండదు. కావాలంటే దీన్ని ఈఎంఐగా కూడా మార్చుకోవచ్చు. దీన్ని ఉపయోగించుకొని ఐఆర్‌సీటీసీ (IRCTC)లో ట్రైన్‌ టికెట్లు కూడా బుక్‌ చేసుకోవచ్చు.

  • ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో లాగిన్‌ కావాలి.
  • బయలుదేరే ప్రాంతం, గమ్యస్థానం సహా ఇతర ప్రయాణ వివరాలు ఎంటర్‌ చేయాలి.
  • బుక్‌ టికెట్‌పై క్లిక్‌ చేయాలి
  • పేమెంట్‌ సెక్షన్‌లో పే లేటర్‌ ఆప్షన్‌ను ఎంచుకొని పేటీఎం పోస్ట్‌పెయిడ్‌ను ఎంపిక చేసుకోవాలి.
  • పేటీఎం లాగిన్‌ వివరాలతో పాటు ఓటీపీ ఎంటర్‌ చేయడంతో టికెట్‌ బుకింగ్‌ ప్రక్రియ పూర్తవుతుంది.

క్యాష్‌ఈ ద్వారా ఇలా..

  • ఐఆర్‌సీటీసీ రైల్‌ కనెక్ట్‌ యాప్‌ను ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
  • ప్రయాణ వివరాలను ఎంటర్‌ చేసి బుక్‌ టికెట్‌ఫై క్లిక్‌ చేయాలి.
  • పేమెంట్‌ ఆప్షన్లలో ‘ట్రావెల్‌ నౌ పే లేటర్‌’ (TNPL)ను ఎంచుకోవాలి.
  • టీఎన్‌పీఎల్‌ అందిస్తున్న వాటి నుంచి క్యాష్‌ఈని ఎంపిక చేసుకోవాలి.
  • టికెట్‌ బుకింగ్‌ పూర్తవుతుంది. డబ్బును ఈఎంఐల కింద మూడు లేదా ఆరు నెలల పాటు చెల్లించే వెసులుబాటు ఉంటుంది.

ఈపేలేటర్‌ అనే ఫిన్‌టెక్‌ సంస్థ సైతం ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. అయితే, 14 రోజుల్లోగా టికెట్‌ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే 36 శాతం వడ్డీ పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని