చంద్రయాన్‌-3 నుంచి యాపిల్‌ ఈవెంట్‌ దాకా.. యూట్యూబ్‌లో టాప్‌-10 లైవ్‌ స్ట్రీమింగ్‌లివే

వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ (World of Stastics) నివేదిక ప్రకారం ఇప్పటి దాకా యూట్యూబ్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌లో ఎక్కువ మంది చూసిన టాప్‌-10 జాబితా వివరాలివే..

Updated : 29 Aug 2023 14:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చంద్రయాన్-3 (Chandrayaan 3) అద్భుత విజయం సాధించడమే కాదు.. యూట్యూబ్‌లోనూ కొత్త రికార్డును సృష్టించింది. వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ (World of Stastics) నివేదిక ప్రకారం.. యూట్యూబ్‌లో చంద్రయాన్‌-3 లైవ్‌ స్ట్రీమింగ్ మొదటి స్థానంలో నిలిచింది. ఏ క్రికెట్‌ మ్యాచూ ఫుట్‌బాల్‌ మ్యాచూ అందుకోని అరుదైన ఫీట్‌ను సొంతం చేసుకుంది. ఆ టాప్‌-10 జాబితా వివరాలివే..

  1. చంద్రుడిపై విక్రమ్‌ ల్యాండర్‌ దిగే క్షణాలను ఆగస్టు 23న ఇస్రో యూట్యూబ్‌ ఛానల్‌లో లైవ్‌ స్ట్రీమ్‌ చేసింది. ఈ స్ట్రీమింగ్‌ను ఒకేసారి 82 లక్షల మందికిపైగా తిలకించారు. ఇప్పటి దాకా యూట్యూబ్‌లో ఎక్కువ మంది చూసిన లైవ్‌ స్ట్రీమ్‌ ఇదే.
  2. గతేడాది డిసెంబరులో బ్రెజిల్‌ (Brazil) - దక్షిణ కొరియా (South Korea) జట్ల మధ్య జరిగిన ఫిఫా ఫుట్‌బాల్ 2022 (Fifa Football Cup 2022) మ్యాచ్‌ను కేజ్‌టీవీ (Caze TV) అనే యూట్యూబ్‌ ఛానల్‌లో సుమారు 61 లక్షల మంది వీక్షించారు. చంద్రయాన్‌-3 తర్వాత ఎక్కువ మంది వీక్షించిన లైవ్‌ స్ట్రీమ్‌గా ఇది రికార్డు నెలకొల్పింది. 
  3. దాని తర్వాత కేజ్‌టీవీలో గతేడాది డిసెంబరులో ప్రసారమైన బ్రెజిల్‌ - క్రొయేషియా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ను 52 లక్షల మంది చూశారు. ఫిఫా వరల్డ్‌ కప్‌ 2022లో భాగంగా ఈ మ్యాచ్‌ ఖతార్‌లోని ఎడ్యుకేషన్‌ సిటీ స్టేడియంలో జరిగింది. 
  4. నాలుగో స్థానంలో కూడా ఫుట్‌బాల్‌ మ్యాచే ఉంది. ఈ ఏడాది మార్చిలో బ్రెజిల్‌ (Brazil)లో జరిగిన కారియోకా (Carioca) ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా వాస్కో-ఫ్లెమింగో జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ లైవ్‌స్ట్రీమ్‌ను కేజ్‌టీవీ యూట్యూబ్‌ ఛానల్‌లో 48 లక్షల మంది వీక్షించారు. 
  5. ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ( Elon Musk)కు చెందిన అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్‌ (SpaceX) సంస్థ వ్యోమగాములను ఇంటర్నేషనల్‌ స్పేష్‌ స్టేషన్‌కు పంపేందుకు క్రూ డెమో అనే స్పేస్‌ఫ్లైట్‌ను తయారు చేసింది. దానికి నాసా (NASA) నుంచి అనుమతి పొందేందుకు 2020 మే నెలలో జరిపిన ప్రయోగ పరీక్షల లైవ్‌ స్ట్రీమింగ్‌ను 40 లక్షల మంది చూశారు. 
  6. దక్షిణ కొరియా (Suth Korea)కు చెందిన పాపులర్‌ మ్యూజిక్ బృందం బీటీఎస్‌ (BTS) విడుదల చేసిన బట్టర్‌ (Butter) అనే మ్యూజిక్‌ వీడియో స్ట్రీమింగ్‌ను 3,75,000 మంది వీక్షించారు. 2021 మేలో ఇది యూట్యూబ్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ అయింది. 
  7. ఏడో స్థానంలో యాపిల్‌ ఈవెంట్‌ (Apple Event) ఉంది. గతేడాది సెప్టెంబరులో ఐఫోన్ 14 (iPhone 14) సిరీస్‌తోపాటు యాపిల్‌ వాచ్‌ సిరీస్‌8, యాపిల్ వాచ్‌ ఎస్‌ఈ, యాపిల్‌ వాచ్‌ అల్ట్రా, ఎయిర్‌పాడ్స్‌ ప్రోలను విడుదల చేసింది. ఈ కార్యక్రమం లైవ్‌ స్ట్రీమింగ్‌ను యూట్యూబ్‌లో 3,69,000 మంది చూశారు. 
  8. హాలీవుడ్‌ (Hollywood)లో సంచలనం సృష్టించిన జానీ డెప్‌ (Johnny Depp) - అంబర్‌ హెర్డ్‌ (Amber Heard)ల పరువు నష్టం కేసుకు సంబంధించిన న్యాయస్థానం తీర్పును లా అండ్‌ క్రైమ్‌ నెట్‌వర్క్ అనే యూట్యూబ్‌ ఛానల్‌లో 3,55,000 మంది వీక్షించారు. గతేడాది జూన్‌లో ప్రసారమైన ఈ లైవ్‌ స్ట్రీమింగ్‌ ఎనిమిదో స్థానంలో నిలిచింది. 
  9. ఫ్లూమినెన్స్ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (Fluminense Football Club) ఆధ్వర్యంలో ఈ ఏడాది జులైలో యూట్యూబ్‌లో లైవ్‌ స్ట్రీమ్‌ అయిన ఫ్లూమినెన్స్ - ఫ్లెమింగో జట్ల మధ్య మ్యాచ్‌ను 3,53,000 మంది చూశారు.
  10. ఇక పదో స్థానంలో ఇదే క్లబ్‌ ఆధ్వర్యంలో 2020 జులైలో జరిగిన కారికో ఛాంపియన్‌షిప్‌ (Carico Champ) మ్యాచ్‌ను 3,25,000 మంది చూశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని